భీష్ముడి వల్ల ఓ ఆడదాని పరిస్థితి అలా మారిందా!

 

భీష్ముడి వల్ల ఓ ఆడదాని పరిస్థితి అలా మారిందా?

కాశరాజుకు 'అంబ', 'అంబిక, అంబాలిక" అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడి తమ్ముడు విచిత్రవీర్యుడు. ఆయన  స్వయంవరమునకు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు. అక్కడి వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞచేసిన భీష్ముడు స్వయంవరమునకు వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తూండగా 'నేను పౌరుషంతో ఈ రాజులనందరిని ఓడించి ఈ అంబ, అంబిక, అంబాలికలను తీసుకు వెడుతున్నాను. ఎవరయినా నన్ను ఎదుర్కొనేవారు ఉంటే ఎదుర్కొవచ్చు' అని ముగ్గురిని చేయిపట్టి రథం ఎక్కించి తీసుకు వెళ్ళిపోతున్నాడు. రాజులు అందరూ కలిసి బిష్ముని మీదకు యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారినందరిని తుత్తునియలు చేసి ఆ ముగ్గురిని హస్తినాపురమునకు తీసుకువచ్చాడు.

అపుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళింది. 'మహానుభావా, నీకు తెలియని ధర్మం లేదు. నీకొక మాట చెపుతాను. నేను సాళ్వుడు అనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నాకు తన మనసులో భార్యగా స్థానం ఇచ్చాడు. నేనూ ఆయన్ను న భర్తగా భావిస్తున్నాను. కాబట్టి నేనిపుడు వేరొక పురుషునికి భార్యను కావడం మర్యాదగా ఉండదు. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పచెప్పగించెయ్యి' అని  అంది. అప్పుడు భీష్ముడు 'మనసులేని స్త్రీ రాజుకు భార్యగా ఉండడానికి వీలుకాదు. పరపురుషుని మీద ప్రేమ కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండడం త్రాచుపామును పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండడానికి వీలులేదు. నిన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పజెప్పేస్తాను' అని చెప్పి ఆమెను సాళ్వుడి రాజ్యానికి రథంలో పంపించాడు.

 ఈమె సాళ్వుడి దగ్గరకు వెళ్ళి 'నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీవద్దకు పంపించేశాడు' అని చెప్పింది. 

అపుడు సాళ్వుడు..  'అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చేయిపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళాడో ఆనాడే నీవు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇపుడు భీష్ముడు నిన్ను పంపితే  చేతకానివాడికి భీష్ముడు భిక్ష పెట్టినట్టు, నిన్ను భార్యగా స్వీకరిస్తే.. నేను భీష్ముడి నుండి భిక్ష స్వీకరించినట్టు అవుతుంది.  నేను క్షత్రియుడను. రాజ్యపాలకుడను, మహారాజును. నేను నిన్ను అంగీకరించను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నీవు వాళ్ళకి సొత్తు. అక్కడికే వెళ్ళు' అన్నాడు.

ఒక ఆడదాని బాధ చరిత్రను కూడా ఎలా మారుస్తుందో ఈ ఒక్క సంఘటన ద్వారా అర్థమవుతుంది. అందుకే అంబ భీష్ముడి మీద కోపాన్ని పెంచుకుంది. ఈ కారణంగానే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనస్సు బాదపడేటట్లు ప్రవర్తించకూడదు అంటారు.

                                      ◆నిశ్శబ్ద.