భగవద్గీత పార్ట్ - 28

 

 

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణోమద్వ్యపాశ్రయః !
మత్ర్పసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ !! 56

సర్వకర్మాణి - అపి - సదా - కుర్వాణః - మద్వ్యపాశ్రయః
మత్ర్పసాదాత్ - అవాప్నోతి - శాశ్వతం - పదం - అవ్యయం  


సర్వకర్మాణి - సర్వకర్మలను, సదా - ఎల్లప్పుడును, కుర్వాణః అపి - చేయుచున్న వాడైనను, మద్వ్యపాశ్రయః - నన్నే శరణు పొందినవాడు, మత్ర్పసాదాత్ - నా అనుగ్రహము వలన, అవ్యయం - నాశరహితమైన, శాశ్వతం - శాశ్వతమైన, పదం - పదమును, అవాప్నోతి - పొందుచున్నాడు.

సమస్తకర్మలయందును కర్తృత్వభావమును వదలి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదాచేయుచును నాకృప సనాతనమైన శాశ్వతమైన మోక్షమును పొందుచున్నాడు

చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః !
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ !! 57

చేతసా - సర్వకర్మాణి - మయి - సంన్యస్య - మత్పరః
బుద్ధియోగం - ఉపాశ్రిత్య - మచ్చిత్తః - సతతం - భవ


చేతసా - మనస్సుచేత, సర్వకర్మాణి - సర్వకర్మలను, మయి - నాయందు, సంన్యస్య - ఉంచి, మత్పరః - మత్పరాయణుడై, బుద్ధియోగం - బుద్ధియోగమును, ఉపశ్రిత్య - అవలభించి, సతతం - ఎల్లప్పుడును, మచ్చిత్తః - నాయందు చిత్తము గలవాడవు, భవ - కమ్ము.

సర్వకర్మలను మనసా, వాచా, కర్మణా నాకే అర్పించి, సమబుద్ధి రూపయోగమును అవలభించి, మత్పరాయణుడవై సంతతము చిత్తమును నా యందే గలవాడవు కమ్ము.

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి !
అథ చేత త్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి !! 58

మచ్చిత్తః - సర్వదుర్గాణి - మత్ప్రసాదాత్ - తరిష్యసి
అథ - చేత్ - త్వం - అహంకారాత్ - న - శ్రోష్యసి - వినక్ష్యసి


మచ్చిత్తః - నాయందు చిత్తముగలవాడవై, మత్ర్పసాదాత్ - నా అనుగ్రహమువలన, సర్వదుర్గాణి - సర్వసంకటములను, తరిష్యసి - దాటగలవు, అథ - ఒకవేళ, త్వం - నీవు, ఆహంకారాత్ - అహంకారమువలన, న శ్రోష్యసి చేత్ - వినజాలనిచో, వినక్ష్యసి - నశించిపోయేదవు.

పైన తెలుపుబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో, నా కృపవలన సమస్త కష్టముల నుండియు సునాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో చెడిపోవుదువు.

యదహంకారమాశ్రిత్య న యోత్స్యి ఇతి మన్యసే !
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి !! 59

యత్ - అహంకారం - ఆశ్రిత్య - న - యోత్స్యే - ఇతి - మన్యసే
మిథ్యా - ఏషః - వ్యవసాయః - తే - ప్రకృతిః - త్వాం - నియోక్ష్యతి


యత్ అహంకారం - ఏ అహంకారమును, ఆశ్రిత్య - ఆశ్రయించి, న యోత్స్యే ఇతి - యుద్ధము చేయనని, మన్యసే - తలచుచున్నావో, తే - నీయొక్క, ఏషః - ఈ, వ్యవసాయః - ప్రయత్నము, మిథ్యా - వ్యర్థము, త్వాం - నిన్ను, ప్రకృతిః - స్వభావము, నియోక్ష్యతి -  నియోగింపగలదు.

అహంకారంతో నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించు కొనుట వృథా, నీ స్వభావమే ...

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా !
కర్తుం నెచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ !! 60

స్వభావజేన - కౌంతేయ - నిబద్ధః - స్వేన - కర్మణా
కర్తుం - న - ఇచ్ఛసి - యత్ - మోహాత్ - కరిష్యసి - అవశః - అపి - తత్


కౌంతేయ - అర్జునా, యత్ - దేనిని, కర్తుం - చేయుటకు, మోహాత్ - మోహము వలన, న ఇచ్ఛసి - ఇచ్చగింపవో, తత్ - దానిని, స్వభావజేన - స్వభావసిద్ధమైన, స్వేన - నీదైన, కర్మణా - కర్మచేత, నిబద్ధః - బంధింపబడినవాడవై, అవశః అపి - పరవశుడవై కూడా, కరిష్యసి - చేయుదవు.

