హనుమంతుడితో సీతమ్మ పంచుకున్న జ్ఞాపకాలు!

 

హనుమంతుడితో సీతమ్మ పంచుకున్న జ్ఞాపకాలు!

సీతమ్మ హనుమంతుడితో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన తరువాత  "శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కన్నది. ఆ రాముడి పాదాలకు తలవంచి భక్తిగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు, హనుమా! నువ్వు రాముడి దగ్గర చెప్పే మాటలను బట్టి రాముడితో నామీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కాబట్టి నువ్వు రాముడి దగ్గర ఇక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పి  రాముడు నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి" అని చెప్పింది.

అప్పుడు హనుమంతుడు "అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితోపాటుగా ఇంకొక జ్ఞాపకం ఏదైనా ఇస్తావా, తీసుకువెళతాను. దాన్ని చూపించి రాముడికి జరిగింది మొత్తం వివరంగా చెబుతాను" అన్నాడు.

అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగములో బహుమానంగా ఇచ్చాడు. జనకుడు ఆ చూడామణిని తన కూతురు సీతకు బహుమానంగా ఇచ్చాడు.) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు మీద  మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఒకే సమయంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, ఒకరు మా అమ్మ, రెండు దశరథుడు, మూడు  నేను. ఇలా రాముడికి ముగ్గురం జ్ఞాపకం వస్తాము" అని అనింది.

హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం వచ్చాయి.

ఆ తరువాత  సీతమ్మ హనుమంతుడితో "హనుమా!! నీకు ఇంకొక విషయం చెబుతాను విను. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి" అని చెప్పింది.

అప్పుడు హనుమంతుడు "అలాగేనమ్మా నువ్వు చెప్పమన్న విషయాలు, ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ రాముడికి పూసగుచ్చినట్టు చెబుతాను. ఇక నేను బయలుదేరతాను" అంటే, "నాయన! 10 నెలల నుండి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళీ ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా" అని, ఇంటినుండి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.

                                ◆ వెంకటేష్ పువ్వాడ.