దేవతలు, రాక్షసులు ఎవరు? (Angels and demons)

 

దేవతలు, రాక్షసులు ఎవరు?

(Angels and demons)

 

పురాణాల్లో దేవతలు, రాక్షసులు అంటూ రెండు వర్గాలున్నాయి. దేవతల్ని సురులు, ఆదిత్యులు అంటారు. రాక్షసుల్ని అసురులు, దైత్యులు అంటారు. దేవతలు మృదుమధురంగా, సుతిమెత్తగా, సున్నితంగా, కోమలంగా ఉంటే రాక్షసులు అందుకు పూర్తి విభిన్నంగా కోరపళ్ళు, అడసలు కట్టిన జుట్టుతో, క్రూరంగా, ఘోరంగా, అరివీర భయంకరంగా ఉంటారు. ఇలాంటి పాత్రలు పురాణ కథల్లో ఉన్నాయి. బకాసురుడు, హిరణ్యాక్షుడు మొదలైన ఎందరో రాక్షసులు అలాగే భయానకంగా చిత్రితమై ఉన్నారు.

 

ఇంతకీ దేవతలు, రాక్షసులకు మధ్య ఉన్న తేడా కేవలం రూపంలో కాదు. గుణగణాల్లో వ్యత్యాసం గురించే ప్రధానంగా చెప్పుకోవాల్సింది. అలా చూసినప్పుడు రాక్షసులలో క్రోధం, క్రౌర్యం విపరీతంగా కనిపిస్తుంది. దేన్నయినా నాశనం చేసే లక్షణం, ఎవరినైనా గాయపరిచే స్వభావం ఉంటుంది. దేవతలు ఇందుకు విరుద్ధంగా ఆచితూచి అడుగు వేస్తారు. ఎవరికీ హాని కలిగించేందుకు ఉత్సాహం చూపరు.

 

పురాణ కథలు కేవలం వినోదం కోసం కాదు. అవి మనకు విజ్ఞానాన్ని అందివ్వాలి. విచక్షణను పెంచాలి. మన ఆలోచనలను, స్వభావాలను మార్చాలి. అదే కథల ప్రయోజనం. కనుక దేవతలు, రాక్షసుల సంగతి అలా ఉంచితే మనలో ఈ రెండు గుణాలు కనిపిస్తాయి. కొందరు సున్నితంగా, శాంత చిత్తంతో ఉండగా, ఇంకొందరు కోపావేశాలతో రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. శాస్త్రీయంగా చూస్తే మెదడులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అనుకూలంగా, ఇంకొకటి ప్రతికూలంగా పనిచేస్తాయి. దీన్నే positive force, negative force అంటారు. అలాగే చైతన్యావస్త, సుషుప్తి దశలు ఉన్నాయి. వీటిని జ్ఞాన కేంద్రం, ఉపజ్ఞాన కేంద్రం అంటారు. అంటే conscious region, sub conscious region అన్నమాట.

 

ఏదయినా ఒక పని చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి, అందులో ఉన్న మంచిచెడులను విచక్షణతో విచారించి అప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఒక భవనాన్ని నిర్మించడం చాలా కష్టం. కానీ కూలగొట్టడం మహా సులభం. అలాగే మంచి చేయడం కష్టం, హాని కలిగించడం తేలిక. మన మేలు మాత్రమే కాకుండా ఇతరుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు రాక్షస ప్రవృత్తి మటుమాయమౌతుంది.

 

మనలో పూర్తి మంచివారు, పూర్తి చెడ్డవారు అంటూ ఉండరు. ఆయా సందర్భాల్లో మన తీరుతెన్నులను బట్టి ఎదుటివాళ్ళు మనపై అంచనాలు వేస్తారు. ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. మనం భయంలో కూరుకుపోవడమూ మంచిది కాదు.

 

కేవలం మన స్వార్ధమే చూసుకోకుండా కాస్త వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ తోటివారి శ్రేయస్సు కూడా కోరుకుంటూ సాగితే ఇక ఎదుటివాళ్ళు మనల్ని దేవతామూర్తుల కింద జమకడతారు. ఆపాటి మంచి లక్షణాలు అలవర్చుకోగలిగితే ఉత్తమం. కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా మధ్యేమార్గంలో నడచుకుంటే మనుషులం అనిపించుకుంటాం. ఎట్టి పరిస్థితిలోనూ రాక్షస గుణాలను ప్రదర్శించకుండా, ఆ తెగలోకి చేరకుండా జాగ్రత్త పడాలి.