అక్రూరుడు ఎవరు.. ఈయన మధుర వాసులకు ఎందుకు ఆప్తుడయ్యాడు!

 

అక్రూరుడు ఎవరు?? ఈయన మధుర వాసులకు ఎందుకు ఆప్తుడయ్యాడు?

మహాభారతంలో అక్రూరుడు అని యాదవులలో ఒకరుంటారు. అక్రూరుడు వయసుకు చిన్నవాడేకాని, ఆపార జ్ఞానఖని, భగవంతునిపై తరగని విశ్వాసము, అకుంఠిత దీక్షగల వ్యక్తి. అక్రూరుడంటే... మధురవాసులందరికీ ప్రేమా, గౌరవం. అనాధులను, అసహాయులను బాధాతప్తులను ఓదార్చి, వూరడించడం, అక్రూరుల వారి లక్ష్యం, అటువంటి పుణ్యమూర్తి, భాగవతోత్తముడిని కంసుడు బంధిస్తాడు. ఇలా ఆయన బంధింపబడటం, విధివిలాసమని మధురపురవాసులు అనుకున్నారు.

మరొకవైపు పరిస్థితి చక్కబడుతుందని, తన శత్రువులు  సమసిపోయారని, తనను ఎదిరించి నిల్చే మగవాడే లేడనే వార్త కంసునికి సంతోషాన్ని కలిగించాయి. ఆనందంతో పకపక నవ్వాడు. పరిస్థితులకు తట్టుకోలేక, యాదవ ప్రముఖులలో చాలామంది కుటుంబాలు మధురను విడిచి, పొరుగు రాజ్యాలకు శరణార్థులుగా పారిపోయారు. మిగిలినవారు తలలు వంచుకుని కంసునికి శరణాగతులయ్యారు. కాకపోతే కంసుని విధేయులు కొందరు  అక్రూరుని బందించడం యాదవ ప్రజలకు నచ్చలేదు.

కంసుడు పరిస్థితులు చక్కబడటం, తన ఆశలు నెరవేరడంతో, అందరి అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు, యదువీరుల వలన ఏ ప్రమాదము లేదని, రాదని తలచి, అక్రూరుని విడుదల చేసాడు. ఇది తనకు అనుకూలమవుతుందని, ప్రజలు తనను కీర్తిస్తారని కంసుడు తలచాడు, అక్రూరుని బంధవిముక్తిడిని చేసాడు.

ఈ సమయంలోనే మహాకురువీరుడైన భీష్ముల వారి నుండి వార్తాహరులు మధురకు వచ్చారు. వసుదేవుని తమతో ఇంద్రప్రస్థానికి పంపమని కోరారు. దీంతో కంసుడు అయోమయంలో పడ్డాడు. ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు. ఆ మహావీరునితో తలపడటం అసాధ్యం. దారి కనబడటం లేదు. భీష్ముడు సామాన్యుడు కాడు. అరివీరభయంకరుడు, ఆర్తత్రాణ పరాయణుడు. ఇటు అభయహస్తం, ఆటు ఖడ్గనైపుణ్యం ప్రదర్శించగల మహామేటి. పైగా పరశురాముని ప్రియశిష్యుడు. హస్తినాపురాధిపతి. ఆయనతో తలపడటం తగని పని, కాకపోతే అక్రూరుడు, హస్తినాపురవాసులకు కూడా ప్రియుడే కాబట్టి అక్రూరుని సంప్రదిస్తే, తగు రక్షణ సలహా లభిస్తుందని కంసుడు తలిచాడు. అక్రూరుని బంధవిముక్తిడిని చెయ్యడానికి భీష్ముల వర్తమానం కూడా.. కొంత సుగమ మార్గమయింది. ఆ బ్రహ్మాస్త్రంతో, అక్రూరుడు, బంధవిముక్తుడయ్యాడు. ఇక భీష్ముల వారి కరుణను పొందాలి. కానీ..

విడుదలైన అక్రూరుడిలో సంతోషం లేదు. అలజడి లేదు. మామూలుగానే ఇంటికి వెళ్ళాడు. కుటుంబాన్ని గోకులానికి పంపించి, తాను మాత్రం మధురలో, తన అనుయాయుల, అభిమానుల సహాయార్థం, ఒక వారథిగా సారధిగా అక్కడ. వుండిపోయాడు. మధురలోని ప్రతి ఇల్లు అక్రూరులు అతనిదే. అతనికి చిరపరిచితమైనదే, ఒక్కొక్క ఇంటికే వెడుతున్నాడు. అందర్ని కలుసుకుంటున్నాడు. వారి బాధలు వింటున్నాడు. సాటి మానవునిగా వారిని ఓదారుస్తున్నాడు. కంసుని ప్రవర్తనకు బాధపడుతున్నాడు. వారికి తను చేయగల్గిన సహాయమందిస్తూ ఆరాద్యునిగా కాక, ఆదరణీయునిగా మెలగుతున్నాడు. భగవంతునిపై ప్రీతిని పెంచుకోమన్నాడు. శరణాగత రక్షకుడైన ఆ శ్రీహరి, తప్పక, సమయానుకూలంగా మనల్ని సంరక్షిస్తాడని ఎంతో విశ్వాసంతో ప్రకటించేవాడు  ఇలా అక్రూరుడు మధుర ప్రజలకి ఆరాద్యుడయ్యాడు.

◆నిశ్శబ్ద.