భగవద్గీత పార్ట్ - 26

 

అథ అష్టోదశోధ్యాయః - మోక్షసన్న్యాసయోగః

అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్ !
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన !! 1

సంన్యాసస్య - మహాబాహో - తత్త్వం - ఇచ్ఛామి - వేదితుం
త్యాగస్య - చ - హృషీకేశ - పృథక్ - కేశినషూదన


మహాబాహో - గొప్పబాహువులు గలవాడా, హృషీకేశ - కృష్ణా, కేశినిషూదన - కేశియను రాక్షసుని, సంహరించినవాడా, సంన్యాసస్య - సన్యాసము యొక్క, త్యాగస్య చ - త్యాగము యొక్క, తత్త్వం - తత్త్వమును, పృథక్ - వేర్వేరుగ, వేదితుం - తెలిసికొనుటకు, ఇచ్ఛామి - కోరుచున్నాను.

అర్జునుడు పలికెను - కృష్ణా! అంతర్యామీ ! వాసుదేవా ! సన్న్యాసతత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొనగోరుచున్నాను.

శ్రీభగవాన్ ఉవాచ
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః !
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః !! 2

కామ్యానాం - కర్మణాం - న్యాసం - సంన్యాసం - కవయః - విదుః
సర్వకర్మఫలత్యాగం - ప్రాహుః - త్యాగం - విచక్షణా


కవయః - జ్ఞానులు, కామ్యానాం - కామ్యమైన, కర్మణాం - కర్మలయొక్క, న్యాసం - విడచుటను, సంన్యాసం - సన్యాసమని, విదుః - తెలిసికొనియున్నారు. విచక్షణాః - వివేకవంతులు, సర్వకర్మఫలత్యాగం - సకల కర్మల యొక్క ఫలమును త్యజించుటకు, త్యాగం - త్యాగము అని, ప్రాహుః - తెలిపిరి.

శ్రీభగవానుడు పలికెను - కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందఱు పండితులు చెప్పిరి. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మఫలములను త్యజించుటను త్యాగమని అంటారు.

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః !
యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే !! 3

త్యాజ్యం - దోషవత్ - ఇతి - ఏకే - కర్మ - ప్రాహుః - మనీషిణః
యజ్ఞదానతపఃకర్మ - న - త్యాజ్యం - ఇతి - చ - అపరే 


ఏకే - కొందరు, మనీషిణః - వివేకవంతులు, కర్మ - కర్మను, దోషవత్ - దోషమువలెను, త్యాజ్యం ఇతి - విడువదగినదియు, అపరే - మరికొందరు, యజ్ఞదానతపఃకర్మ - యజ్ఞము, దానము,

కొందరు విద్వాంసులు కర్మలన్నియును దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని యందురు. కాని యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు.

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ !
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః !! 4

నిశ్చయం - శృణు - మే - తత్ర - త్యాగే - భరతసత్తమ
త్యాగః - హి - పురుషవ్యాఘ్ర - త్రివిధః - సంప్రకీర్తితః


భరతసత్తమ - అర్జునా, తత్ర - ఆ, త్యాగే - త్యాగ విషయమునందు, మే - నా యొక్క, నిశ్చయం - నిర్ణయమును, శృణు - వినుము, పురుషవ్యాఘ్ర - అర్జునా, త్యాగః - త్యాగము, త్రివిధః - మూడు విధములుగ, సంప్రకీర్తితఃహి - చెప్పబడుచున్నది.

ఓ పురుషశ్రేష్ఠా ! అర్జునా ! సన్న్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమునుగూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని  మూడువిధములుగా ఉన్నాయి.

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ !
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ !! 5

యజ్ఞదానతపఃకర్మ - న - త్యాజ్యం - కార్యం - ఏవ - తత్
యజ్ఞః - దానం - తపః - చ - ఏవ - పావనాని - మనీషిణాం 


యజ్ఞదానతపఃకర్మ - యజ్ఞము, దానము, తపస్సు యనెడి కర్మ, న త్యాజ్యం - విడువదగినదికాదు, తత్ - అది, కార్యం ఏవ - చేయదగినదియే, యజ్ఞః - యజ్ఞము, దానం - దానము, తపః చ ఏవ - తపస్సు, మనీషిణాం - వివేక వంతులకు, పావనాని - పవిత్రతను గలుగజేయును.

