తులసీదాసు జయంతి.. ఆయన జీవితం అంతా కష్టాలు.. పరీక్షలే..!

 

తులసీదాసు జయంతి.. ఆయన జీవితం అంతా కష్టాలు.. పరీక్షలే..!

 

తులసీదాసు.. ఆధ్యాత్మిక చరిత్రలో  చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు..  శ్రీరామ భక్తుడిగా తులసీ దాసు అందరికీ పరిచయమే.. అయితే ఆ దేవుడి అనుగ్రహం పొందిన ప్రతి భక్తుడూ ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్న తరువాతే వారు దైవానుగ్రహానికి అర్హులు అయ్యారు.  తులసీదాసు గారి జీవితంలో కూడా అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతో ఆసక్తికరమైన తులసీదాసు గారి గురించి ఆయన జీవితం గురించి తెలుసుకుంటే..

 తులసీదాసు గారు పుట్టగానే తల్లిదండ్రులకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది.  ఆయన జాతకం చూసిన జ్యోతిష్కులు.. ఈ పిల్లవాడు దగ్గర ఉంటే తల్లిదండ్రులకు ప్రాణ గండం అని చెప్పారు. దీంతో పిల్లవాడిని ఎక్కడైనా వదిలెయ్యాలి అని తండ్రి అన్నాడు. కానీ తల్లిప్రేమ ఊరుకోలేదు.. నేను నా కొడుకును వదులుకోను అని చెప్పింది.  దీంతో చేసేది లేక తల్లిదండ్రులు పెంచసాగారు. కానీ జ్యోతిష్కులు చెప్పినట్టే తులసీదాసు తల్లి చనిపోయింది.  అడ్డు చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో తులసీదాసు తండ్రి తులసీదాసును వదిలేశాడు.  అయితే తులసీదాసును అతని అత్తగారు వరుస అయ్యే ఒకావిడ పెంచారు. కానీ తులసీదాసు దురదృష్టం.. 6ఏళ్ల వయసు వచ్చేసరికి ఆవిడ కూడా చనిపోయింది.  దీంతో ఎదురుగా ఉన్న ఒక గుడి దగ్గర కూర్చొనే వాడు.. అక్కడే పడుకుని ఉండేవాడు.  అందరూ హనుమంతుడిని,  రాముడిని  ఆరాధిస్తూ ఉంటే తను కూడా రామ, రామ అంటూ ఉండిపోయేవాడు.అలా ఎన్ని వేలు, లక్షల సార్లు నామ స్మరణ చేసేవాడూ.. దీంతో ఒక స్వామీజి తన శిష్యుడితో ఆ బాలుడికి తారకమంత్రం ఉపదేశించిరా.. అని చెప్పి పంపాడు. అప్పటి నుండి ఆ జపం మరింత అధికం అయ్యింది. దీంతో ఆ బాలుడిని రాంభోలా అని పిలిచేవారు.

తులసీదాసు గారు రామ మంత్ర జపం చేస్తూ అలా పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఆ క్రమంలోనే ఆయనకు వివాహం జరిగింది. అది ఆయన జీవితాన్నిమలుపు తిప్పే మరొక సంఘటన. భార్య మాటలతో తులసీదాసు గారు వారణాసి వెళ్లిపోయి అక్కడ రామ నామమంత్రం జపం చేస్తూ గొప్ప ఉపాసకుడు అయ్యాడు.  వారణాసిలో భైరవనాధుడు అనే ఒక తాంత్రిడుకి తులసీదాసు అంటే గిట్టేది కాదు.. ఏదో ఒకలా తులసీదాసును బాధపెట్టాలి అనుకునేవాడు. అయితే ప్రతి సారి తులసీ దాసు గారు ఆ శ్రీరాముడికి మరింత దగ్గరయ్యే వాడు. ఒకసారి ఆ తాంత్రికుడు తులసీదాసు గారెకి మంత్ర శక్తితో చేతులు రెండూ కట్టడి చేశాడు,  అలాగే ఒళ్లంతా బొబ్బలు వచ్చేసాయి. 40రోజులు వాటితో బాధపడి చివరకు 44దోహాలతో హనుమంతుడిని ప్రార్థించాడు. అదే హనుమాన్ బాహుక్.. ఏదైనా చేతబడి లేదా ప్రయోగం ఎవరిమీద అయినా జరిగింది అనే సందేహం వచ్చినప్పుడు హనుమాన్ బాహుక్ పారాయణ చేస్తే అందులో నుండి బయట పడతారు.

తులసీదాసు గారి నుండి లభించిన మరొక అద్బుత రచన రామచరిత మానసము. 1575లో శ్రీరామ నవమి రోజు రామాయణం రాయడం మొదలుపెట్టి రెండు సంవత్సరాల కాలంలో 10వేల దోహాలతో రాశారు. అదే రామచరిత మానసము.  ఆయన రామాయణం కీర్తన చేస్తున్నంత సేపు ప్రజలతోపాటు హనుమంతుడు కూడా ఒక వృద్ధుడి రూపంలో వచ్చి కూర్చుని రామాయణం వినేవాడట. అందుకే ఇప్పుడు కూడా రామ జపం లేదా రామాయణ పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అంటారు.  

చివరికి ఆ శ్రీరామ చంద్ర ప్రభువు అనుగ్రహం పొంది తరించిన వాడు తులసీదాసు.. సాక్షాత్తూ ఆ వాల్మీకి మహర్షి మరొక అవతారమే తులసీదాసు అని చెబుతారు. ఆయన జయంతి నాడు ఆయన్ను తలచుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా. జై శ్రీరామ్..!

                              *రూపశ్రీ.