అయోధ్యలో జరిగిందేమిటి?
అయోధ్యలో జరిగిందేమిటి?
రాముడు పుష్పక విమానం నుండి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని "ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుండి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ" అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో "మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీరు ఎంత మంచివారు" అని అందరినీ కౌగలించుకున్నాడు.
పుష్పకం నుండి కిందకి దిగిన వానరకాంతలు అక్కడున్న ఆడవారి రూపాలను, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు వాళ్ళందరితో "ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము" అని, వాళ్ళందరికీ చెప్పి తలస్నానం చేయించారు.
తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని "కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో" అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
భరతుడు తలవంచి నమస్కారం చేసి రాముడితో "మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని వ్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను" అన్నాడు.
భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.
శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి "అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో" అన్నాడు.
అప్పుడు రాముడు "నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నామీద ఉన్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యము మీద మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను" అన్నాడు.
భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.
తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొని వచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.
◆నిశ్శబ్ద.