రావణుడి సైనికులు కుంభకర్ణుడిని ఎలా నిద్రలేపారు?
రావణుడి సైనికులు కుంభకర్ణుడిని ఎలా నిద్రలేపారు?
రావణుడు కుంభకర్ణుడిని లేపమని చెప్పగానే నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. అతని ముక్కు రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి. ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళీ ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వారు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వారు బాగా ఆలోచించి 'ఈయనకి తినడం అంటే బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొని వచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్న వాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్థాల వాసనకి నిద్ర లేస్తాడు అని అనుకున్నారు.
అతనికి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొని వచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతో మద్యాన్ని తీసుకొని వచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.
అప్పుడు వారు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు. భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వారు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వారు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.
తరువాత వారు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొని వచ్చి, ఆ నీటిని అతని చెవులలో పోసేశారు. అయినా అతను లేవలేదు ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొని వచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతో ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిపి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.
అప్పుడా రాక్షసులు "కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఇవ్వాళ లంకకి ఏర్పడింది. రావణుడు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము" అన్నారు.
అప్పుడు కుంభకర్ణుడు "ఈ మాత్రం దానికి నేను రావణుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు ఒక లెక్కా. నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చేయదానికి వెళితే నేను తినడానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను" అన్నాడు.
◆నిశ్శబ్ద