విష్ణుచిత్తుని కథ ఒక్కసారైనా చదవండి.. విష్ణుమూర్తి పరవశించిపోతాడు..!
విష్ణుచిత్తుని కథ ఒక్కసారైనా చదవండి.. విష్ణుమూర్తి పరవశించిపోతాడు..!
ధనుర్మాసంలో ఆళ్వారుల కథలు చెప్పుకోవడానికి మించిన పుణ్యకార్యం మరొకటి ఉండదని పురాణ పండితులు చెబుతారు. విష్ణుమూర్తికి ఈ మాసంలో ఏ సేవలు చేసినా చేయకపోయినా, ఎలాంటి ఆరాధనలు చేయకపోయినా ఆళ్వారుల కథలు చెప్పుకుంటే చాలు.. విష్ణుమూర్తి పరవశించిపోతాడట. తనను ఎంతో గొప్పగా సేవించుకున్న ఆళ్వారులు అంటే ఆ విష్ణుమూర్తికి అంత ప్రీతి. 12మంది ఆళ్వారులలో పెరియాళ్వార్ కూడా ఒకరు. ఈయనే విష్ణుచిత్తుడు. ఈయన గురించి తెలుసుకుంటే భక్తి అంటే ఉంటుందా? నిస్వార్థ భక్తితో సేవిస్తే భగవంతుడు ఇంత కరుణ చూపిస్తాడా అనిపిస్తుంది. అంతటి మహనీయుడు అయిన విష్ణుచిత్తుని గురించి తెలుసుకుంటే..
విష్ణుచిత్తుడు మధురై పక్కన ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం అయిన గరుడుడి అంశతో జన్మించారు. ఈయనకు విష్ణుమూర్తి అంటే వల్లమాలిన అభిమానం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు వేదాధ్యయనం నేర్చుకోమంటే పాఠశాలకు వెళ్లకుండా విష్ణుమూర్తి ముందు కూర్చుని స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన జీవితం అంతా కూడా విష్ణుమూర్తి సేవలోనే గడిచింది. మహావిష్ణువుకు వైకుంఠంలో విసుగు పుడితే నేరుగా తిరుమలకు లేదా శ్రీవిల్లిపుత్తూరుకు వెళతారట. అంతటి మహిమాన్వితమైన ప్రదేశం శ్రీవిల్లిపుత్తూరు. అయితే ఎలాంటి మంత్రాలు ఆయనకు రాకపోవడంతో ఆయన కేవలం పండ్లు, పువ్వులు, ఆకులు స్వామికి సమర్పించుకుంటూ పూజించేవాడు. ఆయన భక్తికి విష్ణుమూర్తి కూడా కరిగిపోయాడు. విష్ణుచిత్తుడు, విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి ఏకాంతంగా, ఎంతో స్నేహంగా మాట్లాడుకునేవారట. అంతటి బందం ఏర్పడిపోయింది ఈ భగవంతుడికి భక్తుడికి మధ్య.
విష్ణుచిత్తుడు ఒకచోట ఒక తోట పెంచేవాడు. ఆ తోటలో తులసి మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచేవాడు. వాటిని మాలగా కట్టి స్వామికి సమర్పించుకునేవాడు. పాదులు తవ్వడం, మొక్కలు నాటడం, పువ్వులు, తులసి దళాలు మాలగా కట్టడం, స్వామికి అర్పించడం.. ఇదే విష్ణుచిత్తుడి దినచర్య. కనీసం పెళ్లి చేసుకోలేదు.. కేవలం ఒంటరిగా ఉంటూ ఇలా స్వామి సేవ చేసుకునేవాడు. ఈ సేవలోనే ముసలివాడు అయిపోయాడు. ప్రజలందరూ ఆయన్ను చూసి అయ్యే ఈనకేంటి ఇంత పిచ్చి పెళ్ళి లేదు, కుటుంబం లేదు, కనీసం ఒక ముక్క కూడా చదువుకోలేదు, ఒక్క రూపాయి కూడా సంపాదించడు.. అని అనుకునేవారు. ఇదంతా చూసిన విష్ణుమూర్తికి విష్ణుచిత్తుని భక్తి ఎంతటిదో తెలియజేయాలని ఒక లీలను సృష్టించాడు.
