ఆత్మానందం ఎలా కలుగుతుంది?
ఆత్మానందం ఎలా కలుగుతుంది?
మనం సాధారణంగా బయట వస్తువులనుండి, బంధుమిత్రులనుండి, సంతోషాన్ని ఆనందాన్ని పొందుతుంటాము. అలా కాకుండా, మరొక ఆనందం ఉంది. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి వెనక్కులాగి ఆత్మయందు నిలిపి దాని వలన ఆనందాన్ని పొందడం. దీనినే ఆత్మానందము అంటారు. మనలో మనమే ఆనందించాలి. దానికి బయట వస్తువులు కారణం కాకూడదు. బయట వస్తువులను అనుభవించడం వలన కలిగే ఆనందం నిజమైన ఆనందం కాదు. ఏ కారణం లేకుండా తనలో తాను ఆనందించడమే నిజమైన ఆనందం.
ఈ విషయాన్నే ఒక యోగిని అడిగారనుకోండి. స్వామీజీ మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటారు. అంటే అతని సహజ లక్షణం సంతోషంగా ఉండటం, మన సంతోషం ఒక వస్తువు లభించడం వలన కలిగితే, ఆ వస్తువు పోయినపుడు ఆ సంతోషం కూడా పోతుంది. మన ఆనందం దేని మీదా ఆధారపడకుండా సహజంగా కలిగితే ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే ఇందులో రహస్యం. కాబట్టి స్థితప్రజ్ఞుడి మొదటి లక్షణం నిరంతర సంతోషం, ఆత్మానందం కలిగి ఉండటం. ఎందుకంటే ఆనందం ఆయన సహజలక్షణం కాబట్టి.
సర్వ కామ త్యాగం అంటే సకలమైన కోరికలను వదిలిపెట్టడం. ఇది ఎలా సాధ్యం అని కొందరు అంటారు, అసలు సాధ్యం కాదు కాని మరికొందరు అంటారు. అవును అది సాధ్యం కాదు అని మనకు తెలుసు. కాబట్టి స్తితప్రజ్ఞత మనకు కాదు అని మొదట్లోనే మనం ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి దాన్ని ఇక నిర్లక్ష్యంగా మనకు కాదు అని వదిలేస్తాము. కానీ అలా అని అనుకోకూడదు. త్యజించడం అంటే పూర్తిగా వదలడం కాదు. కోరికల మీద ఆధార పడి మన ఆనందం ఉండకూడదు. కోరికలు తీరినా తీరకపోయినా మనం ఆనందంగా ఉండాలి. కోరికలు మన ఆనందానికి మూలకారణం కాకూడదు అని భావము. కోరిక అంటే మనదగ్గర లేని వస్తువు మనకు కావాలి అనే భావన. అంటే ఆ వస్తువు నా వద్ద లేకపోతేనే కదా నేను ఆ వస్తువు కావాలి అని కోరుకునేది. అంటే నేను పూర్ణుడిని కాదు అని అర్ధం. ఆ పూర్ణత్వం కొరకు ప్రతివాడూ ప్రయత్నించాలి.
పూర్ణత్వం అంటే ఏమీలేదు. ఉన్నదానితో తృప్తి చెందడం. లేని దాని కొరకు ఆరాటపడకపోవడం, అటువంటి పూర్ణత్వం సిద్ధిస్తే ఇంక కావాల్సింది ఏమీ ఉండదు అప్పుడు కోరికలు అనేవి ఉండవు. ఒక వేళ కోరికలు మనసులో మెదిలినా, అవి తీరినా తీరకపోయినా అతడు చింతించడు. నిరంతరం ఆనందంలో ఉంటాడు. మనసులో ఉన్న కోరికలను జయించినవాడు అంటే కోరికలను అణగదొక్కమని కాదు. జయించడం అంటే అణగదొక్కడం కాదు. జయించడం అంటే వదిలిపెట్టడం. వాటి గురించి ఆలోచించకపోవడం. పట్టించుకోకపోవడం, వాటి మీద ఆసక్తి లేకపోవడం. అంతేకానీ కోర్కెలను జయించడం అంటే వాటిని అణిచిపెట్టడం అని అనుకుంటారు అందరూ. అది పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగేది.
◆వెంకటేష్ పువ్వాడ.