భగవంతుడి విషయంలో నేటి మనిషి పరిస్థితి ఇదే..
భగవంతుడి విషయంలో నేటి మనిషి పరిస్థితి ఇదే..
సంసారజీవితంలో చాలామంది అమాయకంగా పడికొట్టుకు పోతుంటారు. అంతా తమ ప్రమేయంతోనే నడుస్తుందన్న అహంకారంతో ఉంటారు! కేవలం మనం కుటుంబజీవితాన్ని గడపడానికీ, మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికీ ఈ లోకంలోకి రాలేదు. అది అటు, ఇటుగా ఏ జీవరాశులైనా చేస్తూ ఉంటాయి. మనకే కాదు, మామూలు జంతుజాతులకు కూడా కుటుంబాలుంటాయి, వారసులూ ఉంటారు. కానీ మనం అంతకు మించిన భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని ఎవరికి వారు తెలుసుకోవాలి. పాతికేళ్ళ వయస్సులో మాదిరి, ముప్పాతిక వయస్సులో కూడా ఇల్లేమైపోతుందో, భార్యేమైపోతుందో, బిడ్డలేమైపోతారో అని చింతిస్తూ కూర్చుంటే, అంతకు మించిన అవివేకం మరోటి లేదు. మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతూ ఉంటే, ఇంకెవరో, ఏదో అయిపోతారని ఆందోళన పడుతున్నామంటే అవివేకమే!
అందుకే గౌతమ బుద్ధుడు ఇలా అంటాడు…
పుత్రా మే సంతి ధనం మే అస్తి ఇతి బాలో విహన్యతే | ఆత్మా హి ఆత్మనో నాస్తి కుతః పుత్రః కుతో ధనమ్ ||
'నాకు కొడుకులున్నారు, ధనం ఉంది' అని ఆసక్తచిత్తులైన అజ్ఞానులు కష్టాలతో బాధపడుతూ ఉన్నారు. తనకు తానే లేనప్పుడు ఇక కొడుకులు, ధనం తనదెట్లా అవుతుందంటూ ప్రశ్నించాడు. కళకళలాడుతూ కళ్ళముందు తిరిగే భార్య.. సకలభోగాలలో ఓలలాడించిన కాసులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే రోజొస్తుందనీ, సమస్త కాలచక్రాన్ని తన కనుసన్నలతో తిప్పే కారుణ్యమూర్తి ఒకరున్నారనీ మరచి పోకూడదు. అలాగని అయినవారిని వదిలించుకోమని కాదు. వారి గురించే రేయీ పగలూ చింతించవద్దు.
సృష్టిలో మనిషి తప్ప, ఏ ఒక్క జీవి కూడా తరతరాలకు సరిపడా పోగు చేసుకోవాలని తాపత్రయపడదు. కారణం వాటికి ప్రకృతిపై, పరమాత్మపై పూర్తి విశ్వాసం. మనిషి పేరుకు పరిణతి చెందిన జీవిగా చెప్పుకుంటూ, మరోవైపు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పులి కూడా ఆకలైనప్పుడే వేటాడుతుంది. గుహ నిండా జింక మాంసాన్ని నింపుకొని సంవత్సరాల తరబడి తింటూ కూర్చోదు. పిల్లలను ఓ మూలన భద్రంగా కూర్చుండమని, తనే ఒళ్ళుగుల్ల చేసుకొని మాంసపు ముక్కలు తెచ్చి తినిపించదు. కానీ మనం మాత్రం మన మునిమనుమడు కూడా ఏ చీకూ చింత లేకుండా తింటూ కూర్చోవాలనీ, ఇప్పటి మన ఆయువునంతా కరిగిస్తూ, క్షణం తీరిక లేకుండా చింతిస్తూ కాసులు కూడబెడుతూంటాం. ఇలాంటి సమయంలో ఎవరైనా మన పుణ్యం కొద్దీ వచ్చి, 'కాస్త గుడికెళదామా, ఏదైనా సంఘసేవ చేద్దామా' అని అంటే నాకు తీరికెక్కడిదని తప్పించుకుంటాం. ఇలాంటి మన దుఃస్థితిని ముందే ఊహించి ప్రహ్లాదుడు...
అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్వితచర్వణులైన వారికిం జెచ్చెర బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన నే మిచ్చిన నైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్?... అంటాడు..
'కొందరు గాఢమైన కారుచీకటి లాంటి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి తానంతట అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవుల్లోకి తీసుకెళ్ళినా ఫలితం ఉండదు. భగవంతుడి మీదకు అంత త్వరగా మనస్సు పోతుందా!' అంటూ ఆవేదనపడతాడు.
కాబట్టి మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, అలాగే ఎప్పుడూ పనులు అంటూ భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదు.
*నిశ్శబ్ద.