యజ్ఞదానతపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి విధిగా ఆచరింపదగినవి. విడువదగినవికావు.

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వాఫలాని చ !
కర్తవ్యానీతిమే పార్థ నిశ్చితం మతముత్తమమ్ !! 6

ఏతాని - అపి - తు - కర్మాణి - సంగం - త్యక్త్వా - ఫలాని - చ
కర్తవ్యాని - ఇతి - మే - పార్థ - నిశ్చితం - మతం - ఉత్తమం 


పార్థ - అర్జునా, ఏతాని - ఈ, కర్మాణి అపి తు - కర్మలను కూడ, సంగం - ఆసక్తిని, ఫలాని చ - ఫలమును, త్యక్త్వా - విడిచి, కర్తవ్యాన్ని ఇతి - చేయదగినపనియని, మే - నాయొక్క, నిశ్చితం - నిర్ణయింపబడిన, ఉత్తమం - ఉత్తమమైన, మతం - అభిప్రాయము.

కావున ఓ పార్థా ! ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటి ఫలాసక్తులను వదలి, అవశ్యమాచరించవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చిత ఉత్తమాభిప్రాయము.

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపద్యతే !
మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః !! 7

నియతస్య - తు - సంన్యాసః - కర్మణః - న  - ఉపపద్యతే
మోహాత్ - తస్య - పరిత్యాగః - తామసః - పరికీర్తితః


నియతస్య తు - విధియుక్తమైన, కర్మణః - కర్మయొక్క, సంన్యాసః - సంన్యాసమున, న ఉపపద్యతే - తగదు, మోహాత్  - మోహమువలన, తస్య, - దానియొక్క, పరిత్యాగః - విడుచుట, తామసః - తమోగుణ సంబంధమైనదియని, పరికీర్తితః - చెప్పబడినది.

శాస్త్రవిహితకర్మలు వదలుట సరిగాదు. కావున మోహవాశమున దానిని త్యజించుట తామస త్యాగము అని చెప్పబడుతోంది.

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ !
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ !! 8

దుఃఖం - ఇతి - ఏవ - యత్ - కర్మ - కాయక్లేశభయాత్ - త్యజేత్
సః - కృత్వా - రాజసం - త్యాగం - న - ఏవ - త్యాగఫలం - లభేత్


కాయక్లేశభయాత్ - శరీరాయాస భీతివలన, దుఃఖం ఇతి ఏవ - శోకదాయకమైనదేయని, యత్ - ఏ, కర్మ - కర్మమును, త్యజేత్ - త్యజించుచున్నాడో, సః - వాడు, రాజసం - రజోగుణసంబంధమైన, త్యాగం - త్యాగమును, కృత్వా - ఆచరించి, త్యాగఫలం - త్యాగఫలమును, న లభేత్ ఏవ - పొందనేపొందడు.

కర్మలన్నియును దుఃఖాన్నిచ్చెవేయని భావించి, శారీరికక్లేశమునకు భయపడి, కర్తవ్యకర్మలనుత్యజించుటను రాజసత్యాగము అని అంటారు. రాజసత్యాగము చేయువాడు త్యాగ ఫలమును పొందలేడు.

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున !
సంగం త్యక్త్వాఫలం చైవ శ త్యాగః సాత్త్వికో మతః !! 9

కార్యం - ఇతి - ఏవ - యత్ - కర్మ - నియతం - క్రియతే - అర్జున
సంగం - త్యక్త్వా - ఫలం - చ - ఏవ - సః - త్యాగః - సాత్త్వికః - మతః 


అర్జున - అర్జునా, నియతం - నియమింపబడిన, యత్ - ఏ, కర్మ - కర్మము, కార్యం ఇతి ఏవ - చేయవలసినదియేయని, సంగం - అభిమానమును, ఫలం ఏవ చ - ఫలమును కూడా, త్యక్త్వా - విడిచి, క్రియతే - ఆచరించబడుచున్నదో, సః - అట్టి, త్యాగః - త్యాగము, సాత్త్వికః - సాత్త్వికమైనదియని, మతః నిర్ణయము.

