విష్ణువు మత్స్యావతారం వెనుక జరిగింది ఇదేనట..!
విష్ణువు మత్స్యావతారం వెనుక జరిగింది ఇదేనట..!
ఈ సృష్టిలో, హిందూ ధర్మంలో ఎందరు దేవతలు ఉన్నా విష్ణువుకు ఉన్న ప్రాధాన్యత వేరు. వైష్ణవుల పేరిట విష్ణువును, ఆయన రూపాలను, అవతారాలను కీర్తించే వారు కోకొల్లలు. విష్ణువు దశావతారాలలో మత్స్యావతారం కూడా ఒకటి. అసలు విష్ణువు మత్స్యావతారం ఎందుకు ఎత్తాడు. దీని వెనుక జరిగిన కథ ఏంటి? తెలుసుకుంటే..
సత్య యుగం ప్రారంభంలో ఈ ప్రపంచం చాలా పవిత్రంగా ఉండేది. ఈ సత్యయుగంలోనే విష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ప్రపంచాన్ని రక్షించడానికి, ధర్మం నిలబెట్టడం కోసం విష్ణువు మత్స్య అవతారం తీసుకున్నాడని చెబుతారు.
మత్స్య అవతారం వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. పూర్వం సత్యవ్రతుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఈయన ద్రావిడ దేశాన్ని పాలించేవాడు. సత్యవ్రతుడు ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఆయనకు నదిలో ఒక చిన్న చేప దొరికింది. తనకు దొరికిన చేపను సత్యవ్రతుడు ఇంటికి తీసుకెళ్లాడట. అయితే సత్యవ్రతుడు ఇంటికి తీసుకువెళ్లిన తరువాత ఆ చేప తన రూపాన్ని మార్చుకోవడం మొదలు పెట్టిందట.
తాను సాధారణ చేపను కాదని, విష్ణువు అవతారమని ఆ చేప సత్యవ్రతుడికి చెప్పిందట. హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడని, భూమిపై పెను ప్రళయం జరగబోతోందని చేప రూపంలో ఉన్న విష్ణుమూర్తి సత్యవ్రతుడికి చెప్పాడట. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు ఒక పెద్ద పడవను సృష్టించి ఆ పడవలో అన్ని జంతువులు, మొక్కలు, ఋషులు, ప్రజలను తీసుకెళ్లి ప్రళయం నుండి రక్షించమని సత్యవ్రతుడికి చెప్పాడట. ప్రళయ కాలంలో నేను నీకు మార్గనిర్దేశం చేస్తానని మహావిష్ణువు సత్యవ్రతుడితో చెప్పాడట.
సత్యవ్రతుడు మహావిష్ణువు ఆజ్ఞను శిరసావహించాడు. హయగ్రీవుడు వేదాలను అపహరించిన తరువాత ప్రళయం నెలకొంది. ఆ సమయంలో మహావిష్ణువు సృష్టించిన పడవలో సత్యవ్రతుడు జీవకోటిని అందులో చేర్చగా.. విష్ణువు తన శంఖానికి పడవను కట్టి సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లాడట.
ప్రళయ క్రోధం చల్లారిన తరువాత చేప రూపంలో ఉన్న విష్ణువు హయగ్రీవుడిని చంపి వేదాలను తిరిగి సొంతం చేసుకున్నాడట. ఆ తరువాత ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చాడట. ఇలా వేదాలను కాపాడటం కోసం మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్నాడని పురాణ కథనాలు చెబుతున్నాయి.
*రూపశ్రీ.