Tiruppavai Magazine Part - 6 (చక్రవర్తుల రంగనాథ్)

 

 

తిరుప్పావై ఆరవరోజు పాశురం

 



పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు
కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
వెళ్లత్తరవిల్ తుయి లమర్ న్దవిత్తినై
ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్


భావం: అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్ము! రమ్ము! మాతో గూడి వ్రతము చేయుము.

    అవతారిక :

ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గోనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు. ఇక 6  నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ  జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున యీ పది పాశురాలలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీఅనుభావాన్ని  మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూవులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపి కనులేపుతోందీ పాశురంలో.

        (అఠాణారాగము - ఆదితాళము)


ప.    చూడవె! సఖియరో! ఓ చిన్నదాన!
    పడక వీడవె! పక్షులెగిరే కనవే!
    చూడవే! సఖియరొ!

అ.ప.    గడి వెడలిన గుడి శంఖ నాదములు
    వడి బిలువగ వినలేదే! లేవవె! చూడవె! సఖియరొ!
1 చ.    స్తన విషమును, పూతన, శకటాదుల
    ప్రాణమ్ముల నవలీల హరించిన
    పన్నగ శయసుని జగన్నాధుని
    మనసున నిలిపి ధ్యానింపరాగదే!
    చూడవె! సఖియరో

2. చ.    మునులు యోగులును మెల్లనె లేచి
    ధ్యానమగ్నులై 'హరి హరి' యన - నది
    ఘనరవమై మా మనసులను జేరి
    తనువు పులకింప నిదుర లేపినది
    చూడవె! సఖియరో!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్