రాముడి రాక విన్న అయోధ్య ప్రజల స్పందన ఎలా ఉంది?
రాముడి రాక విన్న అయోధ్య ప్రజల స్పందన ఎలా ఉంది?
రాముడు అందరితో కలిసి అయోధ్యకు వెళుతూ దారి మధ్యలో ప్రాంతాలు అన్నీ సీతమ్మకు చూపించి, వాటి పేర్లు చెబుతూ వివరించాడు.
అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు వాళ్ళు అందరూ. భారద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం నాకు తెలుసు. అయితే నేను అడుగుతున్నాను. ఈ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని తరువాత నువ్వు బయలుదేరు" అన్నాడు.
అప్పుడు రాముడు భారద్వాజుడి మాట కాదనలేక అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. తరువాత హనుమంతుడిని పిలిచి 'హనుమ! నువ్వు ఇక్కడినుండి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు, ఆ పని అయిపోయిన తరువాత అక్కడినుండి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నాను అని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా" అన్నాడు.
వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుండి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.
మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు రాముడితో "రామా!! నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో" అన్నాడు.
అప్పుడు రాముడు "వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడి నుండి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరం ఇవ్వండి" అని అడిగాడు,
భారద్వాజుడు రాముడు అడిగినట్టు వారం ఇవ్వగానే భారద్వాజుడి దగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.
అప్పుడు భరతుడు తన సైనికులతో "రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము" అని భరతుడు ఆజ్ఞాపించాడు.
రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకొచ్చింది.
◆నిశ్శబ్ద.