Read more!

పురాణాల్లో కన్య కథ ఇదే...

 

పురాణాల్లో కన్య కథ ఇదే...

పురణాలలో స్త్రీ ప్రదాన పాత్రలు కొన్ని ఉంటాయి. ఈ పాత్రల స్వభావం చాలా ఆసక్తికరంగా, మరెంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. అలాంటి పాత్రలలో కన్య కూడా ఒకటి. కన్య అనగానే గురజాడ అప్పారావు గారు రచించిన కన్యక పద్య పాఠం గుర్తొస్తుందేమో కొందరికి. కానీ ఆ కన్యకకు ఈ కన్యకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే ప్రస్తుతం చెప్పుకునే కన్య వృత్తాంతం…

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కన్య. ఆమెను తల్లిదండ్రులు చక్కగా పెంచారు. ఆమె గుణంలోనూ, రూపంలోనూ, పనితనంలోనూ ఎంతో చక్కనైనది. ఆమెకు పెళ్లి వయసు రాగానే ఎన్నో సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. అయితే ఈడు జోడు బాగుండాలనే ఆలోచనతో తల్లిదండ్రులు తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేయడం చేస్తున్నారు. 

ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరూ అత్యవసర పని మీద పక్క ఊరికి వెళ్లారు. కన్య ఒక్కతే ఇంట్లో ఉంది. అదే సమయంలో మరొక ఊరు నుండి కన్యను చూడటం కోసమని ఒక అబ్బాయి కుటుంబ సభ్యులు కన్య ఇంటికి వచ్చారు. వారిని చూసి తల్లిదండ్రులు లేరు పొమ్మని చెప్పకుండా ఎంతో మర్యాదగా లోపలికి పిలిచింది కన్య. వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తరువాత వారిని కూర్చోబెట్టింది. తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది. తరువాత కన్య  వాళ్ళతో ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది.  వంటగదిలో డబ్బాలు అన్ని తెరచి చూడగా అతిథులకు పెట్టడానికి ఆహారపదార్థాలు ఏమి కనిపించలేదు. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేద్దామని చూసేసరికి ఒక డబ్బాలో వరి పిండి కనిపించింది. ఆ పిండి బయటకు తీసి దాంతో జంతికలు చేద్దామని పిండి కలపడం మొదలుపెట్టింది. అయితే గాజులు గలగలమంటూ శబ్దం చేశాయి. 

గాజుల శబ్దం విని ఏదో చేస్తుందని వచ్చినవాళ్ళు కనుక్కుంటారని చేతుల్లో రెండు గాజులు మాత్రమే ఉంచి మిగిలిన గాజులు తీసేసి పిండి కలపడం మొదలెట్టింది. అయితే మిగిలిన రెండు గాజులు కూడా శబ్దం చేస్తుండటంతో ఒక గాజు మాత్రమే ఉంచుకుని తొందరగా ఆ పిండితో జంతికలు చేసి వచ్చినవారికి పెట్టింది.

అమ్మాయి చాలా పనిమంతురాలు అని గ్రహించిన మగపెళ్ళివారు అక్కడి నుండి వెళ్ళిపోయి తరువాత కన్య తండ్రికి కబురు పెట్టారు. 

ఈ కథలో ఏముంది విషయం అనే సందేహం అందరికీ వస్తుంది. కానీ కన్య చేతిలో మొదట చేతి నిండుగా వేసుకున్న  గాజుల్లా చాలామంది ఒకచోట చేరితే సహజంగానే గందరగోళం అయినట్టు విషయాలు అన్నీ ప్రవాహంలా మారుతాయి. ఆ తరువాత వేసుకున్నట్టు కనీసం రెండే రెండు గాజుల్లా ఇద్దరు మనుషులున్నా నిశ్శబ్దం అనేది కొనసాగదు. ఏదో ఒక విషయం గురించి అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది. 

మనిషికి ఒంటరితనం కు మించిన ఏకాంతం, ఒంటరితనం ఇచ్చే ప్రశాంతత మరింకేది ఇవ్వదు. ఇదీ కన్య కథ మనిషికి ఇచ్చే సందేశం.

                                   ◆నిశ్శబ్ద.