మధురకు వల్లభదేవ అనే రాజు ఉండేవాడు. ఆయన రాత్రి సమయంలో రాజ్య పర్యటనకు వెళ్లాడు. ప్రజలు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆయన కోరిక. అలా వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొన్నాడు. పక్కనే ఒక వ్యక్తి భగవంతుడి గురించి స్మరించుకుంటు ఒక పద్యాన్ని చదివాడు. ఆ పద్యం అర్థం.. ప్రజలు వృద్దాప్యంలో కష్టపడకూడదని వయసులో ఉండగానే పొదుపు చేసి డబ్బు దాచుకుంటారు, కానీ చనిపోయాక వెళ్లే ప్రపంచంలో సంతోషంగా ఉండాలంటే ఈ జన్మలోనే ముక్తి పొందాలి. ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోరు అని అంటున్నారు అతను. ఈ విషయం వినగానే రాజు ఆలోచనలో పడ్డాడు. మోక్షం కలగాలంటే ఏ దేవుడిని పూజించాలి అని అందరినీ అడిగాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు. మోక్షం కలగాలంటే ఏ దేవుడిని పూజించాలి? ఏ మంత్రం చదవాలి? ఒకవేళ వారు చెప్పింది నిజమైతే ఇదిగో ఈ కర్రకు వేలాడదీసిన మూటలో లక్ష బంగారు నాణేలు ఉన్నాయి. అవన్నీ వారి పాదాల ముందు రాలిపడతాయి అని ప్రకటించాడు.
లక్ష బంగారు నాణేల కోసం ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా విజయం సాధించలేదు. దీంతో విష్ణుమూర్తి స్వయానా విష్ణుచిత్తుడితో నువ్వు వెళ్లి ఆ ధనం సంపాదించుకుని రా అని అన్నాడు. స్వామి నాకు నీ సేవ చాలు.. ఆ ధనం, బంగారం నాకెందుకు అన్నాడు. పైగా నాకు చదువు రాదు, వేదం రాదు, మంత్రాలు రావు, నేను అక్కడికి వెళ్లి ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను అని అన్నాడు. కానీ విష్ణుమూర్తి తన శంఖాన్ని విష్ణుచిత్తుడి నోటికి ఆనించి పంపించాడు. విష్ణుచిత్తుడి అక్కడికి వెళ్ళి నోరు తెరవగానే ఆయన నోటి వెంట వేదాలు, ఉపనిషత్తుల గురించి ప్రవాహంలా వచ్చేస్తాయి. అందరితో చర్చలు చేస్తాడు, అందరికీ సమాధానాలు ఇస్తాడు. చివరకి విష్ణుమూర్తి పాదాలు పట్టుకున్న వాడికి ముక్తి లభిస్తుందని నిరూపిస్తాడు. ఆ తరువాత బంగారు నాణేలు ఉన్న సంచి దానికదే విష్ణుచిత్తుడి పాదాల మీద పడిపోతుంది. కానీ అన్ని బంగారు నాణేలు వచ్చినా ఆయన ఒక్క నాణెం తీసుకోడు.
విష్ణుచిత్తుడు గెలవడంతో రాజు లక్ష బంగారు నాణేల సంచిని, విష్ణుచిత్తుడికి ఇచ్చి ఏనుగుమీద ఊరేగిస్తాడు. అలా ఊరేగుతుంటే.. తన భక్తుడు విజయం సాధించాడని సంబంరంతో విష్ణుమూర్తి స్వయంగా ఆకాశంలో ప్రత్యక్షమై విష్ణుచిత్తుడికి జరుగుతున్న వైభోగాన్ని చూశాడట. అయితే విష్ణుచిత్తుడు మాత్రం.. స్వామి.. నువ్విలా అందరి ముందుకు వస్తే.. నీకు దిష్టి తగులుతుంది అన్నాడట. వెంటనే స్వామికి దిష్టి తగలకుండా తిరుపల్లాండు అనే మంగళశాసనం అనర్గళంగా చెప్పాడట. ఇందులో 12పాశురాలు ఉన్నాయి. ఇదీ ఆయన భక్తి. ఆయనకెప్పుడు విష్ణుమూర్తి గురించే ఆలోచన. ఆయనకు వచ్చిన ధనం అంతా విల్లిపుత్తూరు పక్కన ఉన్న వటపత్రశాయి ఆలయానికి ఇచ్చేశారట. తిరిగి తను పెంచుకునే తులసి తోటకు వెళ్లిపోయారట. దాంతో విష్ణుమూర్తి.. ఎంత భక్తి నాయనా నీకు ధనం ఇస్తే తీసుకోవు, కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు అంటావు ఇక నీకు ఏం ఇవ్వాలి అని ఆలోచించి తనను తాను సమర్పించుకోవాలి అనుకుంటారట. అప్పుడే భూదేవిని విష్ణుచిత్తుడి తోటలో గోదాదేవి కింద పుట్టేలా చేసి ఆమెను ఆ స్వామి వివాహం చేసుకుని విష్ణుచిత్తుడి జీవితాన్ని సార్థకం చేశారు.
ఇదీ నిస్వార్థమైన భక్తికి ఆ భగవంతుడు ఇచ్చే బహుమానం. ఇంతటి భక్తి కలిగిన విష్ణుచిత్తుడి చరిత్ర ఈ ధనుర్మాసంలో వెంటే ఆ విష్ణుమూర్తి పరవశించిపోయి తన భక్తుడిని గుర్తుచేస్తున్నందుకు అందరి మీద అనుగ్రహం చూపిస్తాడట.
*రూపశ్రీ.