ఈ ప్రపంచం పిరికివాడు అని ఎవరిని అంటుందో తెలుసా?
ఈ ప్రపంచం పిరికివాడు అని ఎవరిని అంటుందో తెలుసా?
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేయనని పిరికివాడైపోయి ఏవేవో కారణాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు
"అర్జునా!! నీకు ఎలా అవమానం జరుగుతుందో చెబుతాను. నీవు ఇప్పుడు యుద్ధం చేయను అని ఎందుకు అనుకుంటున్నావు. నీకు భీష్ముని మీద ఉన్న ప్రేమ, గౌరవం. ద్రోణుడిమీద కృపుడి మీద ఉన్న గురుభక్తి, నీ బంధువుల మీద మిత్రుల మీద ఉన్న ప్రేమ, అభిమానము. సైనికుల మీద ఉన్న జాలి, వర్ణసంకరం అవుతుందేమో అన్న భయం. వీటి వలన నీవు యుద్ధం చేయను అని అంటున్నావు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఈ కారణాల వల్ల యుద్ధం చేయడం లేదు అని ఎంతమందికి చెబుతావు. లోకులందరికీ చెప్పలేవు కదా! ప్రతివాడినీ పిలిచి నేను ఈ కారణం చేత యుద్ధం చేయడం లేదు. నాకు భయం లేదు. నేను పిరికి వాడిని కాదు. భయంతో పిరికి తనంతో పారిపోలేదు అని అందరికీ చెప్పలేవు కదా!
ఒక వేళ నీవు నీ బంధు మిత్రుల మీద ప్రేమతో పారిపోయినా జనం అలా అనుకోరు. నీ గురించి, చెడ్డగానే అనుకుంటారు. అర్జునుడు భయంతో పిరికితనంతో పారిపోయాడు అని అనుకుంటారు. ఇది నిజం కాకపోవచ్చు కాని జనం అదే నిజం అని నమ్ముతారు. నాది భయం కాదు, పిరికితనం కాదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినరు. ఎందుకంటే నీవు యుద్ధం చేయడంలేదనే విషయం మాత్రమే వాళ్లకు తెలుసు కానీ మిగిలినవిషయాలు వాళ్లకు తెలియవు. ఇంద్రుడి అర్థ సింహాసనం అధిష్టించిన వాడివి ఇటువంటి అప్రతిష్టను ఎలా సహించగలవో ఆలోచించు.
అర్జునా! లోకుల సంగతి కూడా కొంచెం ఆలోచించు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన అతి రథులు మహా రథులు అందరూ నీవు భయంతో పారిపోయావు అనుకుంటారు. కానీ నీలో మెదిలే భావాలు ఎవరూ అర్థం చేసుకోరు. అంతెందుకు ఎవరు అన్నా అనకపోయినా కర్ణుడు మాత్రం ఊరుకోడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాడు నీ పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేస్తాడు. కర్ణుడే కాదు కర్ణుడులాంటి వాళ్లు, ఎదుటి వాళ్ల ఉన్నతిని సహించలేని వాళ్లు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లందరూ నీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారు. వాళ్లే కాదు నీ బంధు మిత్రులు కూడా, నీ మీద అత్యంత గౌరవం కలిగినవాళ్లు కూడా, నీ పేరు ప్రఖ్యాతులమీద నమ్మకలిగిన వాళ్లు కూడా, నీవు యుద్ధం చేయకపోవడం చూచి, పర్వతము మాదిరి ఉన్న నీ గొప్ప తనాన్ని అణుమాత్రం చేసేస్తారు. అంటే నిన్ను చులకన చేసి మాట్లాడతారు.
ఇంకా కొంతమంది ఔత్సాహికులు ఒక అడుగు ముందుకు వేసి "అర్జునుడు నన్ను చూడగానే పారిపోయాడు" అని కల్పించి ప్రచారం చేస్తారు. ఇంకొకడు “నేను అలా బాణం వేసానో లేదో అర్జునుడు ఇలా పారిపోయాడు" అని అంటాడు. నోటికొచ్చినట్టు అంటారు. కాబట్టి యుద్ధం చేస్తావో లేక పారిపోయి లోకుల దృష్టిలో అప్రదిష్టపాలవుతావో నీ ఇష్టం. ఆలోచించుకో! అని అన్నాడు కృష్ణుడు.
సరిగ్గా ఇదే విషయం అందరికీ వర్తిస్తుంది. ఏదైనా పని చేయడానికి అర్హత కలిగిన వాడు దాన్ని బాధ్యత అనుకుని తప్పకుండా పని చేయాలి. లేకపోతే ప్రపంచమంతా వ్యతిరేకంగా హేళన చేసి మాట్లాడుతుంది. బాధ్యత నుండి తప్పించుకునేవాడు పిరికివాడు అని పిలవబడతాడు. అదే కృష్ణుడు అర్జునుడి విషయంలో స్పష్టం చేశాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.