హనుమంతుడు రావణుడికి ఏమి చెప్పాడు?
హనుమంతుడు రావణుడికి ఏమి చెప్పాడు?
తన చిన్న కొడుకు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో, భయం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్ వైపు చూసి "నిన్ను పంపకూడదు. కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడంలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని గుర్తుచేసుకుని మరీ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో, అవకాశం దొరికితే వాడిని సంహరించు" అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.
ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి. అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం (ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి "ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని సమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను" అనుకున్నాడు.
బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు "ఈ రాక్షసులవి ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను" అనుకొని అలా ఉండిపోయాడు. కాని ఇంద్రజిత్ అనుకున్నాడు "ఈ రాక్షసులు బుద్ధిహీనులు, బ్రహ్మస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటే ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు. వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు" అని సంతోషపడ్డాడు.
వాళ్లు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొని వచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వాసరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి "ఎక్కడినుండి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వారాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి. అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి" అన్నాడు.
అప్పుడు ప్రహస్తుడు లేచి "నువ్వేమి భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడ? యముడు పంపించాడ? కుబేరుడు పంపించాడ? విష్ణువు పంపించాడ? ఎవరి ప్రమేయం వలన నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు?" అని ప్రశ్నించాడు.
అప్పుడు హనుమ రావణుడి వంక చూసి "ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దెగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా" అన్నాడు.
హనుమని పరిశీలనగా చూసిన రావణుడు భయపడి "ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాశ పర్వతాలని కదిపేస్తున్నప్పుడు సందీశ్వరుడు నన్ను శపించాడు, వానరులు నా కొంప ముంచుతాయని. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో" అనుకొన్నాడు.
అప్పుడు హనుమంతుడు అన్నాడు "నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్థ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వలన సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు, నేను తటస్థమైనవాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావ బాగుపడతావు, లేకపోతే నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వారు నా మీదకి యుద్ధానికి వచ్చారు. దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను వారు చనిపోయారు" అని చెప్పాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.