తులసీదాసు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన..!
తులసీదాసు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన..!
తులసీదాసు రామచరిత మానసము రచయితగా యావత్ భారతావనికే కాక.. రామ భక్తులకు అందరికీ తెలుసు. ఆయన కేవలం రామచరిత మానసము మాత్రమే కాకుండా హనుమాన్ సంబంధిత చాలా శ్లోకాలు, స్తోత్రాలు కూడా అందించారు. స్వయానా ఆ హనుమంతుల వారి ఆలింగనం పొందిన మహానుభావుడు తులసీదాసు.. ఇంతటి గొప్ప సాధకుడు తన జీవితంలో ఒక దశలో భార్య మీద మోహంతో రగిలిపోయాడని తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇదే నిజం.. ఆయన జీవితాన్ని మలుపు తిప్పినది కూడా ఆయన భార్యే.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుంటే..
చిన్నతనంలోనే అందరికీ దూరమైన తులసీదాసు ఒక గుడి మెట్ల మీద కూర్చుని, అక్కడే పడుకుంటూ.. అక్కడే ఉంటూ రామ, రామ అంటూ పదే పదే స్మరిస్తూ ఉండేవాడు. దీంతో ఆయనకు ఒక గురువు తారక మంత్ర ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత ఆ తారక మంత్ర జపం వేలు, లక్షలు జపం చేస్తూ ఆయన గొప్ప ఉపాసకుడు అయిపోతాడు. ఆయనకు ఒక వయసు వచ్చేసరికి తారక మంత్ర జపం ప్రభావం కారణంగా ఆయన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఒకసారి ఒక వ్యక్తి అక్కడి గుడికి వచ్చి తులసీదాసును చూసి ఆయనలో తేజస్సు చూసి.. నాయనా నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు తులసీదాసు.. నన్ను రాంభోలా అని అంటారు. నాకు ఎవరూ లేరు.. నేను ఇక్కడే ఉంటూ తారక మంత్రం ఉపాసన చేసుకుంటూ ఉంటాను. అని చెబుతాడు.
ఆ మాటలు వినగానే ఆ వ్యక్తి రాంభోలా తో.. బాబూ.. నాకు ఒక కూతురు ఉంది. తను ఎంతో గుణవంతురాలు.. తనను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెబుతాడు. రాంభోలా కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పడు. రాంభోలాకు వివాహం అయిన తరువాత ఆయన వ్యవహారమే మారిపోతుంది. చిన్నతనం నుండి ఎవరి ప్రేమకు నోచుకోని రాంభోలాకు భార్య దొరికే సరికి ఆవిడే ఆయన ప్రపంచం అయిపోతుంది. తారక మంత్రం సాధన, జపం అన్నీ ఆగిపోతాయి. ఎప్పుడూ బార్య చుట్టూ తిరగడమే ఆయన పని అయిపోతుంది. ఇవన్నీ భార్యకు కాస్త ఇబ్బంది అనిపిస్తాయి. కానీ కొత్తగా పెళ్లైంది కదా అందుకేనేమో అనుకుంటుంది. కానీ కాలం గడిచినా రాంభోలా ప్రవర్తనలో మార్పు లేదు.. పైగా ఆమె ఎక్కడికైనా వెళ్లాలి అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు.. అమ్మో నిన్ను వదిలి నేను ఉండలేను. అని చెప్పేవాడు.
ఒక రోజు రాంభోలా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళతానని చెబుతుంది. సాయంత్రం లోపు తిరిగి వచ్చేలా అయితేనే వెళ్ళు అని రాంభోలా చెబుతాడు. సరే అని ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళుతుంది. అయితే సాయంత్రం తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటుండగా జోరు వాన మొదలవుతుంది. ఈ వానలో వెళ్లడం ఎలా కుదురుతుందిలే అనుకుని ఆమె అక్కడే ఆగిపోతుంది. కానీ భార్య రాకపోవడంతో రాంభోలా చాలా సతమతం అయిపోతాడు. ఆయన భార్య లేకుండా ఉండలేక ఆ వానలోనే తన భార్య దగ్గరకు బయలుదేరతాడు.. జోరు వానలో రాళ్లు రప్పలు దాటుకుంటూ.. తన అత్తవారింటికి చేరుకుంటాడు. కానీ ఆ చీకటిలో అత్తారింటి తలుపు కొట్టడానికి సంకోచిస్తాడు. భార్యను వదిలి ఉండలేకపోయాడు అని అందరూ తనను అవమానించి మాట్లాడతారు అనుకున్నారు. అప్పుడే ఇంటికి వెనుకకు వెళతారు. అక్కడ మేడ పైన ఒక గది ఉంటుంది. ఆ గదిలోనే తన భార్య ఉంటుందని రాంభోలాకు తెలుసు. ఆశ్చర్యంగా మేడపైకి వెళ్లడానికి అన్నట్టు అక్కడ ఒక తాడు వేలాడుతూ కనిపిస్తుంది.
రాంభోలా వెంటనే ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి భార్యను చేరుకుంటాడు. భర్తను చూడగానే రాంబోలా భార్య సంతోషించినా ఎలా వచ్చారని అడుగుతుంది. నేను వస్తానని తెలిసి నువ్వే తాడు విడిచావు కదా అని అంటాడు. నేను ఏ తాడు విడవలేదు అని ఆమె అయోమయంగా వెళ్లి చూస్తుంది. వెంటనే ఆశ్చర్యపోయి అక్కడున్నది తాడు కాదు.. పాము..మీకు భార్య మీద ఉన్న వ్యామోహంలో తాడు ఏది.. పాము ఏది అని కూడా ఆలోచించలేకపోయారు అని కోప్పడుతుంది. నా మీద చూపించే ప్రేమ, నా కోసం పడే తపనలో సగం ఆ శ్రీరామ చంద్రుడి మీద చూపించినా ఇప్పటికి ఆ శ్రీరామ చంద్రుడి అనుగ్రహం మీకు లభించేది అని చెబుతుంది. ఆ మాటలు వినగానే రాంభోలాలో సంఘర్షణ మొదలవుతుంది. ఆయన ఆ రాత్రే అక్కడి నుండి బయలుదేరి వారణాసి వెళ్లిపోతాడు. ఇదే ఆయనను తులసీదాసుగా మార్చింది. ఎన్నో రచనలు ఆయన నుండి వెలువడటానికి దారితీసింది.
ఎలాంటి వ్యక్తికి అయినా మోహం, దుర్గుణాలు అనేవి ఉంటాయి. కానీ ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆ గుణాల కారణంగానే కొన్ని ప్రేరణలు జరిగి ఆ భగవంతుడిని చేరడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి.
*రూపశ్రీ.