ఉద్దాలక మహర్షికి జీవసృష్టి మూలసూత్రం గురించి ఎలా తెలిసింది?

 

ఉద్దాలక మహర్షికి జీవసృష్టి మూలసూత్రం గురించి ఎలా తెలిసింది?

ప్రాచీన భారతదేశంలో కురుపాంచాలమనేది ఒక రాజ్యం. సిరిసంపదలకు, వివిధ కళలకు నిలయమైన ఆ దేశం వేదవిద్యకు పెట్టినది పేరు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి అధ్యయన అధ్యాపనాలను నిరంతరంగా సాగించే గురుకులాలు ఎక్క డ చూచినా కనిపిస్తూ ఉండేవి. ఇంకా అక్కడ ఎప్పుడూ నిత్యాగ్నిహోత్రులు, నిష్టాగరిష్టులు, ఆత్మసాక్షాత్కార సంపన్నులు అయిన కులపతులు గురుకులాలను నిర్వహించేవారు. అటువంటి కులపతులలో సకలశాస్త్ర పారంగతుడు అయినవాడు అరుణుడు. ఆధ్యాత్మ విద్యావరిష్ఠుడై అతడు మహర్షిగా కూడా పిలవబడ్డాడు. అతని కుమారుడే ఉద్దాలకుడు.

అరుణుడి కుమారుడు అయిన  ఉద్దాలకుడు ఉపనయనం అయిన తరువాత తన తండ్రి దగ్గరే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఉద్దాలకుడు ఎంతో తెలివైనవాడు, ఏక సంధాగ్రహి, ఏ విషయం అయినా ఇట్టే తొందరగా గ్రహించేసేవాడు. కాబట్టి చాలా తొందరగానే వేదాధ్యయనం పూర్తి చేశాడు. అయితే గురువుకు సేవ చేయడం ద్వారా  పొందే విద్య అత్యంత శ్రేష్ఠమైనదని భావించిన అరుణుడు తన కుమారుడిని  పిలిచి మద్రనగరంలో సుప్రసిద్ధుడైన పాతంజల కాప్యుని గురుకులానికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేయమని చెప్పాడు. తండ్రి చెప్పినట్టే ఉద్దాలకుడు మద్రనగరంలో పాతంజల కాప్యుని దగ్గరకు వెళ్లి ఆయనకు శిష్యుడిగా చేరాడు. 

అక్కడ ఉద్దాలకుడు వినయ విధేయతలతో అకుంఠిత దీక్షతో గురువును మెప్పించి శాస్త్రాలని కరతలామలకం చేసుకున్నాడు. వశిష్ఠచైకతానేయ, దివోదాస భైమసేనుడు ఇతని సమకాలీనులు.  సతీర్థ్యులు, శాస్త్రార్థవిచారం కోసం, అధ్యాత్మ విషయాలకు సంబంధించిన సంశయాలను నివృత్తి చేసుకోవడం కోసం అనేక మంది మేధావులు, మహాత్ములు పాతంజల కాప్యుని గురుకులానికి వచ్చేవారు. వారితోటి పరిచయం, అక్కడ జరిగే సంఘటనలు  పాతంజల కాప్యుని  దగ్గర శిష్యులుగా చేరిన వారిని ఎంతగానో ప్రభావితులను చేసేవి. 

ఒకసారి పాతంజల కాప్యుని భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు.

'ఎవరు నీవు ?' అని అడిగితే తనను తాను కబంధ ఆధర్వుణడని, 'ఆధ్యాత్మ విషయవిచారం' కోసం వచ్చానని ఇలా అడిగాడు. 

"ఓ పాతంజల కాప్యా! ఇహలోకము పరలోకము అందలో సర్వభూతాలు ఏ సూత్రంతో బంధించబడి ఉన్నాయో నీకు తెలుసా'' ? అని అడిగాడు.

అప్పుడు పాతంజల కాప్యుడు "అయ్యా! ఆ మూలసూత్రం గురించి నాకేమీ తెలియదు" అని సమాధానమిచ్చాడు.


తరువాత గంధర్వుడు మరో ప్రశ్న వేశాడు "పోనీ ఈ లోకానికీ, పరలోకానికీ సర్వభూత జాలానికీ అంతర్యామిగా వుండే తత్త్వమేమిటో నీకు తెలుసా?" అని. 

దానికి కూడా కాప్యుడు, "అయ్యా! సర్వవ్యాపియైన ఆ తత్త్వమేమిటో కూడా నాకు తెలియదు. అటువంటిది  ఒకటుందని మీవల్లనే తెలిసింది. దయతో దానిని గురించి తెలియజేసి నన్ను కృతార్థుని చేయండి" అని ప్రార్థించాడు. 

దానికి ఆ గంధర్వుడు ఇలా అన్నాడు- " ఓ కాప్యా! ఇహపరలోకాలను, సర్వభూతసమూహాన్ని బంధించే సూత్రాన్ని, సర్వేసర్వత్రా ప్రత్యక్షమై ఉండే అంతర్యామి తత్త్వాన్ని గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్తూ పరబ్రహ్మ తత్త్వాన్నే తెలుసుకున్నవాడు అవుతాడు. ఆ విధంగా పరబ్రహ్మ తత్త్వవిజ్ఞాన ఘనుడైనవానికి సర్వలోక విజ్ఞానం కలుగుతుంది.  సర్వదేవతా విజ్ఞానం సిద్ధిస్తుంది. వేదవిత్ అవుతాడు. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దాంతో సర్వజ్ఞుడౌతాడు" అని ఆ జ్ఞాన వైభవాన్ని తెలియజేసాడు. 

ఈ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన ఉద్దాలకునికి జీవసృష్టికి ఆధారమైన మూలసూత్రము అంతర్యామి తత్త్వము యొక్క జ్ఞానం కలిగింది.

                                       ◆నిశ్శబ్ద.