నీటితో చికిత్స చేసిన ఋషులు (Indian Sages and Water Therapy)
నీటితో చికిత్స చేసిన ఋషులు
(Indian Sages and Water Therapy)
నీళ్ళు లేకపోతే మనకి మనుగడే లేదు. అందుకే ఆదిమానవులు నీటి వనరులు ఉన్నచోట నివాసం ఏర్పరచుకునేవారు. నీళ్ళు దాహం తీరుస్తుంది, దేహాన్ని శుభ్రపరుస్తుంది. వంటావార్పు, స్నానం-జపం ప్రతిదానికీ, ప్రతి నిమిషం నీళ్ళు కావాలి. నీళ్ళు లేకపోతే ఒక్క గంట కూడా జరగదు. ఈ సంగతి అలా ఉంచితే, పూర్వం మహర్షులు నీటితో అనేక జబ్బులకు చికిత్స చేసేవారు.
ఋగ్వేదంలో "అప్స్వంతర మృతమప్సు భేషజం'' అని లిఖితమై ఉంది.
నీళ్ళు ఎక్కువగా తాగడం ద్వారా, ఎక్కువ నీటితో స్నానం చేయడం ద్వారా, నీళ్ళ తొట్టిలో కొంతసేపు శరీరాన్ని ఉంచడం ద్వారా అనేక జబ్బులు నివారింపబడ్తాయని ఋషులు చెప్పారు.
నీరు నిప్పును ఆర్పుతుంది సరే... నీటిలో అగ్ని దాగి ఉంటుంది. ఈ గుణాన్ని మన మహర్షులు ఎప్పుడో గ్రహించి చెప్పారు. నీళ్ళలో రోగనిరోధక శక్తి ఉంది. వ్యాధులను తగ్గించే గుణం ఉంది. నీళ్ళు జీవనాధారం. నీరు ఔషధం. నీరు అమృతం. అయితే మనం తాగే నీళ్ళు శుభ్రంగా, స్వచ్చంగా ఉండాలి. పూర్వం బావుల్లో నీళ్ళే తాగేవారు, వాడుకునేవారు. కొన్ని బావుల్లో నీరు అవసరాలను తీర్చడమే కాకుండా ఔషధ గుణాలతో అలరారుతూ జబ్బులను తగ్గించి, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మరికొన్ని బావుల్లో నీరు కలుషితంగా లేదా లోపభూయిష్టంగా ఉంటుంది. దాంతో అనేక అనారోగ్యాలను వచ్చిపడతాయి. ముఖ్యంగా కీళ్ళ జబ్బులు, వాతపు రోగాలు వస్తాయి.
బావులు, ఇతర నదుల సంగతి అలా ఉంచితే, గంగాజలం పరమ పవిత్రమైందని దార్శనికులు చెప్పారు. గంగానదిలో మునిగితే పాపాలు హరించి, పుణ్యం వస్తుందని, సకల రోగాలూ తగ్గుతాయని నమ్మి దూరాభారాన్ని లెక్కచేయకుండా గంగానదికి వెళ్ళి వస్తుంటారు. చాలామంది కష్టనష్టాలను ఖాతరు చేయకుండా గంగానదిలో అస్తికలు కలిపి వస్తుంటారు. గంగాజలాన్ని భద్రంగా తెచ్చుకుని తలపై జల్లుకోవడం, తీర్థంగా సేవించడం చేస్తుంటారు. ఇదంతా కేవలం మూఢ భక్తి, విశ్వాసం కాదని, అందులో ఎంతో యదార్ధం ఉందని మహర్షులు చెప్పడమే కాదు, శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు.
మన దేశ వాసులే కాదు, ఫ్రాన్సు దేశానికి చెందిన సైంటిస్టు 1935లో మన దేశానికి వచ్చి గంగాజలంపై పరిశోధన చేశారు. గంగాజలం సామాన్యమైంది కాదని, అందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, సూక్ష్మ క్రిములను సంహరించే శక్తి ఉందని చెప్పారు. కలరా వ్యాధికి దారితీసే క్రిములను సైతం గంగాజలం నిర్వీర్యం చేస్తుందని ఆయన నిరూపించారు.