వ్యాపారులు నగదు బీర్వా ఎక్కడ ఉంచాలి? (Vastu – Business – Cash Counter)

 

వ్యాపారులు నగదు బీర్వా ఎక్కడ ఉంచాలి?

(Vastu – Business – Cash Counter)

 

వివిధ వ్యాపారాల్లో ఫైనాన్స్ వ్యాపారం ఒకటి. అంటే చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు అన్నమాట. వడ్డీకి రుణాలు ఇవ్వడం, నెలనెలా చెట్లు నిర్వహించడం, డిపాజిట్లు, షేర్లు, తాకట్టు.. ఇలా అనేక రూపాల్లో డబ్బుతోనే వ్యాపారం చేస్తారు. కనుక ఫైనాన్స్ బిజినెస్ లో నగదు బీర్వా మరీమరీ ముఖ్యమైంది. వాస్తు సూత్రాలను అనుసరించి ఇళ్ళలో నగదు బీర్వా ఎక్కడ ఉంచాలి అనేదానికి నియమాలు ఉన్నాయి. ఇక వ్యాపారాల్లో నగదు బీర్వా ఉంచడం విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి.

 

ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు నగదు బీర్వాను వాయువ్యంలో ఉంచడం శ్రేయస్కరం. బీర్వాలో సేఫ్టీ లాకర్ ను వాయువ్యంలో దక్షిణ ముఖానికి ఉండేలా ఏర్పాటు చేయాలి. నగదు భద్రపరిచే బీర్వా వాయువ్యంలో పశ్చిమ గోడకు ఆనుకున్నా, ఆనుకోకపోయినా పరవాలేదు. ఉత్తరపు గోడకు మాత్రం ఆనుకుని ఉండకుండా జాగ్రత్త పడాలి.

 

నగదు బీర్వాను పూర్తి వాయువ్యం మూల పెట్టేందుకు వీలు కుదరక పోయినట్లయితే ఉత్తర మధ్యభాగంలో ఏర్పాటు చేసుకోవాలి.

 

కొందరు నగదు ఉంచే బీర్వాను నైరుతి వైపున ఉంచుతారు. కానీ దీనివల్ల వ్యాపారంలో చిక్కు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నైరుతిలో ప్రధాన అధికారి కూర్చోవచ్చును. నగదు బీర్వాను మాత్రం వాయువ్యంలో అమర్చడమే మంచిది.

 

ఫైనాన్స్ కంపెనీ ఉన్నతాధికారి, తక్కిన అధికారులు ఉత్తర ముఖానికి కూర్చోవడం వల్ల వ్యాపారంలో సమస్యలు ఉత్పన్నం కావు.

 

బ్యాంకుల్లో నగదు ఇచ్చిపుచ్చుకోవడం, నగలు తాకట్టు పెట్టుకోవడం మొదలైన పనులు కూడా వాయువ్యంలోనే జరిగేటట్లు చూడాలి. ఈ క్యాష్ కౌంటర్లు ఉత్తర వాయువ్యంలో ఉండటం శ్రేష్టం. అలా కుదరని పక్షంలో ఉత్తర మధ్యభాగంలో కౌంటర్లు ఉన్నా పరవాలేదు.