నిలువెత్తు నిరాడంబర మహాత్ముడు వెంకయ్యస్వామి!

 

నిలువెత్తు నిరాడంబర మహాత్ముడు వెంకయ్యస్వామి!

భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మికత మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు. వీరందరూ ఆధ్యాత్మికతను ఈ ప్రపంచానికి భోధించినవారే. అయితే కొందరు తమ జీవితంలో ఆధ్యాత్మిక సాధన మార్గంలో వెళుతూ అందరినీ ఆకర్షించినవారున్నారు. షిరిడి సాయిబాబా, భగవాన్ రమణ మహర్షి అలాంటి వారే. వారి కోవకు చెందిన మరొకరు తెలుగు ప్రాంతంలో పేరుగాంచిన అవధూత వెంకయ్య స్వామి. చీటీల స్వామిగా పిలవబడే ఈయన పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గొలగమూడిలో ప్రసిద్ధ క్షేత్రంలో కొలువై ఉన్నాడు.

వెంకయ్యస్వామి చీటిలో ఏదైనా రాస్తే అది తప్పకుండా జరిగి తీరుతుందని ఎంతోమంది చెబుతారు. ఆయన చాలా మహిమ కలిగినవారని ఎంతోమంది ఎన్నెన్నో కథలు కూడా చెబుతారు. సమాధి చెందినా సరే తన భక్తుల వెంట ఉంటానని, వారి కోరికలను తీరుస్తానని వెంకయ్య స్వామి చెప్పారు. గొలగమూడి క్షేత్రంలో వెలసిన వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసంలో జరుగుతాయి. షిరిడిసాయి నాథుడిని తలపించే వెంకయ్య స్వామి గురించి ఆసక్తికరమైన కథనం!!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరులో జన్మించిన వెంకయ్య స్వామి గారి జన్మ సంవత్సరం గురించి ఎక్కడా సరైన ఆధారాలు లభ్యం కాలేదు. ఈయన తల్లిదండ్రులు సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ. ఈయన జీవించిన కాలానికి తగ్గట్టు రాత్రిపూట బడిలో చదువుకుంటూ ఉదయం పూట కట్టెలు కొట్టి వాటిని బండిమీద వేసుకుని తీసుకెళ్లి అమ్మేవారు. ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవారు ఏ పని చేసిన ఎంతో ఇష్టంగా అంతకుమించి నైపుణ్యంతో చేసేవారు. అందరూ ఈయనను ఎంతో మెచ్చుకునేవారు. ఇద్దరు మనుషులు చేసే పనిని ఒక్కరే చేసేవారు. 

మలుపు తిరిగిన జీవితం!

వెంకయ్య గారికి ఇరవై సంవత్సరాల వయసులో వారం రోజులపాటు చెప్పలేనంత జ్వరం వచ్చింది. ఆ తరువాత జ్వరం తగ్గినా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన ఏదేదో అరుస్తూ వీధుల్లో తిరిగేవారు.  "పిచ్చి వెంకయ్య" అని పిలిచేవారు అందరూ. ఒకరోజు ఆయన కాలు మీద పాము కాటువేసినా విషయం ఎక్కలేదు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత మూడునెలల పాటు పెంచలకోనలో గడిపి తిరిగి నాగుల వెల్లటూరు వచ్చారు. ఇంటికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తినేవారు అంతే. తన చెల్లెలు కొడుకుకు తీవ్రమైన జ్వరం వస్తుంటే ఆమె ఇంటికి వెళ్లి కేవలం చేతి స్పర్శతో జ్వరాన్ని పోగొట్టారు. అదంతా చూసినవారు "పిచ్చి వెంకయ్య" అనడం అని "వెంకయ్య స్వామి" అని పిలిచారు.

జీవితం!

ఆయన తన జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా గడిపారు. సాధారణ మనుషుల్లాగే ఉండేవారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదు. ఆయనకోసం ఎవరైన ఏదైనా తీసుకువెడితే దాన్ని అందరికీ పంచి, చీమలకు కొద్దిగా వేసి  తాను మిగిలింది తినేవారు. గడ్డిమీద చాప వేసుకుని దానిమీద గోనె సంచిపట్ట వేసుకుని పడుకునేవారు. 

చివరి మాటలు!

వెంకయ్య స్వామి సమాధి చెందేముందు మూడు మాటలు చెప్పారు. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురుసేవ అని మూడు మాటలు అందరినీ ఉద్దేశించి చెప్పారు.

సంపన్నత్వం అంటే డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలని కాదు, సంపన్నత్వం అంటే దైవీసంపద అని అర్థం. మొదట దైవీ సంపద సాధించాలి .ఇదే సంపన్నత్వం .దైవీ సంపద అంటే నిర్భయం ,సాత్విక చిత్త శుద్ధి ,జ్ఞాన యోగం లో స్తిరత్వం ,దానం ,ఇంద్రియ నిగ్రహం, నిష్కామ యజ్ఞం, ఆత్మ విచారం , గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాల మననం, తపస్సు, రుజుత్వం ,అహింస, సత్యం, క్రోధం లేక పోవటం ,  త్యాగం, శాంతి, సర్వ భూత దయ, ఇంద్రియ వ్యామోహం లేక పోవటం ధర్మ విరుద్ధమైన పనుల పై ఏవగింపు, చాంచల్యం లేక పోవటం, బ్రహ్మ తేజస్సు, ద్వంద్వాలను సమానం గా చూడటం, ధైర్యం, శుచి, ద్రోహ, గర్వాలు లేకపోవటం, వలన  రజో తమోగుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది . ఇవన్నీ దైవీసంపద వల్ల కలుగుతాయి. అదే సంపన్నత్వం అంటే.

సాధారణత్వం!

సాధారణత్వం దైవీ సంపద పొందిన తర్వాత సంపన్నత్వం పొంది అది నిజ జీవితం లో సాధారణం అవ్వాలి .గురూప దేశాన్ని నిరంతరం మననం చేయాలి .

సద్గురుసేవ!

ప్రతి ఒక్కరికీ గురువు అనేవారుంటే ఎంతో గొప్ప మార్గంలో వెళ్లడానికి సాధ్యమవుతుంది. 

మనిషి ఈ మూడింటిని సాధించగలిగితే వెంకయ్యస్వామి వారు చెప్పిన అంతరార్థాన్ని అర్థం చేసుకుని పాటించినట్టే. అంతేకాదు గీతలో శ్రీకృష్ణ భాగవానుడు చెప్పింది కూడా ఇదే.

1984 ఆగస్ట్ 24 న వెంకయ్య స్వామి గారు మహా సమాధి చెందారు. ఆయన ఆరాధనోత్సవాలలో భాగంగా ఎన్నో వేలమందికి అన్నదానం చేస్తూ ఆయనను స్మరించుకుంటారు. 

ఆర్థిక కుంభకోణాలు, మోసపూరిత మాటలతో మాయచేసే బాబాలు ఉన్న ఈకాలంలో ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా!!

                                       ◆నిశ్శబ్ద.