పూతన కృష్ణుడిని చంపడానికి వెళ్లేముందు ఎం జరిగింది!
పూతన కృష్ణుడిని చంపడానికి వెళ్లేముందు ఎం జరిగింది?
గోకులంలో ఓ పిల్లాడు పుట్టాడని, ఆ పిల్లాడు శక్తివంతుడని, నందుని కొడుకే ఆ పిల్లాడని తెలిసి కంసుడిలో అలజడి మొదలయ్యింది. కంసుడు దగ్గరుండే పూతనను పిలిపించాడు. చిన్న పిల్లలను చంపడంలో పూతనది అందెవేసిన చేయి.. పూతన రాగానే.. "నీకు నందుని భార్య యశోద మగపిల్లవాడిని కన్న విషయం తెలుసా ?" అని అడిగాడు. పూతన తెలియదన్నట్లు అడ్డంగా తలవూపింది. "దేవకి ఆడబిడ్డను ప్రసవించిన సమయంలోనే, నందుని భార్య యశోద కూడా ప్రసవించిందట. అతడు అద్భుతశక్తి సంపన్నుడట. వరాల మూటట. అందరికి ప్రేమపాత్రుడట. వెళ్ళు, వెళ్ళి, వాణ్ణి ఒకసారి చూడు" ఆదేశించాడు.
"క్షమించు ప్రభూ! నేను వెళ్ళలేను. ప్రస్తుత నా పరిస్థితి దయనీయంగా వుంది. నా స్వంత అన్నచెల్లెళ్ళే నన్ను చూసి "వంశనాశని" అని తిట్టుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. బయటి వారైతే సరేసరి. ఈ మధురానగరంలోనే నాకు పుట్టగతులు లేవు. నా చరిత్ర ఈ పరిసరాల ప్రాంతాలకు బాగా ప్రాకింది. ఈ తరుణంలో నేను గోకులానికి వెళ్ళడం, ఆ పిల్లవానిని చూడటం సాధ్యం కాదు" అని చెప్పింది.
నువ్వేమి మాట్లాడుతున్నావు పూతనా అసలు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నానని అనుకునే ఇవన్నీ చెబుతున్నావా అని అన్నాడు కంసుడు.
"ప్రభూ! నా సేవలలో లోపం లేదు. ఎంతో విశ్వాసంతో సేవించాను. కానీ ఇప్పుడు మాత్రం ఆశక్తురాలను, నాది పాపిష్టి జన్మయిపోయింది. నా విశ్వాసం. ప్రభుసేవ, మన్నన లేకుండా పోయాయి" అని ఏడుస్తున్నట్టే కంసునితో చెప్పింది.
అంతా విన్న కంసుడు - "పూతనా! నీపై నమ్మకముంది. నీ విశ్వాసాన్ని నేను గుర్తించాను. ఇతరుల మాటెందుకు ? నువ్వు గోకులానికి వెళ్ళి, ఆ పిల్లవాడిని చూడు, నువ్వేం చెయ్యాలో నీకే అర్థమవుతుంది ఇది నిన్ను కోరే అర్థింపు, ఈ కాస్త ఉపకారం చెయ్యి. ఇకపైన నిన్ను బాధించను. ఇబ్బందీ పెట్టను" అన్నాడు కంసుడు.
దయచేసి నన్ను విడిచి పెట్టండి.ఇప్పుడు నేను ఆశక్తురాలను. ఒక పిల్లవాణ్ణి పట్టుకునే ఓపికా, నాలో పోయింది. రెండునెలల క్రితం నా కడపటి శిశువు నా చేతుల్లోనే మరణించింది. నేనూ తల్లినే. అప్పుడు నాకు మాతృప్రేమ, అందులోని మమకారం అర్థమయ్యాయి. నా ద్వారా నల్గురు పిల్లల చావుకేకల్ని విన్నాను. అప్పుడు నేను చలించలేదు. నా పిల్లవాడు మరణించడంతో, నాలోని మమకారం, మాతృత్వం మేలుకొన్నాయి. గర్భశోకమంటే ఏమిటో తెలిసింది. ఇప్పుడు చంపమన్నా, చచ్చే పిల్లల్ని చూడటనున్నా నాకు భయంగా వుంది. కాబట్టి నన్ను మన్నించండి. ఇక ఈ ఘోరం చెయ్యలేను." అని ఎంతో జాలిగా చెప్పింది.
"ఏవిటా మూర్ఖత్వం ? నువ్వేనా మాట్లాడేది ? ఇక కబుర్లు కట్టి పెట్టి నేను చెప్పినట్లు చెయ్యి. తప్పదు" ఆజ్ఞాపించాడు కంసుడు. పూతన నేలచూపులు చూస్తుండటంతో ఆమె ఒప్పుకోవడం లేదనే విషయం కంసుడికి అర్థమయ్యింది. "నా మాట వినవా ?" ఖంగుమని గర్జించింది కంసుని కంఠస్వరం.
"క్షమించండి! ఈ శిశు హత్యలు తప్ప మరేమైనా చెప్పండి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. అమలు పరుస్తాను." ఎంతో దీనంగా, కన్నీటతో చెప్పింది పూతన.
"పూతనా, నువ్వు, నీ భర్తా, బకాసురుడు మీరందరూ నాకు కట్టుబానిసలు. ఆజ్ఞాబద్ధులని మరువరాదు. నన్ను కాదంటే మిమ్మల్నేమైనా చెయ్యగలను. అది తెలుసుకో. నేనిచ్చిన భోగభాగ్యాలను తలుచుకో. పొరపాటున నేను మరణిస్తే మీ పరిస్థితి ఎంతటి దుర్భరము, దారుణమౌతుందో తలచుకుని, మరీ ప్రవర్తించు." అన్నాడు.
అయినా పూతన తలవంచుకునే ఉంది. "ఇంకా నా శక్తి నీకు అర్థం కావడం లేదు. నేను "వూ" అంటే ఆ మగధవీరులు ఒంటిచేత్తో మీకు సమాధి కడతారు." అన్నాడు కంసుడు కోపంగా.
"తెలుసు. అయినా... నా అశక్తతను గూడా అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను" అనింది పూతన.
"అయితే ? ఫో. గోకులానికి వెళ్ళి నేను చెప్పిన పని పూర్తిచేసుకురా. కాదని ఇక్కడెక్కడున్నా.... " అని గట్టిగా హుంకరించాడు కంసుడు.
"మీ ఆజ్ఞ" అంది పూతన. "నీకు పక్షం రోజులు గడువిస్తాను. ఈలోగా ఆ కార్యక్రమం పూర్తిచెయ్యాలి. తెలిసిందా ?" అని పూతనను పంపాడు.
ఇలా ఇష్టం లేకపోయినా గోకులంలొ చిన్ని కృష్ణుడిని చంపడానికి వెళ్ళింది పూతన.
◆నిశ్శబ్ద.