Tiruppavai Magazine Part - 7 (చక్రవర్తుల రంగనాథ్)

 

 

తిరుప్పావై ఏడవరోజు పాశురం

 



కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్.


భావం: ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు.

సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.
    అవతారిక :
   
వ్రతాలూ, నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ...భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో
   
        (చక్రవాక రాగము - ఆదితాళము)


    ప.     తేజోముఖీ! తలుపు తీయుమా!
    ఈ జాము నిడురేల! ఇక మేలుకొనవేల?

    అ..ప..    ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద?
    ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో?

1  చ.    పరిమళించు కుంతలాల పడుచులు - ఆ
    భరణములు రవళింప చేతులని సాచి
    పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన! నీవేమి వినలేద?
    వినలేద?

2  చ.    నాయిక! శ్రీమన్నారాయణుడే
    ఈయిల కేశవుడై ప్రభవించగ   
    మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము
    లే! యిక! వినుచు మొద్దునిద్దురపోదువె?

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్