భగవంతుడు భక్తులలో చూసేది ఏమిటో స్పష్ఠం చేసే ఆళ్వార్ కథ..!

 

భగవంతుడు భక్తులలో చూసేది ఏమిటో స్పష్ఠం చేసే ఆళ్వార్ కథ..!


ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులు.  అంతేకానీ అందరూ బ్రాహ్మణులు  అని,  పండితులుగా ఉండి ఆళ్వార్లుగా మారారు అని కాదు. ధనుర్మాసంలో ఎంతో భక్తి పారవశ్యంతో ఆళ్వార్లు రచించిన పాశురాలు వినడం, ఆలపించడం  చేస్తుంటారు. అలాంటి ఆళ్వార్లులో తొమ్మిదవ ఆయన తిరుప్పాణాళ్వార్. ధనుర్మాసంలోనే కాదు.. పూర్తీ మానవ జీవితంలో చేయవలసినవి, చేయకూడనివి ఏంటి అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి బోధపడతాయి తిరుప్పాణాళ్వార్ జీవితం గురించి తెలుసుకుంటే.. మానవునికి భక్తి ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తుందో అర్థం అవుతుంది. తిరుప్పాణాళ్వార్ గురించి తెలుసుకుంటే..

తిరుప్పాణాల్వార్ 12మంది ఆళ్వారులలో 9వ వ్యక్తి.  ఆయన శూద్ర కులస్తుడు.  ఈయన జననం చాలా విచిత్రంగా జరిగింది. ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శరీరం మీద ఉండే పచ్చబొట్టు అయిన శ్రీవత్స అనే అంశతో జన్మించాడు. ఒక మాల దాసరి కుటుంబానికి పంట పొలంలో ధాన్యపు రాశి మీద కనిపించాడు.  దాంతో ఆ మాల దాసరి కుటుంబానికి చెందిన వారు ఆయనను ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నారు. మాల దాసరి కులాన్ని పాణరుడు అని అంటారు.  ఆ కులంలోనే పెరగడంతో ఆయన్ను పాణుడు అని పిలిచేవారు. అయితే ఆయన కుడా కులం కారణంగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కున్నాడు.  అస్పృశ్యుడు అని,  శూద్ర కులస్తుడు అని కారణంగా ఆయనను శ్రీరంగం ఆలయంలోకి రానిచ్చేవారు కాదు.

తిరుప్పాణాళ్వార్ గారు మాత్రం ప్రతి రోజూ కావేరి నదిలో స్నానం చేసి తంబురా తీసుకుని శ్రీరంగం గోపురం వైపు చూస్తూ గుడికి దూరంగా కూర్చుని చక్కగా స్వామి వారి మీద కీర్తనలు పాడుకునే వారు. స్వామి మీద భక్తి పారవశ్యంతో మునిగి పోయేవారు.

ప్రతి రోజూ శ్రీరంగంలో స్వామి అభిషేకానికి కావేరి నది నుండి నీరు తీసుకెళ్లేవారు అర్చక స్వాములు. అప్పట్లో శ్రీరంగం ఆలయంలో ప్రధాన అర్చకుడిగా లోకసారంగముని అనే ఆయన ఉండేవారు. ఆయన బయటికి వచ్చే సమయానికి అస్పృశ్యులు ఎవరూ ఆయనకు కనిపించకూడదని, ఎదురు పడకూడదని నిబంధనలు ఉండేవి. కానీ ఒకరోజు తిరుప్పాణాళ్వార్ కావేరి నదిలో స్నానం చేసి,  దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుని స్వామి కీర్తనలు పాడుతూ తనని తాను మరచిపోయాడు.  ఇంతలో అర్చక స్వాములు రావడం నదిలో నీరు తీసుకోవడం జరిగింది. అప్పుడే అక్కడున్నఅర్చక స్వాములు తిరుప్పాణాళ్వార్ ను చూసి అక్కడి నుండి పొమ్మని ఎంతగానో పిలిచారు.  భక్తిలో మునిగిపోయిన ఆయనకు వాళ్ల మాటలు వినబడలేదు. ఇక అరిచి అరిచి చివరకు రాళ్లు తీసుకుని ఆయనను కొట్టారు. అలా కొట్టిన తరువాత ఆయన స్పృహలోకి వచ్చి క్షమించండి స్వాములు అని వారికి క్షమాపణ చెప్పి  అక్కడి నుండి వెళ్లిపోయారు.

అర్చక స్వాములు అందరూ శ్రీరంగం గుడిలో గర్బాలయంలోకి వెళ్లగానే స్వామి తల నుండి ధారగా రక్తం కారసాగింది. దాంతో అర్చక స్వామి ఆందోళనతో ఇదేంటి స్వామి వారి తల నుండి రక్తం వస్తుందే అని అన్నారు. అప్పుడు స్వామి వారే స్వయంగా అర్చక స్వాములతో దుర్మార్గులు మీరు.. నా భక్తుడిని అలా ఏడిపిస్తారా? నా భక్తుడిని కొడితే నన్ను కొట్టినట్టే కదా అని అన్నారు. వెంటనే తాము చేసిన తప్పు తెలుసుకుని తిరుప్పాణాళ్వార్ గుడిసె దగ్గరకు వెళ్లి స్వయానా లోకసారంగుడే తిరుప్పాణాళ్వార్ ను తన భుజాల మీద ఎత్తుకుని ఆయన పాదాలను తనకు తాకించుకుంటూ శ్రీరంగం ఆలయానికి తీసుకొచ్చారు.

తిరుప్పాణాళ్వార్ శ్రీరంగం ఆలయంలోకి రాగానే ఆయన స్వామిని చూస్తూ అశువుగా 10 పాశురాలు ఆలపించారు.  ఆ 10 పాశురాలలో ఒక్కొక్క పాశురం ఒక్కో అవయవాన్ని వర్ణిస్తూ పాడుతుంటే ఆయన శరీరంలో ఒక్కొక్క అవయం మాయం అవుతూ స్వామి వారిలో కలిసిపోవడం ప్రారంభించాయట. ఇలా చివరికి కళ్ళను వర్ణించడంతో తిరుప్పాణాళ్వాల్ పూర్తీగా స్వామి వారిలో ఐక్యం అయిపోయారు.  

భగవంతుడు మనిషిని మానవత్వంతో చూడాలని కోరుకుంటాడు.  కులం పేరుతో మనుషులను బాధపెట్టడం,  హింసించడం వంటివి చేస్తే భగవంతుడు సంతోషించడు. అందుకే భగవంతుడి విషయంలో కులాన్ని ఎప్పుడూ అడ్డు పెట్టుకుని ఎవరిని బాధపెట్టకూడదు.

                                *రూపశ్రీ.