ఓ కౌంతేయా ! మోహము వలన నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి, తత్ప్రభావమున నీవు పరవశుడవై చేస్తావు.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి !
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా !! 61

ఈశ్వరః - సర్వభూతానాం - హృద్దేశే - అర్జున - తిష్ఠతి
భ్రామయన్ - సర్వభూతాని - యంత్రరూఢాని - మాయయా


అర్జున - అర్జునా, ఈశ్వరః - ఈశ్వరుడు, యంత్రారూఢాని - యంత్రము నధిష్టించిన వారివలె, సర్వభూతాని - సమస్త ప్రాణులను, మాయయా - మాయాశక్తిచేత, భ్రామయన్ - త్రిప్పుచు, సర్వభూతానాం - సమస్తప్రాణుల యొక్క, హృద్దేశే - హృదయ ప్రదేశమునందు, తిష్ఠతి - ఉన్నాడు.

అర్జునా ! శరీరరూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి, వారి హృదయములలో వెలుగుచున్నాడు.

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత !
తత్ర్పసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ !! 62

తం - ఏవ - శరణం - గచ్ఛ - సర్వభావేన - భారత
తత్ర్పసాదాత్ - పరాం - శాంతిం - స్థానం - ప్రాప్స్యసి - శాశ్వతం


భారత - అర్జునా, సర్వభావేన - సర్వభావములచేత, తం ఏవ - అట్టి పరమేశ్వరునే, శరణం - శరణు, గచ్ఛ - పొందుము, తత్ర్పసాదాత్ - అతని అనుగ్రహము వలన, పరాం - ఉత్తమమైన, శాంతిః - శాంతిని, శాశ్వతం - శాశ్వతమైన, స్థానం - మోక్షమును, ప్రాప్స్యసి - పొందగలవు.

అర్జునా ! అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుకోరుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన మోక్షమును పొందగలవు.

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా !
విమృశ్యైదశేషేణ యథేచ్ఛసి తథా కురు !!  63

ఇతి - తే - జ్ఞానం - ఆఖ్యాతం - గుహ్యాత్ - గుహ్యాతరం - మయా
విమృశ్య - ఏతత్ - అశేషేణ - యథా - ఇచ్ఛసి - కురు


ఇతి - ఇట్లు, గుహ్యాత్ - గుహ్యమైన దానికంటెను, గుహ్యతరం - రహస్యమైన, జ్ఞానం - జ్ఞానము, మయా - నాచేత, తే - నీ కొరకు, ఆఖ్యాతం - చెప్పబడినది, ఏతత్ - దీనిని, అశేషేణ - పూర్తిగ, విమృశ్య - విచారణచేసి, యథా - ఏ విధముగ, ఇచ్ఛసి - అభిలషింతువో, తథా - అలాగున, కురు - చేయుము.

ఈ మాదిరిగా అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు తెలియజేసితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకు తోచినటుల చేయుము.

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః !
ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ !! 64

సర్వగుహ్యతమం - భూయః - శృణు - మే - పరమం - వచః
ఇష్టః - అసి - మే - దృఢం - ఇతి - తతః - వక్ష్యామి - తే - హితం


భూయః - మరల, సర్వగుహ్యతమం - పరమ రహస్యమైనదియు, పరమం - ఉత్తమమైనదియు నగు, మే - నాయొక్క, వచః - వాక్కును, శృణు  - వినుము, మే - నాకు, దృఢం - నిశ్చయముగ, ఇష్టః - ఇష్టుడవు, అసి ఇతి - అయి యున్నావని, తతః - అందువలన, తే - నీ కొరకు, హితం - హితమును, వక్ష్యామి - చెప్పుచున్నాను.

సమస్త గోప్య విషయములయందును పరమ అసహ్యమైన నావచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు అగుటవలన నీ మేలు కోరి చెప్పుచున్నాను.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు !
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే !! 65

మన్మనాః - భవ - మద్భక్తః - మద్యాజీ - మాం - నమస్కురు
మాం - ఏవ - ఏష్యసి - సత్యం - తే - ప్రతిజానే - ప్రియః - అసి - మే


మన్మనాః - నాయందుమనస్సు కలవాడవు, మద్భక్తః - నాయందు భక్తి కలవాడవు, మద్యాజీ - నన్ను అర్పించువాడవు, భవ - కమ్ము, మాం - నన్ను, నమస్కురు - నమస్కరింపుము, మాం ఏవ - నన్నే, ఏష్యసి - పొందగలవు, మే - నాకు, ప్రియః - ఇష్టుడవు, అసి - అయియున్నావు, తే - నీకు, సత్యం - సత్యమును, ప్రతిజానే - ప్రతిజ్ఞచేసి చెబుతున్నాను.

