పుష్పక విమానంలో రాముడు సీతమ్మకు చెప్పిన విషయాలు ఏంటి?

 

పుష్పక విమానంలో రాముడు సీతమ్మకు చెప్పిన విషయాలు ఏంటి?

రాముడు విభీషణుడితో ఏదైనా ప్రయాణ సాధనం ఉందా?? అని అడిగేసరికి  విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత అందులో ఉన్న వానరులతో "మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను" అని చెప్పి పుష్పకవిమానం దిగేస్తుండగా   అక్కడున్న వాళ్ళందరూ "మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది రామ" అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ "సీత చూశావా, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచిస్తూ కూచున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు" అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి "రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార. రుమ చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము" అన్నాడు.

రాముడు సరేనని ఒప్పుకోవడంతో  అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి "రండి. రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి" అని చెప్పింది. 

అప్పుడు అక్కడున్న ఆడ వానరాలు అన్నీ  మానవ కాంతలలాగా  కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి "సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?" అని అడిగారు.

"ఆవిడే సీతమ్మ" అని చూపిస్తే, అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.

మళ్ళి రాముడు సీతతో "సీత। అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు" అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

ఇంకా కొంత ముందుకి వెళ్ళాక అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము" అన్నాడు. ఇలా రాముడు పుష్పకవిమానంలో ప్రయాణం చేస్తున్నంత సేపు సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు.

                                           ◆నిశ్శబ్ద.