Read more!

విదేహ రాజ్యంలో యాజ్ఞవల్క్యునికి జరిగిన సంఘటన ఏమిటి?

 

విదేహ రాజ్యంలో యాజ్ఞవల్క్యునికి జరిగిన సంఘటన ఏమిటి?

పురాణాలలో యాజ్ఞవల్క్యుని గురించి చాల చోట్ల ప్రస్తావన వస్తుంది. యాజ్ఞవల్క్యుడు ఒక పేద బ్రాహ్మణుడని చెబుతూ ఉంటారు. అయితే ఆయన కేవలం పేద బ్రహ్మణుడే కాదు.అంతకు మించి గొప్ప జ్ఞానం, నీతి నిజాయితీ, తొణకని ఆత్మస్థైర్యం కలిగినవాడు. యాజ్ఞవల్క్యుని ఆత్మస్తైర్యం, ఆత్మవిశ్వాసం గురించి ఒక చక్కని ఉంది. అది విదేహ రాజ్యంలో జరిగిన ఒక సంఘటన. దాని గురించి తెలుసుకుంటే...

విదేహదేశాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. వచ్చినవారికి అందరికీ పెద్దఎత్తున దానధర్మాలు చేశాడు. యజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసిన విద్వద్వరేణ్యులకి పండిత ప్రకాండులకి ఒక సభను ఏర్పాటు చేశాడు. అందులో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన చర్చలకు అవకాశం కలుగజేసాడు. బలిష్ఠములైన వేయి పాడిఆవులని తెప్పించి, వాటి కొమ్ములను బంగారు నాణాలతో అలంకరించాడు.

ఆ తరువాత ఆ సభలో అందరినీ ఉద్దేశించి  "బ్రహ్మజ్ఞాని అయినవాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ ఆవులను తోలుకొని వెళ్ళవచ్చు" అని సభాముఖంగా ప్రకటించాడు.

అసలే బలిష్టమైన ఆవులు. మరీ వాటి కొమ్ములకు బంగారు నాణేలు కూడా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఆవులు, వాటికి బోలెడు నాణేలు. ఎంతో విలువైన పారితోషికం. అందరికీ అందుకోవాలని వుంది. అయితే తగిన అర్హత తమకుందా అని బేరీజు వేసుకోసాగారు. శాస్త్రజ్ఞాన సంపన్నులయిన ఆశ్వలుడు, ఆర్త భాగుడు, గార్గి, శాకల్యుడులాంటి వారెంతో మంది అక్కడవున్నా, ముందుకు రావడానికి సాహసించలేక పోతున్నారు. 

అయితే ఎవరూ ఊహించని విధంగా యాజ్ఞవల్క్య మహర్షి మాత్రం అందుకు సిద్ధపడ్డాడు. సభలోని పండితులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. పారితోషికం చేజారిపోతున్నది. దానిని తమవశం చేసుకోవాలంటే యాజ్ఞవల్క్య మహర్షిని ఎదిరించి, వాదించి, జయించాలి. అది వారికి సాధ్యమని అనిపించలేదు. జనకుని ప్రధాన పురోహితుడైన ఆశ్వలుడు ముందుకు వచ్చి 

"యాజ్ఞవల్క్యా! జిజ్ఞాసువులలో నేనే ప్రథముడనని ఊహించుకుంటున్నావు నువ్వు. అందుకే ఎవ్వరూ ముందుకు రాకపోయినా నువ్వు ముందుకు వచ్చావు. అసలు నీకు బ్రహ్మతత్త్వం గురించి తెలుసా?'' అని అడిగాడు. 

దానికి యాజ్ఞవల్క్యుడు "బ్రహ్మజ్ఞానం నాకు తెలియదు. అయినా బ్రహ్మజ్ఞానానికి వినయంగా వంగి నమస్కరిస్తాను. నేను బీద బ్రాహ్మణుణ్ణి. ఈ ఆవుల అవసరం నాకెంతో వుంది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సందేహాలు ఎరికైనావుంటే నా శక్తిమేరకు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను" అని అంటూ బ్రహ్మజ్ఞానం బుద్ధికి అందేది కాదని నర్మగర్భంగా సమాధానంలో సూచించాడు.


ఆ తరువాత ఆశ్వలుడు యజ్ఞాలను గురించి, వాటి అధిష్ఠాన దేవతల గురించి, యజ్ఞఫలాలను గురించి, మంత్రాలను గురించి అనేక ప్రశ్నలు వేశాడు. వాటన్నిటికీ తడుముకోకుండా యాజ్ఞవల్క్యుడు సమాధానాలు ఇవ్వడంతో అశ్వలునికి మౌనంగా కూర్చోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. అందరూ అప్రతిహతమైన యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానానికి జేజేలు పలికారు. సభాసదులతో కలిసి జనకుడు అతనిని గోసంపదతో సాగనంపాడు. ఇదీ యాజ్ఞవల్క్యునికి విదేహారాజ్యంలో జరిగిన సంఘటన.

                                        ◆నిశ్శబ్ద.