ఓ అర్జునా ! నీవు నాయందే మనస్సునుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. అది ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ !
అహం త్వా సర్వపాపేభ్యోమోక్షయిష్యామి మా శుచః !! 66

సర్వధర్మాణ పరిత్యజ్య - మాం - ఏకం - శరణం - వ్రజ
అహం - త్వా - సర్వపాపేభ్యః - మోక్షయిష్యామి - మా - శుచః


సర్వధర్మాన్ - సమస్తధర్మములను, పరిత్యజ్య - విడిచిపెట్టి, మాం - నన్ను, ఏకం - ఒక్కనినే, శరణం - శరణమును, వ్రజ - పొందుము, అహం - నేను, త్వా - నిన్ను, సర్వపాపేభ్యః - సకలపాపముల నుండి, మోక్షయిష్యామి - విడిపించెదను, మా శుచః - శోకింపకుము.

సర్వధర్మములను అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వధారుడను పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపవలదు.

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన !
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి !! 67

ఇదం - తే - న - అతపస్కాయ - న - అభక్తాయ - కదాచన
న - చ - అశుశ్రూషనే - వాచ్యం - న - చ - మాం - యః - అభ్యసూయతి


తే - నీకొరకు, ఇదం - ఈ బోధ, కదాచన - ఒకప్పుడును, అతపస్కాయ - తపస్విగానివానికి, న వాచ్యం - ఉపదేశింపదగదు, అభక్తాయః - భక్తుడు గాని వానికి, అశుశ్రూషవే చ - శుశ్రూషచేయనివానికి, న వాచ్యం - చెప్పదగదు, యః - ఎవడు, మాం - నన్ను, అభ్యసూయతి చ - ద్వేషించుచున్నాడో, న వాచ్యం - చెప్పగూడదు.

తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, నన్ను ద్వేషించువానికి నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ చెప్పరాదు.

య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి !
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః !! 68

యః - ఇమం - పరమం - గుహ్యం - మద్భక్తేషు - అభిధాస్యతి
భక్తిం - మయి - పరాం - కృత్వా - మాం - ఏవ - ఏష్యతి - అసంశయః  


యః - ఎవడు, పరమం - పరమమైన, గుహ్యం - గుహ్యమైనటువంటి, ఇమం - దీనిని, మద్భక్తేషు - నా భక్తుల యందు, అభిధాస్యతి - చెప్పునో, సః - వాడు, మయి - నాయందు, పరాం - ఉత్తమమైన, భక్తిం - భక్తిని, కృత్వా - చేసి, అసంశయః - సంశయరహితుడై, మాం ఏవ - నన్నే, ఏష్యతి - పొందగలడు.

నా యందు పరమభక్తి కలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల మదిలో పదిలపరచువాడు నన్నే పొందగలడు. ఇందేమాత్రమూ సందేహము లేదు.

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః !
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి !! 69

న - చ - తస్మాత్ - మనుష్యేషు - కశ్చిత్ - మే - ప్రియకృత్తమః
భవితా - న - చ - మే - తస్మాత్ - అన్యః - ప్రియతరః - భువి


మనుష్యేషు - మనుష్యులయందు, తస్మాత్ - వానికంటెను, మే - నాకు, ప్రియకృత్తమః - మిక్కిలి ఇష్టమొనర్చువాడు, కశ్చిత్ - ఒకడును, న చ - లేడు, మే - నాకు, తస్మాత్ - వానికంటె, అన్యః - ఇతరుడు, ప్రియతరః - మిగుల ప్రియమైనవాడు, భువి - భూమి యందు, న చ భవితాః - ఉండబోడు.

మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియొకడు భవిష్యత్తులోను ఉండబోడు.