అర్జునా ! శాస్త్రయుక్తమైన విధులు కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాసక్తులను త్యజించి, చేయుటయే సాత్త్వికత్యాగము అని చెప్పబడినది.

న ద్వేష్ట్యకుశలం కర్మకుశలే నానుషజ్జతే !
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః !! 10

న - ద్వేష్టి - అకుశలం - కర్మ - కుశలే - న - అనుషజ్జతే
త్యాగీ - సత్త్వసమావిష్టః - మేధావీ - ఛిన్నసంశయః 


సత్త్వ సమావిష్టః - సత్త్వగుణ సమేతుడును, మేధావీ - జ్ఞానవంతుడును, ఛిన్న సంశయః - సంశయరహితుడును, త్యాగీ - త్యాగశీలుడు, అకుశలం - శోకమయమైన, కర్మ - కర్మమును, న ద్వేష్టి - ద్వేషింపడు, కుశలే - సుఖమయ కర్మయందు, న అనుషజ్జతే - ఆసక్తి పొందడు.

కర్మలను ద్వేషింపనివాడు, కుశలకర్మలయందు ఆసక్తి చూపడు, శుద్ధసత్త్వగుణయుక్తుడు, సంశయలేనివాడు, బుద్ధిమంతుడు ఐనవాడు నిజమైన త్యాగి.

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః !
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే !! 11

న - హి - దేహభృతా - శక్యం - త్యక్తుం - కర్మాణి - అశేషతః
యః - తు - కర్మఫలత్యాగీ - సః - త్యాగీ - ఇతి - అభిధీయతే


దేహభృతా - దేహాభిమానము గలవానికి,అశేషతః - సంపూర్ణముగ, కర్మాణి - కర్మలను, త్యక్తుం - విడుచుటకు, న శక్యం హి సాధ్యముగాదు, యః తు - ఎవడు, కర్మఫల త్యాగీ - కర్మఫలములను విడుచుచున్నాడో, సః - వాడు, త్యాగీ ఇతి - త్యాగియని, అభిధీయతే - చెప్పబడుచున్నాడు.

ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగ త్యజించుట సాధ్యముకాదు. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడుచున్నాడు.

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ !
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ !! 12

అనిష్టం - ఇష్టం - మిశ్రం - చ - త్రివిధం - కర్మణః - ఫలం
భవతి - అత్యాగినాం - ప్రేత్య - న - తు - సంన్యాసినాం - క్వచిత్


అనిష్టం - ఇష్టము కానిదియు, ఇష్టం - ఇష్టమైనదియు, మిశ్రం చ - మిశ్రమమైనదియు, త్రివిధం - మూడు విధములుగ, కర్మణః - కర్మలయొక్క, ఫలం - ఫలము, అత్యాగినాం - త్యాగులుగాని వారలకు, ప్రేత్య - మరణానంతరము, భవతి - కలుగుచున్నది, సంన్యాసినాం తు - సన్యాసులకు, క్వచిత్ - ఎప్పుడును, న భవతి - కలుగదు.

కర్మఫలత్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రము అని మూడు విరకముల ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించవలసి వుండును. కాని కర్మఫలత్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మలఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగను అనుభవింపవలసిన పని కలుగదు.

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే !
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ !! 13

పంచ - ఏతాని - మహాబాహో - కారణాని - నిబోధ - మే
సాంఖ్యే - కృతాంతే - ప్రోక్తాని - సిద్ధయే - సర్వకర్మణాం


మహాబాహో - అర్జునా, సర్వకర్మణాం - సర్వకర్మలయొక్క, సిద్ధయే - సిద్ధి కొరకు, కృతాంతే - సిద్ధాంతమును తెలుపు, సాంఖ్యే - సాంఖ్యమునందు, ప్రోక్తాని - చెప్పబడిన, ఏతాని - ఈ, పంచ - అయిదు, కారణాని - కారణములను, మే - నావలన, నిబోధ - తెలిసికొనుము.

అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములు గలవని కర్మలను అంతముచేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రము నందు పేర్కొంది. వాటిని నావలన వినుము.

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ !
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! 14

అధిష్ఠానం - తథా - కర్తా - కరణం - చ - పృథగ్విధం
వివిధాః - చ - పృథక్ - చేష్టాః - దైవం - చ - ఏవ - అత్ర - పంచమం


అధిష్ఠానం - దేహమును, తథా - అటులనే, కర్తా - కర్తయును, పృథగ్విధం - వివిధములైన, కరణం చ - ఇంద్రియములను, వివిధాః - నానావిధములైన, పృథక్ - వేర్వేరైన, చేష్టాః చ - క్రియలును, అత్ర - వీనియందు, దైవం చ ఏవ - దైవమును, పంచమం - అయిదవ కారణము.

కర్మల సిద్ధియందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణములు నానావిధ చేష్టలు, దైవము అను ఐదును కారణములు.

శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః !
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! 15

శరీరవ్యాజ్మనోభిః - యత్ - కర్మ - ప్రారభతే - నరః
న్యాయ్యం - వా - విపరీతం - వా - పంచ - ఏతే - తస్య - హేతవః


న్యాయ్యం వా - న్యాయబద్ధముగగాని, విపరీతం వా - అన్యాయముగగాని, శరీర వాజ్మనోభిః - శరీరము, వాక్కు, మనస్సులచేత, యత్ - ఏ, కర్మ - కర్మను, నరః - నరుడు, ప్రారభతే - ప్రారంభించుచున్నాడో, తస్య - ఆ కర్మమునకు, ఏతే - ఈ, పంచ - అయిదును, హేతవః - కారణములు.
మానవుడు మనోవాక్కాయములచే ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన యేకర్మలైనను ఈ యైదు కారణములై యున్నవి.

తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః !
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః !!  16

తత్ర - ఏవం - సతి - కర్తారం - ఆత్మానం - కేవలం - తు - యః
పశ్యతి - అకృత బుద్ధిత్వాత్ - న - సః - పశ్యతి - దుర్మతిః


తత్ర - అందు, ఏవం సతి - ఇలావుండగ, కేవలం - కేవలము, ఆత్మానం తు - ఆత్మనే - కర్తారం - కర్తగను, అకృతబుద్ధిత్వాత్ - అశుద్ధ బుద్ధిగలవాడుగుటచేత, యః - ఎవడు, పశ్యతి - గాంచుచున్నాడో, సః - ఆ, దుర్మతిః - అజ్ఞాని, న పశ్యతి - చూడలేకున్నాడు.

అట్లైనప్పటికిని విపరీతబుద్ధికారణమున ఏ మనుష్యుడు కేవలుడు, శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్తకర్మలకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధిగల అజ్ఞాని సత్యమును తెలుసుకొనలేకున్నాడు.

యస్య నాహంకృతో భావో బుద్ధిరస్య  న లిప్యతే !
హిత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే !! 17

యస్య - న - అహంకృతః - భావః - బుద్ధిః - యస్య - న - లిప్యతే
హత్వా - అపి - సః - ఇమాన్ - లోకాన్ - న - హంతి - నిబధ్యతే


యస్య - ఎవనికి, అహంకృతః - నేనే కర్తయనెడి, భావః - భావము, న - లేదో, యస్య - ఎవనియొక్క, బుద్ధిః - బుద్ధి, న లిప్యతే - అంటదో, సః - వాడు, ఇమాన్ - ఈ, లోకాన్ - ప్రాణులను, హత్వా అపి - వధించినను, న హంతి- చంపినవాడుకాడు. న నిబధ్యతే - బద్ధుడును కాడు.

అంతఃకరణమునందు కర్తృత్వభావము లేనివాని బుద్ధి ప్రాపంచిక విషయములందు, కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతడు ఎట్టి కర్మలచేత బంధింపబడడు.

