భగవద్గీత చాప్టర్ - 17

 

అథ సప్తదశోధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః

అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః !
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః !! 1

యే - శాస్త్రవిధిం - ఉత్సృజ్య  - యజంతే - శ్రద్ధయా - అన్వితాః
తేషాం - నిష్ఠా - తు - కా - కృష్ణ - సత్త్వం - ఆహో - రజః - తమః


కృష్ణ - కృష్ణా, యే - ఎవరు, శాస్త్రవిధిం - శాస్త్రప్రమాణమును, ఉత్సృజ్య - విస్మరించి, శ్రద్ధయా - శ్రద్ధతో, అన్వితాః - కూడినవారై, యజంతే - సేవించుచున్నారో, తేషాం - వారియొక్క, నిష్ఠా తు - స్థితి, కా - ఎట్టిది, సత్త్వం - సత్త్వమా, ఆహో - లేక, రజః - రజస్సా, తమః - తమస్సా.

అర్జునుడు ఇట్లు పలికెను - కృష్ణా! శాస్త్రవిధిని వదిలి, భక్తిశ్రద్ధలతో యజ్ఞములనుగాని, దైవపూజలనుగాని కొందఱు చేయుచుందురు. వారినిష్ఠ సాత్త్వికమా? రాజసమా? తామసమా?

శ్రీ భగవాన్ ఉవాచ
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా!
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు !! 2

త్రివిధా - భవతి - శ్రద్ధా - దేహినాం - సా - స్వభావజా
సాత్త్వికీ - రాజసీ - చ - ఏవ - తామసీ - చ - ఇతి - తాం - శృణు


దేహినాం -  మనుష్యులకు, స్వభావజా - స్వభావముచే పుట్టిన, సా - ఆ, శ్రద్ధ, సాత్త్వికీ - సాత్వికము, రాజసీ - చ ఏవ - రాజసము, తామసీ చ - తామసము, ఇతి - అని, త్రివిధా - మూడువిధములు, భవతి - అగుచున్నది, తాం - దానిని, శృణు - ఆలకించుము.

శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - శాస్త్రోకముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి  ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్త్వికము, రాజసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము.

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత !
శ్రద్ధమాయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః !! 3

సత్త్వానురూపా - సర్వస్య - శ్రద్ధా - భవతి - భారత
శ్రద్ధామయః - అయం - పురుషః - యః - యత్ - శ్రద్ధః - సః - ఏవ - సః


భారత - అర్జునా, సర్వస్వ - సర్వులకు, సత్త్వానురూపా - అంతఃకరణకనురూపమైన, శ్రద్ధా - శ్రద్ధ, భవతి - కలుగుచున్నది, అయం - ఈ, పురుషః - పురుషుడు, శ్రద్ధామయః - శ్రద్ధామయుడు, యః - ఎవడు, యత్ శ్రద్ధః - ఎటువంటి శ్రద్ధ కలవాడో, సః - అతడు, సః ఏవ - అట్టివాడే.

అర్జునా ! సర్వప్రాణులకు వారి అంతఃకరణరీతులకు తగినట్లు శ్రద్ధ ఉండును. ప్రతివ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసికొన  వచ్చును.

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః !
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః !! 4

యజంతే - సాత్త్వికాః - దేవాన్ - యక్షరక్షాంసి - రాజసాః
ప్రేతాన్ - భూతగణాన్ - చ - అన్యే - యజంతే - తామసాః - జనాః


సాత్త్వికాః - సాత్త్వికులు, దేవాన్ - దేవతలను, రాజసాః - రజోగుణముగలవారు, యక్షరక్షాంసి - యక్షులను రాక్షసులను, యజంతే - పూజించుచున్నారు, అన్యే - ఇతరులైన, తామసాః - తామసులైన, జనాః - జనులు, ప్రేతాన్ - ప్రేతములను, భూతగణాన్ చ - భూతగణములను, యజంతే - పూజించుచున్నారు.

వారిలో సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించుచున్నారు.

అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః !
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః !! 5

అశాస్త్రవిహితం - ఘోరం - తప్యంతే - యే - తపః -  జనాః
దంభాహంకార సంయుక్తాః - కామరాగబలాన్వితాః


అశాస్త్రవిహితం - శాస్త్ర విరుద్ధమును, ఘోరం - భయంకరమునైన, తపః - తపమును, యే - ఎట్టి, జనాః - జనులు, దంభాహంకార సంయుక్తాః - దంభముతోను కూడినవారు, కామరాగబలాన్వితాః - కామరాగబలముతో కూడినవారు....

దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనః సంకల్పితమైన ఘోరతపస్సులను చేయుదురు.

కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః !
మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ !! 6

కర్షయంతః - శరీరస్థం - భూతగ్రామం - అచేతసః
మాం - చ - ఏవ - అంతః శరీరస్థం - తాన్ - విద్ధి - ఆసురనిశ్చయాన్ 


శరీరస్థం - శరీరము లోపలనున్న, భూతగ్రామం - ఇంద్రియములను, అంతః శరీరస్థం - అంతర్యములో ఉన్న, మాం చ ఏవ - నన్నును, కర్షయంతః - కృశింపజేయుచున్నవారై, తప్యంతే - తపస్సుచేయుచున్నారో, తాన్ - అట్టి, అచేతసః - అవివేకులు, ఆసుర నిశ్చయాన్ - అసురస్వభావము గలవారినిగ, విద్ధి - గ్రహించుము.

శరీరములందున్న జీవులను, మరియు అంతర్యామిని అనగా పరమాత్మడనైన నన్ను కృశింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని తెలిసికొనుము.

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః !
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు !! 7

ఆహారః - తు - అపి - సర్వస్య - త్రివిధః - భవతి - ప్రియః
యజ్ఞః - తపః - తథా - దానం - తేషాం - భేధం - ఇమం - శృణు


సర్వస్య - సర్వులకును, ఆహారః తు పి - ఆహారముకూడాను, త్రివిధః - మూడువిధములు, ప్రియః - ప్రియమైనది, భవతి - అగుచున్నది, తథా - అటులనే, యజ్ఞః - యజ్ఞము, తపః - తపస్సు, దానం - దానమును, తేషాం - వానియోక్క, ఇమం - ఈ, భేదం - భేదమును, శృణు - వినుము.

సర్వజనులకు వారికి ఇష్టములైన ఆహారములు గూడ మూడు విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు గూడా మూడేసివిధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా తెలిసికొనుము.

ఆయుః సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః !
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః !! 8

ఆయుః - సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః
రాస్యాః - స్నిగ్థాః - స్థిరాః - హృద్యాః - ఆహారాః - సాత్త్వికప్రియాః


ఆయుః - ఆయువును, సత్త్వః - సత్త్వమును, బలః - బలమును, ఆరోగ్యః - ఆరోగ్యమును, సుఖః - సుఖమును, ప్రీతిః - సంతోషమును, వివర్ధనాః - వృద్ధిచేయునవియు, రస్యాః - రసరూపమైనవియు, స్నిగ్ధాః - చమురుగలవియు, స్థిరాః - చిరకాలముండునవియు, హృద్యాః - మనస్సునకు ప్రియమగు, ఆహారాః - ఆహారములు, సాత్త్వికప్రియాః - సాత్త్వికులకు ప్రియములు.

ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధపదార్థములును, ఒజస్సును అభివృద్ధిపరచు స్థిరపదార్థములును, సాత్త్వికస్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ప్రియములు.

కట్వామ్లలవణాత్యుష్ణతీక్షరూక్షవిదాహినః !
ఆహార రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః !! 9

కటు - ఆమ్ల - లవణాత్యుష్ట - తీక్ష - రూక్ష - విదాహినః
ఆహారాః - రాజసస్య - ఇష్టాః - దుఃఖశోకామయప్రదాః 


కటు - చేదుగాను, ఆమ్ల - పులుపుగాను, లవణ - ఉప్పగాను, అత్యుష్ణ - మిక్కిలి వేడిగాను, తీక్ష - కారముగాను, రూక్ష - రసహీనముగాను, విదాహీనః - దాహము కలుగజేయునవియు, దుఃఖశోకమయప్రదాః - దుఃఖమును శోకమును కలుగజేయునవియు, ఆహారాః - ఆహారములు, రాజసస్య - రజోగుణము గలవారికి, ఇష్టాః - ఇష్టములు.

చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబందించినవి, మిక్కిలి వేడివస్తువులు, మాడిన పదార్థములు రాజసస్వభావము గలవారికి ప్రియములు.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ !
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ !! 10

యాతమామం - గతరసం - పూతి - పర్యుషితం - చ - యత్
ఉచ్ఛిష్టం - అపి - చ - అమేధ్యం - భోజనం - తామసప్రియం


యాతయామం - వండిన తరువాత ఒక జాము గడిచినది, గతరసం - రసము పోయినది, పూతి - దుర్గంధమైనది, పర్యుషితం చ - ఒకరోజు నిలువ యున్నదియు, ఉచ్ఛిష్టం అపి - తినగా మిగిలినదియు, అమేధ్యం చ అశుద్ధమైనదియు, యత్ - ఏ, భోజనం -  భోజనము కలదో, తత్ - అది, తామస ప్రియం - తామసులకు ప్రియము.

సరిగ్గా ఉడకనివి, పండనివి రసహీనములు, చెడువాసనగలవి పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామసులకు ప్రియమైనవి.

అఫలాకింక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే !
యష్టవ్యమేపతి మనః సమాధాయ స సాత్త్వికః !! 11

అఫలాకాంక్షిభిః - యజ్ఞః - విధిదృష్టః - యః - ఇజ్యతే
యష్టవ్యం - ఏవ - ఇతి - మనః - సమాధాయ - సః - సాత్త్వికః 


విధిదృష్టః - శాస్త్రసమ్మతమైనదియు, యష్టవ్యం ఏవ ఇతి - యజ్ఞము చేయుటయే విధియని, మనః - మనస్సును, సమాధాయ - సమాధానపరచుకొని, అపలాకాంక్షిభిః - ఫలాపేక్షలేనివారిచే, యః - ఏ, యజ్ఞః - యజ్ఞము, ఇజ్యతే - చేయుబడుచున్నదో, సః - అది, సాత్త్వికః - సాత్త్వికమైనది.

శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడు నదియు ఐన యజ్ఞము సాత్త్వికమనబడుచున్నది.

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ !
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ !! 12

అభిసంధాయ - తు - ఫలం - దంభార్థం - అపి - చ - ఏవ - యత్
ఇజ్యతే - భరతశ్రేష్ఠం - తం - యజ్ఞః - విద్ధి - రాజసం  


భరతశ్రేష్ట - అర్జునా, యత్ - ఏది, ఫలం - ఫలమును, అభిసంధాయ తు - వాంఛించిగాని, దంభార్థం అపి చ ఏవ - దంభము కొరకుగాని, ఇజ్యతే - చేయబడు చున్నదో, తం - ఆ, యజ్ఞం - యజ్ఞము, రాజసం - రాజస యజ్ఞముగా, విద్ధి - తెలిసికొనుము.

కాని ఓ అర్జునా ! సరియైన నిష్ఠలేకుండ ఆడంబరము కొరకు ఆచరింపబడునదియు. ప్రతిఫలాపేక్షతో చేయబడుచునదియు అగు యజ్ఞము రాజసయజ్ఞము అని తెలిసికొనుము.

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ !
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే !!  13

విధిహీనం - అసృష్టాన్నం - మంత్రహీనం - అడక్షిణం
శ్రద్ధావిరహితం - యజ్ఞం - తామసం - పరిచక్షతే


విధిహీనం - విధిరహితమైనదియు, అసృష్టాన్నం - అన్నదానములేనిదియు, మంత్రహీనం - మంత్రయుతము గానిదియు, అదక్షిణం  - దక్షిణలేనిదియు, శ్రద్దావిరహితం - శ్రద్ధ లేనిదియు, యజ్ఞం - యజ్ఞమును, తామసం - తామసమని, పరిచక్షతే - చెప్పుచున్నారు.

శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదానరహితమైనదియు, మంత్రహీన మైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామసయజ్ఞము అని చెప్పుచున్నారు.

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ !
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే !! 14

దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం - శౌచం - ఆర్జవం
బ్రహ్మచర్యం - అహింసా - చ - శారీరం - తపః - ఉచ్యతే


దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం దేవతలు బ్రాహ్మణులు గురువులు పండితులునగు వారియొక్క పూజయును, శౌచం - శుభ్రతయు, ఆర్జవం - ఋజుత్వమును, బ్రహ్మ చర్యం - బ్రహ్మచర్యమును, అహింసా చ - హింస లేకుండుటయు, శారీరం - దేహసంబంధమైన, తపః - తపస్సుగ, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు అని చెప్పుచున్నారు.

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ !
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయమ్ తప ఉచ్యతే !! 15

అనుద్వేగకరం - వాక్యం - సత్యం - ప్రియహితం - చ - యత్
స్వాధ్యాయాభ్యసనం - చ - ఏవ - వాజ్మయం - తపః - ఉచ్యతే


అనుద్వేగకరం - ఉద్వేగకరము గానిదియు, సత్యం - సత్యమైనదియు, ప్రియః - ప్రియమైనదియు, హితం చ హితమైనదియును అగు, యత్ - ఏ, వాక్యం - వాక్యము, స్వాధ్యాయాభ్యసనం చ ఏవ - వేదధ్యయనము, వాజ్మయం - వాక్సంబంధమైన, తపః - తపస్సుగ, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

ఉద్రేకమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును కలుగచేయునది, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము, మొదలగునవి యన్నియును వాచిక తపస్సుగ చెప్పబడుచున్నవి.

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః !
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే !! 16

మనఃప్రసాదః - సౌమ్యత్వం - మౌనం - ఆత్మవినిగ్రహః
భావసంశుద్ధిః - ఇతి - ఏతత్ - తపః - మానసం - ఉచ్యతే

మనఃప్రసాద - మనస్సు ప్రశాంతత నొందుట, సౌమ్యత్వం - శాంత భావము, మౌనం -  మౌనము, ఆత్మవినిగ్రహః - ఆత్మనిగ్రహము, భావసంశుద్ధిః - అంతఃకరణశుద్ధి, ఇతి ఏతత్ - అనునది, మానసం - మనః సంబంధమైన, తపః - తపస్సుగను, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

మానసిక ప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసికతపస్సులుగా చెప్పబడుచున్నవి.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః !
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే !! 17

శ్రద్ధయా - పరయా - తప్తం - తపః - తత్ - త్రివిధం - నరైః
అఫలాకాంక్షిభిః - యుక్తైః - సాత్త్వికం - పరిచక్షతే


అఫలాకాంక్షిభిః - ఫలమును కోరనివారు, యుక్తైః - యోగులును అయిన, నరైః - నరులచేత, పరయా - ఉత్తమమైన, శ్రద్ధయా - శ్రద్ధతో, తప్తం - ఆచరించబడిన, తత్ - ఆ, త్రివిధం - మూడువిధములైన, తపః - తపస్సును, సాత్త్వికం - సాత్త్వికముగ, పరిచక్షతే - చెప్పుచున్నారు.

శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్త్విక తపస్సులు అని చెప్పబడుచున్నవి.

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ !
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ !! 18

సత్కారమాన పూజార్థం - తపః - దంభేన - చ - ఏవ - యత్
క్రియతే - తత్ - ఇహ - ప్రోక్తం - రాజసం - చలం - అధ్రువం


సత్కార - సత్కారము కొరకును, మాన - గౌరవము కొరకును, పూజార్థం - పూజకొరకును, దంభేన చ ఏవ - కేవలము డంబముచేతను, యత్ - ఏ, తపః - తపస్సు, క్రియతే - చేయబడుచున్నదో, తత్ - అది, ఇహ - ఈ లోకమందు, చలం - నిలకడలేనిదిగా, అధ్రువం - అస్థిరమైనదిగా, రాజసం - రజోగుణ సంబంధమైనదిగా, ప్రోక్తం - చెప్పబడినది.

ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందు కొనుటకును, స్వార్థప్రయోజనముల కొరకును, దంభముతో చేయబడుననియు, అనిశ్చి తఫలములనుగాని, క్షణికఫలములను గాని ఇచ్చునవియు ఐన తపస్సులను రాజసతపస్సులు అని అందురు.

మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః !
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ !! 19

మూఢగ్రాహేణ - ఆత్మనః - యత్ - పీడయా - క్రియతే - తపః
పరస్య - ఉత్పాదనార్థం - వా - తత్ - తామసం - ఉదాహృతం


మూఢగ్రాహేణ - మూర్ఖపుపట్టుదలతో, ఆత్మనః - ఆత్మయొక్క, పీడయా - పీడచేగాని, పరస్య - ఇతరులయొక్క, ఉత్సాదనార్థం వా - నాశనముకొరకు గాని, యత్ - ఏ, తపః - తపస్సు, క్రియతే - చేయబడుచున్నదో, తత్ - అది, తామసం - తామస తపస్సని, ఉదాహృతం - చెప్పబడుచున్నది.

మొండిపట్టుదలతో మనోవాక్కాయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను తామసమని అందురు.

దాత్యవ్యమితి యద్థానం దీయతేనుపకారిణే !
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ !! 20

దాతవ్యం - ఇతి - యత్ - దానం - దీయతే - అనుపకారిణే
దేశే - కాలే - చ - పాత్రే - చ - తత్ - దానం - సాత్త్వికం - స్మృతం


దేశే - దేశమునందును, కాలే చ - కాలమునందును, పాత్రే చ - అవసరమున్న వాజూనికి, అనుపకారిణే - ప్రత్యుపకారము చేయలేని వారి కొరకు, దాతవ్యం ఇతి - ఇవ్వదగినదే యని, యత్ - ఏ, దానం - దానము, దీయతే - ఇవ్వబడుచున్నదో, తత్ - ఆ, దానం - దానము, సాత్త్వికం - సాత్త్వికమని, స్మృతం - తలపబడినది.

దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైనవారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము సాత్త్వికమనబడుచున్నది.

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః !
దీయతే చ పరిక్లిష్టం తద్ధానం రాజసం స్మృతమ్ !! 21

యత్ - తు - ప్రత్యుపకారార్థం - ఫలం - ఉద్దిశ్య - వా - పునః
దీయతే - చ - పరిక్లిష్టం - తత్ - దానం - రాజసం - స్మృతం


ప్రత్యుపకారార్థం - ప్రత్యుపకారము కొరకుగాని, పునః - మరల, ఫలం - ఫలమును, ఉద్దిశ్య నా - ఉద్దేశించికాని, పరిక్లిష్టం - అతికష్టముతో, యత్ - ఏది, దీయతే చ - ఈయబడుచున్నదో, తత్ - ఆ, దానం తు - దానము, రాజసం - రాజసమని, స్మృతం - చెప్పబడుచున్నది.

ప్రత్యుపకారము కొరకుగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని చెప్పబడుచున్నది. 

ఆదేశకాలే యద్దానమ్ అపాత్రేభ్యశ్చ దీయతే !
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ !! 22

అదేశకాలే - యత్ - దానం - అపాత్రేభ్యః - చ - దీయతే
అసత్కృతం - అవజ్ఞాతం - తత్ - తామసం - ఉదాహృతం


అదేశకాలే - అనుచితదేశకాలములందు, అపాత్రేభ్యః చ - అపాత్రులకొరకు, అసత్కృతం - అసత్కార్యముగ, అవజ్ఞాతం - నిర్లక్ష్యముతో, యత్ - ఏ, దానం - దానము, దీయతే - ఇవ్వబడుచున్నదో, తత్ - అది, తామసం - తామసదానమని, ఉదాహృతం - చెప్పబడినది.

సద్భావములేకుండా, దానము పుచ్చుకొనువారియెడల గౌరవాదరములనుచూపక, తృణీకారభావములతో ఛీకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానమూ, దేశకాలోచితముకాని దానమూ, తామసదానము అని చెప్పబడును.

