రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది?

 

రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది?

రాముడు నందిగ్రామం నుండి అయోద్యకు అందరితో కలిసి ఊరేగింపుగా వెళుతుంటే  అయోధ్యలో ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, అందరూ సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. 

వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

వాసరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అప్పుడే కిరీటాన్ని తీసుకొని వచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానము చేశాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో 'లక్ష్మణా! యువరాజు పట్టాభిషేకం చేసుకో' అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు "అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు" అన్నాడు. లక్ష్మణుడి మాట మీద  యువరాజ పట్టాభిషేకం భరతుడికి జరిగింది. సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల జత, హారాలు ఇచ్చారు.

ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. సీతమ్మ చేతిలో ఉన్న హారాన్ని చూడగానే రాముడు సీత వంక చూసి "ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో. అటువంటి వాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీ మించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి" అన్నాడు.

ఆ మాటలు వినగానే  సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.

ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా రాముడు, రాముడు తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు. నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది. చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి. చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మముల మీద ఎంతో ప్రేమతో, బాధ్యతతో  ఉన్నారు. చిన్నవారు మరణిస్తే పెద్దవారు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో జరగలేదు. ఖ్నెట్ చిన్నవారు మరణించలేదు అని అర్థం. అలా ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు. 

                                        ◆నిశ్శబ్ద.