కుంభకర్ణుడు యుద్ధానికి ఎలా వెళ్ళాడు?
కుంభకర్ణుడు యుద్ధానికి ఎలా వెళ్ళాడు?
కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు "అన్నయ్య! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావా?? ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు, ఇప్పుడది ఉపద్రవం అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు కాని, నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే, ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా?, నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా?. వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా?. ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు" అని అడిగాడు.
ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి "నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప, నా తప్పుని పది సార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు, లేకపోతే వెళ్ళి పడుకో, కాని ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది" అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు "ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు. నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి?? యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను" అని బయలుదేరబోయాడు.
ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి "కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం. ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతే రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి. అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనల్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది "ఇంత సభ జరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా" అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది" అన్నాడు.
అదంతా విన్న రావణుడు "ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటే భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు" అని అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు "మీరెవరు రావక్కరలేదు. నేనొక్కడినే వెళతాను" అన్నాడు.
రావణుడు "నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు. రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు" అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.
కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. అలా కుంభకర్ణుడు రాముడితో యుద్ధానికి వెళ్ళాడు.
◆నిశ్శబ్ద.