మోక్షానికి దారి చూపే దీపం.. గీత జయంతి నేడే..!

 

మోక్షానికి దారి చూపే దీపం.. గీత జయంతి నేడే..!

భగవద్గీత.. భారతీయులకు అందిన గొప్ప గ్రంధం.  భగవద్గీతలో ప్రస్తావించబడని అంశం,  భగవద్గీత చెప్పని జీవిత సత్యం అంటూ ఏదీ లేదు. కులం, మతం, వర్గాలకు అతీతంగా.. ఆచరిస్తే అందరికీ ఒక గొప్ప మార్గాన్ని చూపించగల వెలుగు దీపం భగవద్గీత.  యుగాలు మారినా భగవద్గీత ఇంకా ఇంత ఆదరణ పొందుతోంది అంటే దానికి మూలకారణం అందులోని సారమే..  కురుక్షేత్రంలో యుద్దానికి వెనుకడుగు వేస్తున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన సారాంశమే గీత సారం. ప్రతి ఏడాది  మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి నాడు  గీతాజయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా భగవద్గీత ఆవిర్భావం,  దాని ప్రాధాన్యం,  అందులోని సారాంశం, నేటి ప్రజలకు భగవద్గీత అవసరం.. మొదలైన విషయాలను తెలుసుకుంటే..

గీత జయంతి..

ద్వాపర యుగంలో  మహా విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు, అర్జునుడికి   తాత్విక బోధనలతో మార్గనిర్దేశం చేసి, అర్జునుడి  గందరగోళాన్ని,  దుఃఖాన్ని తగ్గించి.. వాటి స్థానంలో  ధైర్యాన్ని, తాను చేయాల్సిన పని పట్ల  స్పష్టతను  నెలకొల్పాడు. కృష్ణుడు అర్జునుడికి భోధించిన సారమే గీతాసారం అయ్యింది.  ఆ గీతాసారమే భగవద్గీత.  అప్పటి నుండి భగవద్గీత హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా గౌరవించబడుతోంది. భగవద్గీత  విధి గురించి, భక్తి గురించి, కర్మ గురించి, క్రమశిక్షణ గురించి,  సత్యం, ధర్మం మొదలైన ఎన్నో విషయాల గురించి స్పష్టత ఇస్తుంది.

నేటి ప్రజలకు భగవద్గీత..

నాడు అర్జునుడు కురుక్షేత్ర ప్రాంగణంలో యుద్దానికి వెనుకడుగు వెస్తూ అధైర్యంతో కుచించుకుపోతే ఆయనకు సరైన మార్గ నిర్దేశనం కృష్ణుడు చేశాడు. ఆనాడు కృష్ణుడు చెప్పిన మాటలే నేటి వరకు ప్రజల ముందు భగవద్గీత రూపంలో ఉన్నాయి.  కాలాలు మారిన మనిషి స్వభావం అట్లా ముందుకు వెనక్కి ఊగిసలాడుతూనే ఉంటుంది.  అలాంటి స్వభావానికి సరైన మార్గం చాలా అవసరం.  అలా మార్గం చూపించేది భగవద్గీతనే.  అందుకే యుగాలు మారినా  భగవద్గీతకు ఆదరణ ఏమాత్రం మారడం లేదు.  మనిషి మనసు పెట్టి భగవద్గీతను అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే భగవద్గీత చక్కని దారి చూపిస్తుంది.  వేగవంతమైన నేటి తరంలో భగవద్గీత అవసరం ఎంతో ఉంది.

పని చేయాలి, కర్మ ఫలాన్ని ఆశించకూడదు..

భగవద్గీత చెప్పే ఒక్క సూత్రం ఆచరిస్తే మనిషి జీవితం అద్బుతంగా మారుతుంది.  ఎవరైనా సరే తన ముందున్న కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.  ఆ తరువాత దానికి వచ్చే ఫలితం గురించి ఆలోచించకూడదు,  ఫలితం వచ్చినా దాని పట్ల వ్యామోహం ఉండకూడదు.  పని చేశాను,  ఫలితం భగవంతుడు ఇచ్చాడు, ఇది ఆయనకే చెందుతుంది అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఫలితాన్ని మనిషి అనుభవించినా దాని తాలూకు కర్మ బంధం మనిషిని ఆవరించదు. ఇదే భగవద్గీత చెప్పే సారం.   దీన్నే నిష్కామ కర్మ అని అంటారు. మనసులో ఎలాంటి కోరిక పెట్టుకోకుండా పని  చేయడమే నిష్కామ కర్మ.

ఆధ్యాత్మిక లోకం..

భగవద్గీత మనిషిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. జీవాత్మ, పరమాత్మ,  పకృతి, పురుషుడు,  పంచభూతాలు, ఇంద్రియ నిగ్రహం, దైవ భక్తి, ఆరాధన.. ఇట్లా చాలా విషయాలను భగవద్గీత చెబుతుంది. అయితే భగవద్గీత అంతిమ లక్ష్యం.. మనిషిని మోక్షం వైపు తీసుకెళ్లడం.

                                *రూపశ్రీ.