తాపేశ్వరీ దేవి ఆలయం..సీతమ్మ ఇక్కడ తపస్సు చేసిందట

 

తాపేశ్వరీ దేవి ఆలయం..సీతమ్మ ఇక్కడ తపస్సు చేసిందట


సనతాన ధర్మంలోని ఇతిహాసాలలో రామాయణం చాలా ముఖ్యమైనది. రాముడి జననం నుండి ఆయన అవతారం పరిసమాప్తి వరకు ఎన్నో విషయాలు రామాయణంలో ఉంటాయి. వనవాస కాలంలో   రాముడు  భారతదేశం మొత్తంలో చాలా  ప్రదేశాలు తిరిగాడని చెబుతారు.  ఆ ప్రాంతాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  ఈ ప్రాంతాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ప్రదేశాలలో తాపేశ్వరీ దేవి ఆలయం కూడా ఒకటి. వాల్మీకి రచించిన రామాయణంలోని ఉత్తరకాండలో ఈ ప్రదేశం ప్రస్తావించబడింది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

సీతమ్మ తపస్సు..

శ్రీరాముడు అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత, సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముని నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఈ ప్రదేశంలో తపస్సు చేసిందట. సీతతో పాటు, కమల, విమల, సరస్వతి అనే నలుగురు దేవతలు కూడా ఈ ప్రదేశంలో తపస్సు చేశారట. సీతాదేవి లక్ష్మీదేవి అవతారం అని నమ్ముతారు. ఆమె బాధను చూసి, ఆ ముగ్గురు దేవతలు కూడా సీతమ్మ బాధను ఆపడానికి తపస్సు చేశారట. అప్పటి నుండి, ఈ ప్రదేశానికి తాపేశ్వరి అని పేరు వచ్చింది.

ఈ ప్రాంతంలో ఇప్పటికీ నాలుగు విగ్రహాలు ఉన్నాయట,  నవరాత్రుల సమయంలో ఈ ప్రదేసంలో భక్తులు కిక్కిరిసిపోతారు. నేటికీ ప్రజలు ఇక్కడ హోమాలు, పూజలు నిర్వహిస్తారు , తమ కోరికలు నెరవేరినప్పుడు గంటలు కట్టడం ఇక్కడ ఆనవాయితీ.

లవకుశల పుట్టువెంట్రుకలు..

ఈ ప్రాంతంలోనే సీతాదేవి తన ఇద్దరు కుమారులైన లవకుశులకు పుట్టు వెంట్రుకలలు తీయించి, చెవులు కుట్టించే కార్యక్రమాన్ని నిర్వహించిందట. అప్పటి నుండి ఈ ప్రదేశంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం,  చెవులు కుట్టించడం వంటి  కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.  ఈ కార్యక్రమాలు చేయించడానికి ఈ ప్రదేశం చాలా ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంత ప్రాముఖ్యతను తెలుసుకుని, నలుమూలల నుండి ప్రజలు తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి  , చెవులు కుట్టించడానికి ఇక్కడికి వస్తారు. అందుకే  ఈ ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అంతేకాకుండా, నూతన వధూవరులు ఇక్కడ  దేవతను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఆశీర్వాదం పొందడం వల్ల సంతోషకరమైన , సంతృప్తికరమైన వైవాహిక జీవితం లభిస్తుందని నమ్ముతారు.

 

                                    *రూపశ్రీ.