భరతుడి మీద రాముడికున్న ప్రేమ ఎలాంటిది?

 

భరతుడి మీద రాముడికున్న ప్రేమ ఎలాంటిది?

దశరథుడు ఎన్నో విషయాలు చెప్పిన తరువాత తిరిగి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిపోయిన తరువాత అక్కడ ఉన్న దేవేంద్రుడు రాముడితో  "రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని నువ్వు ఇప్పుడు  ఏదన్నా ఒక వరం కోరుకో" అన్నాడు.

ఇంద్రుడు అలా అడగగానే రాముడు ఇంద్రుడితో "నాకోసమని తమ  కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు ఎన్నో యోజనాలు దాటి మరీ యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి. మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి పాదములు తెగిపోయాయి. కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ లోకానికి వెళ్ళిపోయాయి. మీకు నిజంగా నా విషయంలో  ప్రీతి చెందినవారు అయితే, యమ లోకానికి వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో పాదములు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి. వారు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి. నేను అడిగినట్టుగా వరం ఇవ్వండి" అని అన్నాడు.

ఇంద్రుడు రాముడితో "తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను" అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు. యమ లోకానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు.

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి "నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుండి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కాబట్టి తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా" అని అడిగాడు.

విభీషణుడు రాముడితో  "రామా!! మన దగ్గర పుష్పక విమానం ఉంది. ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను ధరించి, నా దగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను చాలా సంతోష పడతాను" అని అన్నాడు.

అప్పుడు రాముడు విభీషణుడితో "విభీషణా!! నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా??  భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోనా??. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోనా?? నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది" అని అన్నాడు రాముడు.

ఇలా భరతుడి మీద తనకున్న ప్రేమను  బయటపెట్టాడు రాముడు.

                                       ◆నిశ్శబ్ద.