Tiruppavai Magazine Part - 15 (చక్రవర్తుల రంగనాథ్)
తిరుప్పావై పదిహేనవ రోజు పాశురము
ఎల్లే ఇళజ్గిళియే ఇన్నముఱజ్గదియో
శిల్లెన్ఱళై యేన్మిన్ నజ్గైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై యున్ కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్
వల్లీర్ కళ్ నీజ్గశే, నానేదానాయిడుగ
ఒల్లై నీపోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్
వల్లానైకోన్ఱానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై ,మాయనైప్పాడేలో రెమ్బావాయ్.
భావం : - ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది - బయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను. బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా! లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే!
బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ!
లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్ధులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా?
బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్కజూడవచ్చు కదా!
లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు?
బయటివారు - కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు' అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్ఠిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.
అవతారిక :-
వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది. ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి.
(కమాసురాగము - ఏకతాళము)
వారు: చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే!
ఆమె: చెలియలార! ఉలికి పడగ పిలువకు డిదె వచ్చుచుంటి.
వారు: పుల్లవిరుపు మాటల నీ చతురోక్తుల నెరుగుదుమే?
ఆమె: అల్లన మీరె చతురలు! నన్నిట్టుల నుండనీరె!
వలసినవారెల్ల రిచట కూడిరి! ఓ చెలియరో!
వారు: చెలులెల్లరు వచ్చిరి నీ వెంచుకోవె! సఖియరో!
ఆమె: ఏల నేను రావలె! మీకేమి నేను చేయవలె?
వారు: బలియుని కువలయకరి మదమణచిన శ్రీకృష్ణుని లీలల
కీర్తింప నీవు శీఘ్రమే రావమ్మరో!
చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే?
శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్