మతం గురించి వివేకానందుడి మాట!!

 

మతం గురించి వివేకానందుడి మాట!!

ఏతద్విషయకాలైన అసంఖ్యాక గ్రంథాలు వేదాలను సమర్ధిస్తున్నాయి. ఆ గ్రంథ రచయితల వద్దకెళ్ళి "వేదాలు తొలుత మానవుడి నోటినుండి వెలువడ్డవే" అంటే వారు నవ్వుతారు. మొట్టమొదట మానవుడే వాటిని పలుకగా మీరు వినిఉండలేదు. బుద్ధుని మాటలను తీసుకోండి. ఆ మాటలను అతడు అంతకుపూర్వం అనేక జన్మల్లో పలికి ఉన్నాడనే సంప్రదాయం ఒకటి ఉంది. క్రైస్తవుడు లేచి "నా మతం చారిత్రాత్మకమైంది. కాబట్టి నీ మతం తప్పు. నా మతమే సరైనది" అంటే, అప్పుడు ఇలా బదులు చెబుతాడు: "నీ మతం చారిత్రకమైనది కాబట్టి పంథోమ్మిది వందల ఏళ్ళలో తయారైంది. దాన్ని మానవుడు కల్పించాడని నువ్వే అంగీకరిస్తున్నావు. ఏది సత్యమో అది ఆద్యంతరహితం, నిత్యమూ అయిఉండాలి. అదే సత్యానికి ఏకైక ప్రమాణం. అది ఎన్నటికీ నశించదు. అది సర్వదా ఒక్కటే. మీ మతాన్ని ఫలానా.... ఫలానా వారు సృష్టించారని మీరే ఒప్పుకుంటున్నారు. వేదాలు పురుష ప్రణీతాలు కావు. అవి ప్రవక్తలుకాని... మరెవరు కాని సృష్టించినవి కావు. ఆద్యంతరహితమైనదే శబ్దం. ఆద్యంతరాహిత్యతే దాని స్వరూపం. ఆ శబ్దంనుండే ఈ సమస్త ప్రపంచం పుడుతోంది, అందులోనే లీనమౌతోంది." తాత్త్వికంగా అది ఎంతో సబబైన జవాబు. సృష్టికి శబ్దమే మొదలు. బీజరూపాల మాదిరే బీజశబ్దాలు కూడ ఉన్నాయి. మాటలు లేక భావాలు ఉండవు.


ఎక్కడెక్కడ అనుభవాలు, అభిప్రాయాలు, ఆవేశాలు ఉన్నాయో అక్కడక్కడ అన్ని శబ్దాలు ఉండాలి. ఇక ఈ నాలుగు గ్రంథాలే వేదాలు, ఇంతకుమించి మరేవీ వేదాలు కావన్నప్పుడే చిక్కంతా కలుగుతోంది. అప్పుడు బౌద్ధులుకూడ లేచి "మా గ్రంథాలు కూడ వేదాలే. అవి మాకు తరువాత వెలువరింప బడ్డాయి" అంటారు. అది పొసగని మాట. అది ప్రకృతి పద్ధతి కానేకాదు. ప్రకృతి తన శాసనాలను కొంచెం కొంచెంగా వ్యక్తపరచదు. గురుత్వాకర్షణ శక్తిని నేడు కొంత రేపు కొంతగా వ్యక్తంచెయ్యదు. ప్రతి నియమం సంపూర్ణమే. నియమంలో క్రమపరిణామ మనేది లేదు. ఒక్కసారి వ్యక్తమైనది అలాగే నిలుస్తుంది. 


"ఇది కొత్తమతం, ఇది వరిష్ఠమైన ఈశ్వర ప్రేరితజ్ఞానం" మొదలైనవి అర్థంలేని మాటలు, అభావమే వాటికి అర్థం. నూరువేల శాసనాలుండొచ్చును. వాటిలో కొన్నిటినే మానవుడు ఇప్పటికి తెలుసుకొని ఉండవచ్చును. మనం వాటిని కనుగొందాం. అంతేకదా! శబ్దం నిత్యమని పెద్దవాదం చేసే పాతపురోహితులు, దేవతలను త్రోసిరాజుచేసి. తామే దేవతలస్థానం ఆక్రమించారు. వారిలా అన్నారు. "శబ్దాల శక్తి మీకు తెలియదు. వాటి ప్రయోగం మే మెరుగుదుం. లోకంలో మేమే ప్రత్యక్ష దేవతలం. మాకు ధనం ఇవ్వండి, మేం శబ్దాలను ప్రయోగిస్తాం. మీ కోర్కెలు ఫలిస్తాయి. ఈ శబ్దాలు మీరు ఉచ్చరించగలరా? మీరు ఉచ్చరించలేరు. ఒక్క అక్షరమైనా తప్పుగా పలికారా, జాగ్రత్త! కీడు మూడుతుంది. మీకు ఐశ్వర్యం, సౌందర్యం, దీర్ఘాయుస్సు, చక్కని భర్త కావాలా? పురోహితుడికి డబ్బు ముట్టచెప్పి, నిశ్చింతగా ఉండండి.!" అని. 


