రావణుడి చిన్నకొడుకును హనుమంతుడు ఎలా చంపాడు?

 

రావణుడి చిన్నకొడుకును హనుమంతుడు ఎలా చంపాడు?

హనుమంతుడు చేసిన గందరగోళానికి 80,000 రాక్షసులు చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.

'జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు" అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన దగ్గరున్న ఏడుమంది మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వారు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. 

 మంత్రుల కొడుకులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడాయన అయిదుమంది సేనాగ్ర నాయకులని పిలిచి "మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది" అన్నాడు.

 విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే అయిదుమంది సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి, ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. 

మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు. ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసినప్పుడు  తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే "ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము" అని హనుమంతుడు అనుకున్నాడు. 

అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషించారు.  "ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే" అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దద్ది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి. తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి. అలా రావణుడి చిన్న కొడుకు హనుమంతుడి చేతిలో మరణించాడు.

                            ◆ వెంకటేష్ పువ్వాడ.