ప్రపంచంలోనే తొలి శస్త్ర వైద్యుడు ధన్వంతరి (Dhanwantari)

 

ప్రపంచంలోనే తొలి శస్త్ర వైద్యుడు ధన్వంతరి

(Ayurvedic Doctor Dhanwantari)

 

''ధన్వంతరి'' అనే పదం మనకు చిరపరిచితమైంది. ఈ ధన్వంతరి ప్రస్తావన మన ప్రాచీన గ్రంధాల్లో, ధార్మిక ప్రచారాల్లో, వ్యావహారిక కథల్లో - అనేక సందర్భాల్లో వస్తుంది. ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత అని అర్ధం. ఆయుర్వేద వైద్యం తెలిసిన మహా మేధావి ధన్వంతరి గురించి ఏంటో కొంత విని ఉంటారు. ఆ అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం..

 

సముద్ర మథనం తర్వాత ధన్వంతరి స్వామి ఒక చేతిలో అమృత భాండాన్ని, మరో చేతిలో శంఖాన్ని, ఇంకో చేతిలో చక్రాన్ని, ఇంకో చేతిలో జలౌకా ధరించి దర్సనమిచ్చినట్లు పురాణాలు వర్ణించాయి.

 

మనదేశంలో మహా ప్రముఖుడైన ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి. ఆయన చెట్ల వేళ్ళు, కాండం, ఆకులు, పూవులతో అనేక ఔషధాలు తయారుచేశాడు. ఆ దివ్య ఔషధాలతో జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు మొదలు పక్షవాతం, కామెర్లు, రాచపుండు (ప్రస్తుతం కాన్సర్ అంటున్నది దీన్నే) లాంటి పెద్ద వ్యాధుల వరకూ అనేక వ్యాధులను నివారించే మందులు కనిపెట్టాడు. పసుపును క్రిమి సంహారిణిగా (యాంటీ బయాటిక్) ఉపయోగించాడు. ప్రపంచంలోనే తొలి శస్త్ర చికిత్స చేసిన మహానుభావుడు ధన్వంతరి. ఇంకా ఘనమైన సంగతి ఏమంటే ఆ ప్రాచీన కాలంలోనే ధన్వంతరి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు చెప్పే కథనాలు అనేకం ఉన్నాయి.

 

ఉత్తర భారతంలో ధన్వంతరికి చెప్పుకోదగిన ఆలయం అంటూ లేదు కానీ దక్షిణ భారతంలో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. బెంగళూరులో ఈ దేవతకు ఒక ఆలయం ఉంది. అలాగే తమిళనాడు శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ధన్వంతరి ఆలయం ఉంది.

 

పూర్వం ధన్వంతరి వైద్య విధానాన్ని, ఆయన సూత్రాలను ఆయన శిష్యులు ఎందరో పాటించేవారు. యుద్ధ సమయంలో తక్షణ చికిత్స అందించేవారు. అవసరమైనవారికి శస్త్ర చికిత్స చేసేవారు. ఇప్పటిలా సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందకముందే, అత్యాధునిక వైద్య పరికరాలు అమరకముందే అబ్బురపరిచే ధన్వంతరి శస్త్రచికిత్స ఉండటం ఎంత ప్రశంసనీయం?!

 

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యుని వద్ద (భాస్కరుడు) ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకున్నట్లుగా కధనం ఉంది. సూర్యుని 16 శిష్యుల్లో ధన్వంతరి ఒకరు. కాశీరాజు దేవదాసు ధన్వంతరి శుశ్రుతునికి ఆయుర్వేద వైద్య శాస్త్రం నేర్పించాడు. అందులో ఇప్పుడు సర్జరీ అని పిలుచుకుంటున్న శస్త్ర చికిత్స ఉంది. ఈయన "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని కూడా రచించినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ప్రతిభావంతులైన ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" బిరుదుతో సత్కరించేవారు. "ధన్వంతరి" అనేది కాశీరాజు బిరుదు. ఆ బిరుదుతోనే ఆయన ప్రఖ్యాతుడయ్యాడు. ఈ కాశీరాజు పురాణ కథల్లోని ధన్వంతరి అవతారం.