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః !
జ్ఞానయజ్ఞేన తేనాహమ్ ఇష్టః స్వామితి మే మతిః !! 70

అధ్యేష్యతే - చ - యః - ఇమం - ధర్మ్యం - సంవాదం - ఆవయోః
జ్ఞానయజ్ఞేన - తేన - అహం - ఇష్టః - స్యాం - ఇతి - మే - మతిః


ఆవయోః - మనయొక్క, ధర్మ్యం - ధర్మప్రయోజనమైన, ఇమం - ఈ, సంవాదం - సంవాదమును, యః - ఎవడు, అధ్యేష్యతే చ - చదువబోవుచున్నాడో, తేన - వానిచేత, జ్ఞానయజ్ఞేన - జ్ఞానయజ్ఞము చేతను, అహం - నేను, ఇష్టః - పూజితుడను, స్యాం - అగుదును, ఇతి - అని, మే - నాయొక్క, మతిః - నిశ్చయము.

ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా ఉద్దేశ్యము.

శ్రద్ధా వాననసూయశ్చ శృణుయాదపి యో నరః !
సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ !! 71

శ్రద్ధావాన్ - అనసూయః - చ - శృణుయాత్ - అపి - యః - నరః
సః - అపి -  ముక్తః - శుభాన్ - లోకాన్ - ప్రాప్నుయాత్ - పుణ్యకర్మణాం


యః - ఏ, నరః - నరుడు, శ్రద్ధావాన్ - శ్రద్ధవంతుడును, అనసూయః చ - అసూయ లేనివాడునునై, శృణుయాత్ అపి - ఆలకించునో, సః అపి - వాడును,  ముక్తః -  ముక్తుడై, పుణ్యకర్మణాం - పుణ్యకర్మల యొక్క, శుభాన్ - శుభకరమైన, లోకాన్ - లోకములను, ప్రాప్నుయాత్ - పొందును.

శ్రద్ధాదరములు గలవాడును, దోషదృష్టి లేనివాడును ఐన మనుష్యుడు గీతాజ్ఞానమును వినుటవలన గూడ పాపవిముక్తుడైన, పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమలోకములను పొందుచున్నాడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా !
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ !! 72

కచ్చిత్ - ఏతత్ - శ్రుతం - పార్థ - త్వయా - ఏకాగ్రేణ - చేతసా
కచ్చిత్ - అజ్ఞానసమ్మోహః - ప్రనష్టః - తే - ధనంజయ


పార్థ - అర్జునా, ఏతత్ - ఇది, త్వయా - నీచేత, ఏకాగ్రేణ - నిశ్చలమైన, చేతసా - మనస్సుతో, శ్రుతం కచ్చిత్ - శ్రవణము చేయబడినది గదా, ధనంజయ - అర్జునా, తే - నీ యొక్క, అజ్ఞానసమ్మోహః - అజ్ఞానము వలన కలిగిన మోహము, ప్రనష్టః కచ్చిత్ - పోయినదిగదా.

అర్జునా ! ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతోవింటివా ? ఓ ధనంజయా ! అజ్ఞానజనితమైన నీ  మోహము నశించినదా ?

అర్జున ఉవాచ
నష్టోమోహః స్మృతిర్లబ్ధా త్వత్ర్పసాదాన్మయాచ్యుత !
స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ !! 73

నష్టః - మోహః - స్మృతిః - లబ్ధాః - త్వత్ప్రసాదాత్ - మయా - అచ్యుత
స్థితః - అస్మి - గతసందేహః - కరిష్యే - వచనం - తవ


అచ్యుత - కృష్ణా, త్వత్ప్రాసాదాత్ - నీ అనుగ్రహము వలన, మోహః - మోహము, నష్టః - నశించునది, మయా - నాచేత, స్మృతిః - స్మృతి, లబ్ధా - పొందబడినది, గతసందేహః - సందేహములు తొలగి, స్థితః - ఉన్నవాడను, అస్మి - అగుచున్నాను, తవ - నీ యొక్క, వచనం - ఆజ్ఞను, కరిష్యే - ఆచరింతును.

అర్జునుడు పలికెను - ఓ అచ్యుతా ! నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. జ్ఞానము పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను ఆచరించెదను.

సంజయ ఉవాచ
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః !
సంవాదమిమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ !! 74

ఇతి - అహం - వాసుదేవస్య - పార్థస్య - చ - మహాత్మనః
సంవాదం - ఇమం - అశ్రౌషం - అద్భుతం - రోమహర్షణం


అహం - నేను, ఇతి - ఇట్లు, వాసుదేవస్య - శ్రీకృష్ణుని యొక్కయు, మహాత్మనః - మహాత్ముడగు, పార్థస్య చ - పార్థుని యొక్కయు, అద్భుతం - అద్భుతమైనదియు, రోమహర్షణం - గగుర్పాటును కలిగించునదియునగు, ఇమం - ఈ, సంవాదం - సంవాదమును, అశ్రౌషం - వింటివి.

