దుర్గా దేవి రూపం.. ఆయుధాల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు!
దుర్గా దేవి రూపం.. ఆయుధాల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు!
భారతీయు ధర్మం మహిళను శక్తి స్వరూపం అని చెబుతుంది. భారతదేశంలో కూడా శక్తి ఆరాధన చాలా ప్రాముఖ్యం చెందింది. అమ్మవారి ఆరాధనకు నవరాత్రులు చాలా ప్రాశస్తమైనవి. ప్రస్తుతం చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా అమ్మవారిని తొమ్మిది రోజులు ఎంతో నియమ నిష్టలతో ఆరాధించడం జరుగుతుంది. అమ్మవారి స్వరూపం అనగానే దుర్గాదేవి గుర్తుకు వస్తుంది. దుర్గాదేవి స్వరూపంలో చేతిలో ఆయుధాలు, సింహ వాహనం, ఎరుపు రంగు చీర.. ఇలా అన్ని ఉంటాయి. అయితే వీటి వెనుక గల రహస్యాలు చాలా మందికి తెలియవు. వీటి గురించి తెలుసుకుంటే..
చక్రం..
విశ్వ కార్యకలాపాలకు ప్రతీకగ దుర్గాదేవి చేతులలో ఉండే సుదర్శన చక్రాన్ని భావిస్తారు. ఈ విశ్వమంతా ఒక దైవిక శక్తిచే పాలించబడుతుందని సూచిస్తుంది. ఇది కాలం, చలనం, సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తూ, ప్రతి సృష్టి కార్యం ఒక నిర్దిష్ట నియమ నిబంధనల పరిధిలోనే జరుగుతుందని తెలియజేస్తుంది.
ఖడ్గం..
జ్ఞానం, వివేకం వంటి శక్తులకు ప్రతిరూపం ఖడ్గం.
ఆ అమ్మవారి చేతులలో అలంకరించబడిన ఖడ్గం కేవలం యుద్ధ ఆయుధం మాత్రమే కాదు, అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన శక్తికి కూడా ఒక చిహ్నం. ఖడ్గం నుండి వెలువడే ప్రకాశం, జ్ఞానం జీవితంలో సత్యానికి, స్పష్టతకు మార్గం సుగమం చేస్తుందని సూచిస్తుంది.
విల్లు, బాణం..
శక్తి, ఏకాగ్రతకు ప్రతిరూపం విల్లు బాణం అని చెబుతారు.
విల్లు, బాణం రెండు రకాల శక్తులను సూచిస్తాయి. విల్లు స్థిర శక్తికి ప్రతీక అయితే, బాణం చలనాత్మక శక్తిని సూచిస్తుంది. శక్తిని సరైన దిశలో, ఏకాగ్రతతో ఉపయోగించినప్పుడు లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఇది తెలియజేస్తుంది.
శంఖం..
శుభానికి, దైవిక ప్రకంపనలకు చిహ్నమైన
అమ్మవారి శంఖం శబ్దం చాలా పవిత్రమైనది. దాని శబ్దం ప్రతికూలతను పారద్రోలి, వాతావరణంలోకి సానుకూల శక్తిని నింపుతుంది. ఇది జీవిత ప్రారంభానికి, ఆధ్యాత్మిక జాగృతికి ప్రతీక.
గద..
ధైర్యానికి, అంతర్గత బలానికి చిహ్నమైన గద, శక్తి, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. జీవితంలోని సవాళ్లను ధైర్యంతో, సహనంతో ఎదుర్కోవాలనే సందేశాన్ని ఇది తెలియజేస్తుంది.
తామరపువ్వు..
పవిత్రత, ఆత్మవికాస సందేశాన్ని తామరపువ్వు ఇస్తుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా మనిషి తన ఆలోచనలు, చేతలలో పవిత్రతను కాపాడుకోగలడని తామరపువ్వు బోధిస్తుంది. బురదలో కూడా తామర పవిత్రత.. ఆత్మవికాసానికి, ఆధ్యాత్మిక పురోగతికి సంకేతం.
త్రిశూలం..
గుణాలలో సమతుల్యత భావనకు త్రిశూలం సంకేతం. త్రిశూలం మూడు కొనలు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయి. జీవితంలో ఈ ప్రవృత్తుల మధ్య సమతుల్యతను పాటించవలసిన అవసరాన్ని ఇది సూచిస్తుంది.
ఎరుపు..
శక్తి, ప్రకాశం, శుభానికి చిహ్నం. దుర్గాదేవికి సమర్పించే వస్త్రాలు, పువ్వులు, ఆభరణాలలో ఎరుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రంగును బలం, ఉత్సాహం, ధైర్యం, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, ఎరుపు రంగు అగ్ని తత్వంతో.. సూర్యుడు, అంగారకుడి శక్తితో కూడా ముడిపడి ఉంటుంది. ఇవి సాధకుడి జీవితంలో ప్రకాశాన్న, సానుకూలతను నింపుతాయి.
*రూపశ్రీ.