శంఖం ఎలా ఉద్భవించింది..దీని శబ్దం మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే!
శంఖం ఎలా ఉద్భవించింది..దీని శబ్దం మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే!
విష్ణువును వర్ణించేటప్పుడు, కొందరు దేవతల గురించి ప్రస్తావించేటప్పుడు.. శంఖు, చక్ర, గదా ధారి అని అంటూ ఉంటారు. శంఖం దేవతలకు చాలా ప్రీతికరమైనది. శతాబ్దాలుగా శంఖం హిందూ మతం, సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. మతపరమైన ఆచార వ్యవహారాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా శంఖానికి ముఖ్యమైన స్థానం లభించింది. పురాతన కాలం నుండి శంఖాన్ని ఇళ్లలో ఉంచడం శుభప్రదంగా భావిస్తున్నారు. శంఖాన్ని పూజలలో కూడా ఉపయోగిస్తుంటారు. జ్యోతిష్యం, పురాణ శాస్త్రం రెండూ శంఖం ధ్వనిని చాలా శక్తివంతమైనదని చెబుతాయి. శంఖం ధ్వనికి అద్భుతమైన శక్తి ఉంది. ఇది వాతావరణంలో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది.
శాస్త్రవేత్తల ప్రకారం, శంఖం ధ్వని మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో శంఖం ఊదడం ఆనవాయితీగా రావడానికి ఇదే కారణం. హిందూ మతంలో శంఖం విష్ణువు చేతిలో ఉంటుంది. శంఖంలో విష్ణువు నివాసం ఉంటాడని చెబుతారు. శంఖం ధ్వని ఓం శబ్దం లాగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం, శంఖం ధ్వని దేవతల ఆశీర్వాదాలను ఇస్తుందని చెబుతారు.
శంఖం ఎలా పుట్టిందంటే..
శంఖం ఉద్భవించినది కథ సముద్ర మథనానికి సంబంధించినది. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు పద్నాలుగు వస్తువులు వచ్చాయి. వాటిలో ఒక శంఖం కూడా ఉద్భవించింది. వీటిలో ఒకటైన పాంచజన్య అని పిలువబడే శంఖం ప్రసిద్ధి చెందింది. దాని అద్భుతమైన ధ్వని, గుణాలకు ముగ్ధుడై విష్ణువు దానిని స్వీకరించాడు. అప్పటి నుండి శంఖం విష్ణువు ప్రధాన ఆయుధంగా మారింది. చాలా పవిత్రమైనదిగా పూజించబడుతోంది.
శంఖంలో రకాలు..
శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు శంఖాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా దక్షిణావర్తి శంఖాన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. ఈ శంఖం ధ్వని చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది, పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. శంఖాన్ని పూజలు, యాగాలు, ఇతర మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు. భారతీయ సంస్కృతిలో శంఖం ముఖ్యమైన భాగం. ఇది కళ, వాస్తుశిల్పంలో కూడా విస్తృతంగా ఉపయోగించబడింది.
శంఖనాద ప్రభావం..
అధర్వణవేదం, రణవీర భక్తి రత్నాకరం వంటి ప్రాచీన గ్రంథాలలో శంఖనాదం ప్రాముఖ్యత గురించి వివరంగా వివరించబడింది. ఈ గ్రంధాల ప్రకారం శంఖం ధ్వని కేవలం శబ్దం మాత్రమే కాదు మన జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం. అధర్వణవేదం ప్రకారం శంఖం శబ్దం చాలా శక్తిని కలిగి ఉంటుంది. అది చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, గందరగోళాన్ని తొలగిస్తుంది. ఇది అడ్డంకులు, ఇబ్బందుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
రణవీర భక్తి రత్నాకరంలో శంఖం ధ్వని (శంఖం నాదం) కంటే గొప్ప మంత్రం లేదని చెప్పబడింది. శంఖనాదం అనేది మనస్సు, శరీరాన్ని శాంతపరిచే గొప్ప మంత్రమని చెబుతారు. అయితే శంఖనాదం సరిగ్గా చేయడం చాలా ముఖ్యం. శంఖాన్ని తప్పుగా ఊదితే అది కూడా హానికరమట. అందుకే శంఖాన్ని ఎప్పుడూ పద్దతిగా ఊదాలి.
*రూపశ్రీ.