కుంభకర్ణుడి గురించి విభీషణుడు చెప్పినదేమిటి?
కుంభకర్ణుడి గురించి విభీషణుడు చెప్పినదేమిటి?
కుంభకర్ణుడు నిద్రలేచి బాగా తిన్న తరువాత నేరుగా నేను యుద్ధంలోకి వెళ్లిపోతాను అన్నాడు. అప్పుడు రాక్షసులు "అలా వెళ్ళిపోకయ్యా. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి, ఆయన ఎలా నిర్దేసిస్తే అలా వెళ్ళు" అన్నారు.
"ఇవన్నీ తిన్నాక బద్ధకంగా ఉంది, స్నానం చేసి వస్తాను" అని కుంభకర్ణుడు అన్నాడు.
స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి, (కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం, లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలకి కూడా వాడు కనిపించాడు) కొంతమంది చెట్లు ఎక్కేసారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువెక్కి పారిపోయారు.
ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు "ఏంటి విషయము??" అని అడుగగా, విభీషణుడు అన్నాడు "మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి. అలా చెబితే వారు భయపడతారు, అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి" అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి.
అప్పుడు రాముడు "విభీషణ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి, వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడా" అని అడిగాడు.
"కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటే, ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుండి ఆకలీ అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి "ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా ఆ తినెయ్యడం. కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణి కోటిని బతకనివ్వవా??" అని అరిచాడు.
అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎరిగి "నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి??" అని, ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోసాడు. అప్పుడా ఐరావతం కింద పడిపోయింది. అప్పుడాయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడా! అలా తినెయ్యడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి" అన్నారు.
తరువాత వారు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి "నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో" అన్నారు.
కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కాని రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో "అదేమిటి తాత అలా శపించావు, వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా, కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి" అన్నాడు.
అప్పుడు బ్రహ్మగారు "వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు. తినంగానే మళ్ళి నిద్రపోతాడు" అన్నారు. అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామా. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే సామాన్య మైన విషయం కాదురామ" అని చెప్పాడు విభీషణుడు.
◆నిశ్శబ్ద.