మరొక పద్ధతి ఉంది. వేదాల్లోని మొదటిభాగం (కర్మకాండలోని లక్ష్యం ఉపనిషత్తులనే రెండవభాగంలోని లక్ష్యానికి పూర్తిగా భిన్నం. మొదటిభాగంలో కనిపించే లక్ష్యం, ఒక్క వేదాంత మత లక్ష్యంతో తప్ప, మిగిలిన మతాలన్నిటి లక్ష్యంతో సరిపోతుంది. ఇహలోకంలోను, పరలోకంలోను భోగాన్ని అనుభవించటమే ఆ లక్ష్యం - భార్య, భర్త, బిడ్డలు. మీ రుసుం మీరు చెల్లించండి. మతగురువు మీకు యోగ్యతాపత్రాన్ని ఇస్తాడు. అప్పుడు మీకు పరలోకంలో సకల సుఖాలు కలుగుతాయి. అక్కడ మీవారంతా ఉంటారు. మీ భోగానుభవాలకు అంతం ఉండదు. కన్నీరు ఉండదు. దుఃఖం ఉండదు. నిరంతరం నవ్వే. కడుపునొప్పి అనేది లేకుండా తినటమే. తలనొప్పి లేకుండా వినోదించడటమే. ఇది మానవ జీవితానికి పరమలక్ష్యమని పురోహితుల భావం..


ఈ తత్త్వావాదంలో మరో ఆశయం ఉంది. అది  ఆధునిక భావాలకు అనుగుణమైంది. మానవుడు ప్రకృతికి భానిస, అతడు శాశ్వతంగా బానిసగా ఉండవలసిందే. మేం దీన్ని కర్మ అంటాం. 'కర్మ' సిద్ధాంతం. అంటే 'కర్మ' అన్నిటికి అన్వయిస్తుంది. సర్వం కర్మకు అధీనం. "దీన్నుండి బైటపడే దారి లేదా?" "లేదు! ఎల్లకాలం బానిసలుగా, మంచి బానిసలుగా ఉండి తీరవలసిందే. మేం కొన్నిశబ్దాలను ప్రయోగించి, నీకు మేలే తప్ప కీడు అనేది లేకుండా చేస్తాం. కాని అందుకు మీరు మాకు చాలినంత డబ్బు చెల్లించాలి" ఇది  లక్ష్యం. ఈ ఆశయాలు యుగాలపర్యంతం జనప్రాచుర్యాన్ని అందుకొన్నాయి. జనంలో అత్యధిక సంఖ్యాకులు ఆలోచనాపరులు కారు. ఒకవేళ ఆలోచించటానికి ప్రయత్నించినా, పుట్టలు పుట్టలుగా పెరిగి పోయిన మూఢవిశ్వాసాల ప్రభావం వారిమీద దారుణంగా ఉంది. ఏ ముహూర్తంలోగాని అవి కాస్త సడలిపోతే ఏదో కష్టం వాటిల్లుతుంది. దానితో వారి వెన్నెముక ఇరవై ముక్కలవుతుంది. ఆశ, భయం ఈ రెండే వారిని నడిపిస్తాయి. వారు తమంత తాముగా ముందుకు కదలరు. మీరు వారిని అదలించండి, బెదరించండి. భయపెట్టండి. అయినా వారు మీకు శాశ్వత దాసులుగా ఉంటారు. డబ్బు చెల్లిస్తూండటం, విధేయులై ఉండటం తప్ప వారింకేమీ చెయ్యనక్కర్లేదు. తక్కినదంతా పురోహితుడే చేస్తాడు... ఎంతి మంది మతబోధకులు ఈ మార్గాన్ని ఒక వెరీతిగా, డబ్బు సంపాదన మార్గంగా మార్చుకున్నారు. ఇది అందరూ చూస్తూనే ఉన్నారిప్పుడు. 


మతం ఎంత సులభమైందో చూశారా! మీరు చెయ్యాల్సింది ఏమీ లేదు. ఇంటికెళ్ళి హాయిహాయిగా కూర్చోండి. మీకోసం మరొకరు అన్నీ చేస్తున్నారు. నిర్భాగ్యులైన పశువులు! 


అని తన ఉపన్యాసంలో చెబుతాడు వివేకానందుడు.


◆ వెంకటేష్ పువ్వాడ