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా !
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః !! 18

జ్ఞానం - జ్ఞేయం - పరిజ్ఞాతా - త్రివిధా - కర్మచోదనా
కరణం - కర్మ - కర్తా - ఇతి - త్రివిధః - కర్మసంగ్రహః


కర్మచోదనా - కర్మచోదము, జ్ఞానం - జ్ఞానము, జ్ఞేయం - జ్ఞేయము, పరిజ్ఞాతా - గ్రహించువాడు, ఇతి - అని, త్రివిధా - మూడువిధములు, కర్మసంగ్రహః - కర్మ సంగ్రహము, కరణం - సాధనము, కర్మ - కార్యము, కర్తా - చేయువాడును, ఇతి - అని, త్రివిధః - మూడు విధములు.

జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడును కర్మప్రవృత్తికి కారణములు. కర్మప్రేరణములు. కర్త, కర్మ, క్రియ అని కర్మసంగ్రహములు మూడును ఆధారములు.

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః !
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తన్యపి !! 19

జ్ఞానం - కర్మ - చ - కర్తా - చ - త్రిధా - ఏవ - గుణభేదతః
ప్రోచ్యతే - గుణసంఖ్యానే - యథావత్ - శృణు - తాని - అపి


గుణసంఖ్యానే - సాంఖ్యశాస్త్రమునందు, జ్ఞానం - జ్ఞానమును, కర్మ చ - కర్మమును, కర్తా చ - కర్తయును, గునభేదతః - గుణభేదము ననుసరించి, త్రిధా ఏవ ౦ మూడు విధములుగనే, ప్రోచ్యతే - చెప్పబడుచున్నది, తాని అపి - వానిని కూడా, యథావత్ - యథార్థముగ, శృణు - ఆలకింపుము.

గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా చెప్పబడినవి. వానిని గూర్చి వివరించెదను వినుము.

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే !
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ !! 20

సర్వభూతేషు - యేన - ఏకం - భావం - అవ్యయం - ఈక్షతే
అవిభక్తం - విభక్తేషు - తత్ - జ్ఞానం - విద్ధి - సాత్త్వికం


విభక్తేషు - విభక్తములైన, సర్వభూతేషు - సర్వభూతములయందును, అవిభక్తం - విభక్తము గానట్టియు, అవ్యయం - నశించనట్టియు, ఏకం - ఏకమైన, భావం - భావమును, యేన - ఏ జ్ఞానముచేత, ఈక్షతే - గాంచుచున్నాడో, తత్ - ఆ, జ్ఞానం - జ్ఞానము, సాత్త్వికం - సాత్త్వికజ్ఞానమని, విద్ధి - తెలిసికొనుము.

వేర్వేరుగా కన్పించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై యున్నట్లు జ్ఞానియైన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్త్విక జ్ఞానము అని చెప్పబడుతోంది.

పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ !
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ !! 21

పృథక్త్వేన - తు - యత్ - జ్ఞానం - నానాభావాన్ - పృథగ్విధాన్
వేత్తి - సర్వేషు - భూతేషు - తత్ - జ్ఞానం - విద్ధి - రాజసం


సర్వేషు - సమస్తమైన, భూతేషు - భూతములయందు, పృథగ్విధాన్ - వేరు వేరు విధములు గానున్న, నానాభావాన్ - వివిధ భావములు గల వానిని, యత్ - ఏ, జ్ఞానం - జ్ఞానము, పృథక్త్వేన తు - వేర్వేరుగా నుండు వానినిగ, వేత్తి - తెలుసికొనుచున్నాడో, తత్ - ఆ, జ్ఞానం - జ్ఞానమును, రాజసం - రాజస జ్ఞానముగ, విద్ధి - తెలిసికొనుము.
సమస్త ప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను  వేర్వేరుగా భావించువారి జ్ఞానము రాజసము. 

యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ !
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ !! 22

యత్ - తు - కృత్స్నవత్ - ఏకస్మిన్ - కార్యే - సక్తం - అహైతుకం
అతత్త్వార్థవత్ - అల్పం - చ - తత్ - తామసం - ఉదాహృతం


యత్ తు - ఏదైతే, ఏకస్మిన్ - ఏకమైన, కార్యే - కార్యమునందు, కృత్స్నవత్ - సంపూర్ణము నందువలె, సక్తం - ఆసక్తమైనదియు, తత్ - అది, తామసం - తామస జ్ఞానముగ, ఉదాహృతం - చెప్పబడినది.

