Tiruppavai Magazine Part - 14 (చక్రవర్తుల రంగనాథ్)

 

 

14. పాశురము :

 

 

 

 



ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్.


భావం:- ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె?; ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను లేపిచున్నది.     

    అవతారిక :-

 

 

 

 



ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు. 

        ( లలితరాగము - ఏకతాళము)


    ప..    ముందుంగ లేపుదు నంటివి ముచ్చటలెన్నో చెప్పితి
    వెందుబోయె నోటిమాట! సిగ్గు నీకు లేకపోయె!

1  చ..    పెరటి దిగుడు బావిలోని ఎర్రని కలువలు నవ్వెను!
    పరికించవె సఖి! ఆ నీలోత్పలములు ముకుళించెను!
    తిరు కోవెల 'కుచ్చికోల' తెరువగ నదె తపోధనులు
    వర కాషాయాంబరులౌ శుభ్రదంతు లేగ గనవె!

2  చ..    శంఖ చక్రములు గల్గిన శ్రీహస్తుని హరిని
    పంకేరుహ నేత్రుని - శ్రీ కృష్ణుని సర్వేశుని
    పంకజలోచనీ! పాడుమో మంజుల భాషిణీ'
    ఇంకనైన లేవవె! నీ నిద్దుర చాలించవె!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్