శకటాసురుడు ఎవరు.. అతని గత జన్మ ఏమిటి!

 

శకటాసురుడు ఎవరు.. అతని గత జన్మ ఏమిటి?

గోకులంలో బాలకృష్ణుడి అల్లరి ఎక్కువైంది. ఒదిగలబడటం కూడా నేర్చు కున్నాడు. నంద యశోదలు అమితానందంతో వ్రేపల్లె అంతటా వేడుకలు చేశారు. బీదలకు, దీనులకు దానధర్మాలు చేశారు. చిన్నకృష్ణుడ్ని అందరూ ముద్దాడి ఆశీర్వదించారు.

గోకులమంతా సంతోషంలో మునిగి తేలుతోంది. ఆ సమయంలో కంసుడి అనుచరవర్గానికి చెందిన శకటాసురుడు అనే రాక్షసుడు సంచారం చేస్తూ వ్రేపల్లె వచ్చాడు. అతను నందుని ఇంట్లోవున్న కన్నయ్య  గురించి చిత్ర విచిత్రాలు విన్నాడు. కృష్ణుడ్ని చూడాలనే ఉత్సుకత కలిగిందతనికి. పూతనను సంహరించిన వాడు అతనే అయివుంటాడనీ, కంసుడు భయపడుతున్నది కూడా ఈ బాలకృష్ణుడ్ని గురించే అయివుండవచ్చుననీ ఆ రాక్షసుడు ఊహించాడు. వెంటనే నందుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిముంగిట రెండెడ్లబండి కాడి వాల్చి వుంది. బండినిండా మధురపదార్థాలు, పళ్ళు, పాలు, వెన్న, మీగడ, పెరుగు రకరకాల పాత్రల నిండా వున్నాయి. రాక్షసుడికి నోరూరింది. బండిలోకి ప్రవేశించాడు. బండి కాడి లేచింది. బండి పెద్ద శబ్దం చేస్తూ ముందుకు కదిలింది. కృష్ణయ్య పూల ఊయలలోంచి ఇదంతా గమనిస్తూనే వున్నాడు. ఉన్నట్టుండి పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు. పిల్లవాడి ఏడుపు విని గోపికలు కృష్ణయ్య పడుకునివున్న ఉయ్యాల దగ్గరికి పరుగున వచ్చారు. అతన్ని సముదాయించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. బాలకృష్ణుడ్ని ఎత్తుకుని బుజ్జగిస్తూ, కబుర్లు చెబుతూ ఒక గోపకాంత అతనిని బయటకు తీసుకువెళ్ళింది. అక్కడ బండికి ఎద్దులు లేకుండా కాడి లేవడం, అది కదలడం గమనించి ఆమె విస్తుపోయి చూస్తూ నిలబడింది.

బండిని ఆవహించిన శకటాసురుడు కృష్ణయ్యను చూసాడు. వెంటనే కృష్ణయ్య మీదికి ఉరికించాడు బండిని. అది ఒక్క వుదుటున వచ్చి కన్నయ్యను తాకింది. చిరునవ్వు చిందిస్తూ నందకిశోరుడు వామ పాదంతో బండిని ఒక తాపు తన్నాడు. ఆ తాకిడికి శకటం తలకిందులైంది. ఇరుసూ, చక్రాలూ ఫెళ ఫెళ విరిగిపోయాయి. పాత్రలు భళ్ళున పగిలి పాలు పెరుగు, నెయ్యి నేలపాలయ్యాయి. బండి ముక్కలైంది.

అంతవరకూ ఆ బండిని ఆవహించివున్న రాక్షసుడు అంతెత్తుకు ఎగిరి దభీమని కిందపడ్డాడు. ఆ పాటువల్ల అతని శరీరం తునాతునకలైంది. పెద్దగా అరుస్తూ ప్రాణం వదిలాడు. ఆ అరుపుకు లోపలినుంచి యశోదానందులు, రోహిణి పరుగుపరుగున వచ్చారు. బయట అంతా యుద్ధరంగంలా వుంది. విరిగిన బండిచక్రాల మధ్య, నేలపాలైన మథురపదార్ధాల మధ్య కృష్ణయ్య ఆడుకుంటున్నాడు. అది చూసి గోపికలు, గోపాలురు నిర్ఘాంతపోయారు. ముసిముసి నవ్వులు నవ్వే చిన్నికృష్ణుణ్ణి గుండెలకు హత్తుకుని యశోద ఆనందాశ్రువులు రాల్చింది.

శ్రీకృష్ణుని చేత ఆ విధంగా సంహరింపబడిన శకటాసురుడు గత జన్మలో హిరణ్యాక్షుని కుమారుడయిన ఉత్కచుడు. అతను ఒకసారి లోమశమహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి, అక్కడి ఉద్యానవనాన్ని ధ్వంసం చేశాడు. అది చూసి లోమశుడు 'ఈ చెట్లను నువ్వు ఎలా పెళ్ళగించావో అలా నీ శరీరంకూడా ముక్కలు ముక్కలవుతుంది" అని శపించాడు.

ఆ మాటలు విన్న ఉత్కచునికి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. మహర్షి పాదాలమీదపడి శాపవిముక్తి కలిగించమని వేడుకున్నాడు. మహర్షి అతనిని కరుణించాడు. ద్వాపర యుగాంతంలో నువ్వు వాయురూపం ధరించి శ్రీహరి పాదఘాతం ద్వారా ముక్తి పొందుతావు' అని లోమశుడు శాపవిముక్తి ప్రసాదించాడు. ఆ విధంగా ఉత్కచుడు రాక్షసుడై జన్మించటం, కంసుడి అనుచరవర్గంలో చేరటం, కృష్ణుడి అనుగ్రహం ద్వారా శాపవిముక్తి పొందటం జరిగింది.

                                     ◆నిశ్శబ్ద.