ప్రకృతికార్యమైన శరీరమునే సమస్తముగా భావించి, దానియందే ఆసక్తిని కల్గించునట్టిదియు, తాత్త్వికముగా అర్థరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును  తామసము అని చెప్పబడుతోంది.

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ !
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే !! 23

నియతం - సంగరహితం - అరాగద్వేషతః - కృతం
అఫలప్రేప్సునా - కర్మ - యత్ - తత్ - సాత్త్వికం - ఉచ్యతే


యత్ - ఏ, కర్మ - కర్మము, సంగరహితం - సంగత్వము లేనిదియు, నియతం - నియమిత మైనదియు, అరాగద్వేషతః - రాగద్వేషములు లేకుండునదియు, అఫల ప్రేప్సునా - ఫలాపేక్ష లేనివానిచేత, కృతం - చేయనదినదో, తత్ - అది, సాత్త్వికం - సాత్త్వికమని, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

కర్తృత్వాభిమానము గాని, ఫలాపేక్షగాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మ సాత్త్వికకర్మ అనబడుతోంది.

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః !
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ !! 24

యత్ - తు - కామేప్సునా - కర్మ - సాహంకారేణ - వా - పునః
క్రియతే - బహులాయాసం - తత్ - రాజసం - ఉదాహృతం


యత్ - ఏ, కర్మ తు - కర్మము, కామేప్సునా - కోరికలుగలవానిచేత, సాహంకారేణ వా పునః - అహంకారము గల వానిచేత గాని, బహులాయాసం - విశేష ప్రయాసతో, క్రియతే - చేయబడుచున్నదో, తత్ - ఆ కర్మము, రాజసం - రాజసకర్మముగ, ఉదాహృతం - చెప్పబడినది.

భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారిచేతను చేయబడు మిక్కిలి ఆయాసంతో కూడిన కర్మ రాజసకర్మ అనబడుతోంది.

అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ !
మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే !! 25

అనుబంధం - క్షయం - హింసాం - అనవేక్ష్య - చ - పౌరుషం
మోహాత్ - ఆరభ్యతే - కర్మ - యత్ - తత్ - తామసం - ఉచ్యతే


అనుబంధం - పరిణామము, క్షయం - హానియను, హింసాం - హింసయును, పౌరుషం చ - సామర్థ్యమును, అనవేక్ష్య - గ్రహించక, మోహాత్ - అవివేకము వలన, యత్ - ఏ, కర్మ - కర్మము, ఆరభ్యతే - ఆరంభింపబడు చున్నదో, తత్ - అది, తామసం - తామస కర్మమని, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

పరిణామము హాని, హింస, సామర్థ్యములను చూచుకోనక కేవలము అజ్ఞానముచే మొదలుపెట్టి కర్మలు తామసకర్మలు అని చెప్పబడుచున్నాయి.

ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహమన్వితః !
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్తిక ఉచ్యతే !! 26

ముక్తసంగః - అనహంవాదీ - ధృత్యుత్సాహ సమన్వితః
సిద్ధ్యసిద్ధ్యోః - నిర్వికారః - కర్తా - సాత్త్వికః - ఉచ్యతే


ముక్తసంగః - సంగత్వము నుండి విడివడినవాడు, అనహంవాదీ - అహంకార రహితుడు, ధృత్యుత్సాహ సమన్వితః - దైర్యముతోను ఉత్సాహముతోను గూడినవాడు, సిద్ధ్యసిద్ధ్యోః - కార్యముసిద్ధించినను సిద్ధించక పోయిననను,నిర్వికారః - వికారము చెందనివాడు నగు, కర్తా - కర్త, సాత్త్వికః - సత్త్వగుణము గలవాడుగ, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా మాట్లాడువాడు, దైర్యోత్సాహములుగల వాడును సిద్ధి అసిద్ధుల యెడ హర్షశోకాదివికారములకు లోనుకానివాడును అగు పురుషుడు సాత్త్వికకర్త యని చెప్పబడుచున్నాడు.