అశ్వత్థామ తల తెగనరుకుతానని అర్జునుడు నిర్ణయించుకున్నది ఇందుకే!
అశ్వత్థామ తల తెగనరుకుతానని అర్జునుడు నిర్ణయించుకున్నది ఇందుకే!
మహాభారతంలో పాండవులు, కౌరవులు, వారి మధ్య యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. ఇందులో ప్రధానమైనది కురుక్షేత్ర మహాసంగ్రామం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు అశ్వత్థామ తల తెగనరుకుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాని వెనుక జరిగింది ఇదే..
కురుక్షేత్ర యుద్ధభూమిలో యుద్ధం ముగిసిన తరువాత అక్కడ శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదిదేవి, కుంతిదేవి కూడా అక్కడే నిద్రపోతున్నారు. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకు వివిరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. వెంటనే.. చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.
ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. పాండవులు అయిదుగురు, వారి అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపేసిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి 'నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను' అని చెప్పాడు..
ఆ తరువాత తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదిదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు "నేలమీదపడి పొర్లుతూ గుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది! ఏ రచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీ కుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు.
ఇదీ అశ్వత్థామ తల తెగనరకడానికి అర్జునుడు చేసిన ప్రతిన వెనుక కారణం.
◆నిశ్శబ్ద.