చైత్ర నవరాత్రుల గురించి తెలుసా...ఇందులో అమ్మవారి అవతారాలేంటంటే!

 

చైత్ర నవరాత్రుల గురించి తెలుసా...ఇందులో అమ్మవారి అవతారాలేంటంటే!

హిందువులు అమ్మవారిని శక్తిగా పూజిస్తారు. లోకానికి అమ్మగా భావిస్తారు. సాధారణంగా శరదృతువులో వచ్చే శరన్నవరాత్రి వేడుకల గురించి, ఆ సమయంలో ఉండే భక్తి పారవశ్యం గురించి అందరికీ తెలిసిందే.. అయితే చాలామందికి చైత్ర నవరాత్రుల గురించి తెలియదు. వసంతకాలం ప్రారంభాన్ని సూచించే చైత్రనవరాత్రుల వేడుకలో దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి వివిధ అవతారాలలో  దర్శనమిస్తుంది. ఈ అవతారాలు శరన్నవరాత్రిలో అమ్మవారి అవతారాలే.. చైత్రనవరాత్రలలో అమ్మవారి అవతారాలేంటో.. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటే...

శైలపుత్రి..

నవదుర్గ యొక్క మొదటి రూపం శైలపుత్రి పర్వత రాజు కుమార్తె ఈమె.  ఆమె బలం, సంకల్పం,  స్వచ్ఛతతో ఉంటుంది.  ఈ అమ్మను పూజించే వారికి  స్థిరత్వం,  ధైర్యం లభిస్తాయి.

బ్రహ్మచారిణి..

అమ్మవారి రెండవ అవతారం బ్రహ్మచారిణి. ఈ అమ్మ  తపస్సుకు ప్రతీక. ఆమె జపమాల,  కమండలం పట్టుకొని పాదరక్షలు  లేకుండా నడుస్తున్నట్లు  ఉంటుంది. ఈ అమ్మను  ఆరాధించడం వల్ల జ్ఞానం,  ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు.


చంద్రఘంట..

దుర్గా దేవి మూడవ అవతారం చంద్రఘంట. ఆమె నుదుటిపై  అర్ధ చంద్రుని ఆకారం ఉంటుంది.   ఈ కారణంగానే చంద్రఘంట అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు.   శాంతి, ప్రశాంతత,  ధైర్యం ఈ అమ్మలో ఉండే గుణాలు.  ఈ అమ్మను పూజిస్తే  ధైర్యం వస్తుంది.  దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది.

కూష్మాండ..

కూష్మాండ అమ్మవారి నాల్గవ అవతారం. విశ్వం  సృష్టికర్తగా ఈ అమ్మ  గౌరవించబడుతుంది. ఆమె ఎనిమిది చేతులతో వివిధ ఆయుధాలు,  జపమాల పట్టుకొని ఉంటుంది. కూష్మాండను పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద,  శ్రేయస్సు లభిస్తాయి.

స్కందమాత..

అమ్మలాకి ఐదవ రూపం స్కందమాత.   స్కందుడి  (కార్తికేయ) తల్లిగా పూజించబడుతోంది. ఆమె  ప్రేమ, కరుణ,  పోషణకు ప్రతీక. భక్తులు తమ పిల్లల శ్రేయస్సు,  విజయం కోసం ఈ అమ్మ  ఆశీర్వాదం కోరుకుంటారు.

కాత్యాయని..

కాత్యాయని అమ్మవారి ఆరవ స్వరూపం. ఆమె ఉగ్ర రూపంలో ఉంటుంది. ధైర్యం, విజయం,  రక్షణ కోసం ఈ అమ్మను పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను అధిగమించడం కోసం  ఈ  అమ్మను ప్రార్థిస్తారు.


కాళరాత్రి..

కాళరాత్రి అమ్మవారి  ఏడవ అవతారం. చీకటిని,  అజ్ఞానాన్ని నాశనం చేసేదిగా గౌరవించబడుతుంది. ఆమె ముదురు రంగుతో,  గాడిదపై స్వారీ చేస్తూ, కత్తి పట్టుకుని, తన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది. కాళరాత్రిని ఆరాధించడం వల్ల భయం పోయి  అంతర్గత బలం చేకూరుతుందని నమ్ముతారు.


మహాగౌరి..

మహాగౌరి అమ్మవారి  ఎనిమిదవ రూపం. స్వచ్ఛత, ప్రశాంతతకు ఈ అమ్మ ప్రతీక. ఆమె తెల్లని వస్త్రధారణలో, శాంతి, ప్రశాంతతో దర్శనమిస్తుంది. మనస్సు, శరీరం,  ఆత్మ  శుద్ధి కోసం భక్తులు   ఈ అమ్మను పూజిస్తారు.


సిద్ధిదాత్రి..

అమ్మవారి తొమ్మిదవ,  చివరి రూపం సిద్ధిదాత్రి. అతీంద్రియ శక్తులను,  ఆశీర్వాదాన్ని ఈ అమ్మ ఇస్తుంది.  ఈ అమ్మ  కమలం, గద,  శంఖం, చక్రం  పట్టుకుని నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక పరిణామం,  దైవిక జ్ఞానం కోసం భక్తులు ఈమెను ప్రార్థిస్తారు.


                                             *నిశ్శబ్ద.