మండోదరి మాటల్లో నిజం!
మండోదరి మాటల్లో నిజం!
రావణాసుడు చనిపోయిన తరువాత అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని "ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు, నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను. కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా" అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.
రాముడిని చూడగానే "ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు, దేవతలందరినీ వానర రూపాలు ధరింపచేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు?? రావణా! నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకము అనుకుంటుంది. నువ్వు ఎందువలన చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.
ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ మీద కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. అయ్యో! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వలన సువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వలన కాంచన లంకని అనుభవించావు. ఎన్నో సుఖాలు పొందావు. కాని సీతమ్మని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం వలన ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.
రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా, నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వలన 10 రోజులలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది" అని బాధపడింది.
◆నిశ్శబ్ద.