Read more!

జ్ఞానోదయం కలిగించే బ్రహ్మచారి కథ!

 

జ్ఞానోదయం కలిగించే బ్రహ్మచారి కథ!

ఒక ఆశ్రమంలో ఇద్దరు ఋషి కుమారులు ఉండేవారు. వారి పేర్లు శౌనకుడు, అభిప్రతారి. వారు వాయుదేవుణ్ణి పూజించేవారు. ఒకరోజు మధ్యాహ్నం వారు భోజనం చేయబోయే ముందు ఎవరో వాకిలి బయట నిలబడి ఆహారం కావాలని భిక్ష అడగడం వినిపించింది. వారు మారు ఆలోచించకుండా అతణ్ణి పొమ్మన్నారు.

నిజానికి అలా ఆహారం కావాలని కోరింది ఒక బ్రహ్మచారి. అతడికి చిన్నవయసులోనే బ్రహ్మజ్ఞానం అబ్బింది. ఈ విధంగా పొమ్మని చెప్పించుకోవడం అతనికేమీ కొత్త కాదు. కానీ వారు ఋషి కుమారులై ఉండీ అలా అనడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వారికి ఒక గుణపాఠం నేర్పాలని అతడు అనుకున్నాడు. అందువలన "మీరు ఏ దేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు?" అని ఆ ఋషిపుత్రులను అడిగాడు. "మేము వాయుదేవుణ్ణి ఉపాసిస్తాము. ఆయనకు మరో పేరు ప్రాణం!"

అని వారు గర్వంగా సమాధానం చెప్పారు. అప్పుడు బ్రహ్మచారి ఇలా వివరించడం. మొదలుపెట్టాడు. "ఓ మహర్షులారా! ఈ ప్రపంచం యావత్తూ ప్రాణం వలనే రూపు దాల్చిందనీ, తిరిగి ప్రాణంలోనే లయం అవుతుందనీ మీకు తెలుసనుకుంటాను. కాబట్టి ఈ చరాచర సృష్టి అంతా ప్రాణస్వరూపమని మీరు ఒప్పుకుంటున్నారు! అవునా?”

"అవును. మాకు ఈ విషయం తెలుసు. ఈ విశ్వమంతా ప్రాణంతో నిండివుందని భేషుగ్గా తెలుసు. మాకు తెలిసిన విషయాన్నే నీవు మళ్ళీ చెపుతున్నావే!" అని వారు అసహనంగా జవాబిచ్చారు. “మరి మీరు ఇప్పుడు వండిన భోజనాన్ని ముందుగా ఎవరికి నివేదించి స్వీకరిస్తారు?" అని ప్రశ్నించాడు. "మేము ఆరాధించే వాయుదేవుడికే నివేదిస్తాము" అని వారు బదులు పలికారు.

అది విని ఆ బ్రహ్మచారి, “ఈ విశ్వం అంతా ప్రాణంతో నిండివుందని ఇంతకు పూర్వమే మీరు ఒప్పుకున్నారు. ఆ ప్రాణం కోసమే మీరు నైవేద్యాన్ని తయారుచేశారు. నాలో ప్రాణం ఉంది కాబట్టి, ఈ విశ్వంలో నేను కూడా ఒక భాగమే. ఈ ఆకలితో ఉన్న బ్రహ్మచారి రూపంలో కూడా ఆ ప్రాణమే మిమ్మల్ని భిక్ష అడుగుతోంది కదా!” అన్నాడు. ఋషి పుత్రులు, "ఈ వివరణ చాలా బాగుంది. నీవు చెప్పింది ముమ్మాటికీ.

సత్యం!" అని మెచ్చుకున్నారు. “మరి నాకు భిక్ష ఇవ్వకుండా పొమ్మనడమంటే,

నాలోని ప్రాణాన్ని, అంటే వాయుదేవుణ్ణి పొమ్మనడమేగా!" అని ఆ బ్రహ్మచారి

ఎత్తిపొడిచాడు. ఆ ఋషిపుత్రులకు జ్ఞానోదయమయింది. సాదరంగా ఆ బ్రహ్మచారిని లోనికి ఆహ్వానించి అతనితో నైవేద్యాన్ని పంచుకున్నారు.

ఈ సృష్టి అంతా భగవంతునితో నిండివుంది. మనం ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుని మసలుకోవాలి. తోటివారికి సహాయపడడం ద్వారా మనం ఆ పరబ్రహ్మానికే సేవ చేస్తున్నాము. అంతేకాక తోటివారికి సేవ చేయడం ద్వారా మనకు మనమే సేవ చేసుకుంటున్నాము ఇదీ ఈ కథ చెప్పే నీతి.

                                    ◆నిశ్శబ్ద.