సంజయుడు పలికెను - ఈ విధముగా శ్రీవాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది ఆశ్చర్యకరమైనది. తనువు జలదరిస్తోంది.

వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యతమ పరమ్ !
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ !! 75

వ్యాసప్రసాదాత్ - శ్రుతవాన్ - ఏతత్ - గుహ్యం - అహం - పరం
యోగం - యోగేశ్వరాత్ - కృష్ణాధ్ - సాక్షాత్ - కథయతః - స్వయం


వ్యాసప్రసాదాత్ - వ్యాసభగవానుని అనుగ్రహము వలన, గుహ్యం - గుహ్యమైనదియు, పరం - ఉత్తమమైనదియునగు, ఏతత్ - ఈ, యోగం - యోగమును, స్వయం - స్వయముగ, కథయతః - చెప్పనటువంటి, యోగేశ్వరాత్ - యోగేశ్వరుడైనట్టి, కృష్ణాత్ - శ్రీకృష్ణుని వలన, అహం - నేను, సాక్షాత్ - ప్రత్యక్షముగ, శ్రుతవాన్ - వినివాడనైతిని.

వేదవ్యాసునికృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై, పరమరహస్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్ష్యముగా వినగలిగాను.

రాజన్ సంస్కృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ !
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః !! 76

రాజన్ - సంస్కృత్య - సంస్కృత్య - సంవాదం - ఇమం - అద్భుతం
కేశవార్జునయోః - పుణ్యం - హృష్యామి - చ - ముహుర్ముహుః


రాజన్ - రాజా, పుణ్యం - పుణ్యకరమైన, ఇమం - ఈ, అద్భుతం - ఆశ్చర్యకరమైన, కేశవార్జునయోః - కృష్ణార్జునులయొక్క, సంవాదం - సంవాదమును, సంస్కృత్య - తలచితలచి, ముహుర్ముహుః - మాటిమాటికిని, హృష్యామి చ - సంతసించుచున్నాము.

ఓ రాజా ! శ్రీ కృష్ణభగవానునకును అర్జునునకును మధ్య జరిగిన రహస్యమైన ఈ సంవాదము అతి పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను పరవశించిపోతున్నాను.

తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః !
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః !! 77

తత్ - చ - సంస్కృత్య - సంస్కృత్య - రూపం - అతి - అద్భుతం - హరేః
విస్మయః - మే - మహాన్ - రాజన్ - హృష్యామి - చ - పునః - పునః


రాజన్ - రాజా, హరేః - శ్రీకృష్ణునియొక్క, అత్యద్భుతం - మిక్కిలి అద్భుతమైన, తత్ - ఆ, రూపం చ - రూపమును, సంస్కృత్య - తలచి తలచి, మే - నాకు, మహాన్ - గొప్ప, విస్మయః - ఆశ్చర్యము కలుగుచున్నది, పునః పునః చ - మరలా మరల, హృష్యామి చ - సంతసించుచున్నాను.

ఓ రాజా ! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము ఐన ఆ శ్రీహరిరూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు హద్దు లేదు. తత్ర్పభావమున మరలమరల సంతోషము కలుగుతోంది.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః !
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ !! 78

యత్ర - యోగేశ్వరః - కృష్ణ - యత్ర - పార్థః - ధనుర్ధరః
తత్ర - శ్రీః - విజయః - భూతి - ధ్రువా - నీతిః - మతిః - మమ


యత్ర - ఎచ్చట, యోగేశ్వరః - యోగేశ్వరుడగు, కృష్ణః - శ్రీకృష్ణుడు, యత్ర - ఎచ్చట, ధనుర్ధరః - ధనుస్సును ధరించిన, పార్థః - అర్జునుడు, తత్ర - అచ్చట, శ్రీః - లక్ష్మియు, విజయః - విజయము, భూతిః - ఐశ్వర్యము, ధ్రువా - స్థిరమగు, నీతిః - నీతియు, ఇతి - అని, మమ - నా యొక్క, మతిః - అభిప్రాయము.


ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడును, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండునో అక్కడ సంపదలును, సర్వవిజయములును, సకలైశ్వర్యములును, సుస్థిరమైన నీతియుండును అని నా అభిప్రాయము.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసన్న్యాసయోగోనామ అష్టాదశోధ్యాయః !!
ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.