వాల్మీకి మహర్షి మళ్లీ అవతారం తీసుకున్నాడా!
వాల్మీకి మహర్షి మళ్లీ అవతారం తీసుకున్నాడా!
వాల్మీకి మహర్షీ పేరు చెబితే చాలా మందికి రామాయణమే గుర్తు వస్తుంది. రామాయణం ఇప్పుడు ఇందరి నోట నానుతోంది అంటే అది వాల్మీకి మహర్షి కలం నుండి జాలువారినదే.. వాల్మీకి మహర్షి గురించి అందరికీ తెలిసిందే.. రత్నాకరుడు అనే వ్యక్తి వాల్మీకి మహర్షిగాఎలా మారాడో.. రామాయణ కావ్యాన్ని ఎలా రచించారో కూడా తెలుసు అందరికీ. రామాయణాన్ని ఆదికావ్యం అని, వాల్మీకి మహర్షిని ఆది కవి అని కూడా పిలుస్తారు. అయితే వాల్మీకి మహర్షి ఆ జన్మ అనంతరం మరొక జన్మ తీసుకున్నారు. ఆ రెండవ జన్మ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువు స్మరణలో గడిపారు. వాల్మీకి మహర్షి తీసుకున్న జన్మ ఏది? దీని గురించి తెలుసుకుంటే..
వాల్మీకి మహర్షియే తులసీదాసుగా జన్మించారట. వాల్మీకి మహర్షి తన రామాయణంలో ఆ సీతారాములను, రామాయణాన్ని రాసిన తీరు వేరు.. కానీ అదే రామాయణాన్ని మంత్రపూర్వకంగా, మరింత భక్తిపూర్వకంగా.. ఆ కాలం అనంతరం మరింత మంది ప్రజలకు తెలియజేసే ఉద్దేశ్యంతో తులసీదాసుగా జన్మ తీసుకున్నారట. అందుకే ఆయన జీవితం చిన్నతనం నుండి ఆ రామ నామ స్మరణ తో సాగింది. స్వయానా ఒక గురువే ఆయన శిష్యుడిని పంపి తారకమంత్ర ఉపదేశం చేసేలా చేసింది. ఆయన పూర్తీగా శ్రీరామ ఉపాసకుడు అయ్యాక ఆయనకు ఎన్నో పరీక్షలు ఎదురైనా ప్రతి పరీక్ష కారణంగా ఆయన నుండి ఎన్నో అద్బుతమైన శ్లోకాలు, మంత్రాలు వెలువడి అవి ప్రజలకు చేరువ అయ్యాయి. అలాంటివే. హనుమాన్ చాలీసా, హనుమాన్ బాహుక్, సంకటహర మోచన హనుమాన్ స్త్రోత్రం.. మొదలైనవి.
రామచరిత మానసము కూడా సరిగ్గా శ్రీరామ నవమి రోజున మొదలుపెట్టి 2 సంవత్సవాలలో పదివేల దోహాలతో రచించారు. ఆయన రామచరిత మానసము సంకీర్తన చేస్తుంటే హనుమంతుల వారు రోజూ వచ్చి ఆ రామచంద్ర ప్రభువు కథనం వింటూ కళ్లనిండా నీళ్లు కారుస్తూ రామా.. రామా.. అంటూ పరవశించిపోతూ వినేవారట. చివరకు ఆ హనుమంతుల వారే తులసీదాసు జీవితాన్ని మరొక మలుపు తిప్పారు.
వారణాసిలో భైరవనాథుడు అనే తాంత్రికుడు రామచరిత మానస్ తాళపత్రాలు దొంగతనం చేసి తెమ్మని ఇద్దరు దొంగలను పంపితే.. ఇద్దరు కుర్రవాళ్లు బాణాలు ఎక్కుపెట్టి వారి వైపు వేశారు. దీంతో దొంగలు పారిపోయి మరుసటి రోజు ఉదయం తులసీదాసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి జరిగింది మొత్తం చెప్పారు. ఆ కుర్రవాళ్లు ఎవరో అర్థమైన తులసి దాసు రామ దర్మనం కోసం తపించిపోయారు. కొండల వెంట, రాళ్లు రప్పల వెంట పరిగెడుతూ ఉంటే.. ఆయన పట్టు తప్పి పడిపోబోయారు. అప్పుడే హనుమంతుల వారే స్వయంగా తులసీదాసును పట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు తులసీదాసు నోటివెంట అప్పటికప్పుడు వచ్చినదే హనుమాన్ సంకటహర మోచన స్తోత్రం.. సాక్షాత్తు హనుమంతుని కౌగిలి, శ్రీరామ చంద్ర ప్రభువు దర్మనం పొందిన వాడు తులసీదాసు.. ఆనాటి వాల్మీకియే తులసీదాసు.. మనం రామాయణం చదువుతాం.. కానీ ఉత్తరాది వారు రామచరిత మానసము ను చదువుతారు. ప్రతిరోజూ పారాయణ చేస్తారు. ఆ మహనీయుడిని రోజూ అలా తమలో భాగం చేసుకున్నారు. జై శ్రీరామ్..!
*రూపశ్రీ.