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః !
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా !! 23

ఓం - తత్ - సత్ - ఇతి - నిర్దేశః - బ్రహ్మణః - త్రివిధః - స్మృతః
బ్రాహ్మణాః - తేన - వేదాః - చ - యజ్ఞాః - చ - విహితాః - పురా 


బ్రహ్మణః - బ్రహ్మముయొక్క, నిర్దేశః - నిర్దేశము, ఓం ఇతి - ఓం అని, తత్ ఇతి - తత్ అని, సత్ ఇతి - సత్ అని, త్రివిధః - మూడు విధములుగ, స్మృతః - చెప్పబడినది, తేన - దానిచేత, బ్రాహ్మణాః - బ్రాహ్మణులు, వేదాః చ - వేదములు, యజ్ఞాః చ - యజ్ఞములు, పురా - పూర్వము, విహితాః - నిర్మింపబడినవి.

ఓమ్, తత్, సత్ అని మూడువిధములగు పేర్లు పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు నిర్మింపబడినటుల చెప్పబడినది.

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః !
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ !! 24

తస్మాత్ - ఓం - ఇతి - ఉదాహృత్య - యజ్ఞదానతపఃక్రియాః
ప్రవర్తంతే - విధానోక్తాః - సతతం - బ్రహ్మవాదినాం


తస్మాత్ - అందువలన, బ్రహ్మవాదినాం - బ్రహ్మవాదులయొక్క, విధానోక్తాః - శాస్త్రక్తములైన, యజ్ఞఃదానతపఃక్రియాః - యజ్ఞములును దానములును తపస్సులును కర్మలును, ఓం ఇతి - ఓం అని, ఉదాహృత్య - చెప్పి, సతతం - సదా, ప్రవర్తంతే - ప్రవర్తించుచున్నవి.

కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓమ్ అని పలికి ప్రారంభింతురు.

తదిత్యనభిసంధాయ ఫలంయజ్ఞతపఃక్రియా !
దానక్రియాశ్చ వివిధాః - క్రియంతే - మోక్షకాంక్షింభిః !! 25

తత్ - ఇతి - అనభిసంధాయ - ఫలం - యజ్ఞ తపః క్రియాః
దానక్రియాః - చ - వివిధాః -  క్రియంతే - మోక్షకాంక్షిభిః


మోక్షకాంక్షిభిః - మోక్షాపేక్షగలవారిచేత, తత్ ఇతి - తత్ అని, ఫలం - ఫలమును, అనభిసంధాయ - అభిలషించక, వివిధాః - వివిధములైన, యజ్ఞతపః క్రియాః - యజ్ఞతపః కర్మలు, దానక్రియాః చ - దానక్రియలును, క్రియంతే - ఆచరించబడుచున్నవి.

మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదానతపశ్చర్యలను ఇదియంతయును పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు ఆచరించేదరు.

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే !
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ధః పార్థ యుజ్యతే !! 26

సద్భావే - సాధుభావే - చ - సత్ - ఇతి - ఏతత్ - ప్రయుజ్యతే
ప్రశస్తే - కర్మణి - తథా - సత్ - శబ్దః - పార్థ - యుజ్యతే


పార్థ - అర్జునా, సద్భావే - సత్తుయనెడి భావమునందు, సాధుభావే చ - మంచిది యనెడి భావమునందు, సత్ ఇతి - సత్ అనెడి, ఏతత్ - ఇది, ప్రయుజ్యతే - వాడబడుచున్నది, తథా - అటులనే, ప్రశస్తే - ప్రశస్తమైన, కర్మణి - కర్మమందును, సత్ శబ్దః - సత్ శబ్ధః - సత్ అను శబ్దము, యుజ్యతే - వాడబడుచున్నది.

అర్జునా! సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును, శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణమునందును సత్ అను శబ్దము వాడబడుచున్నది.

యజ్ఞే తపసి దానే చ స్థితిః స్యదితి చోద్యతే !
కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే !! 27

యజ్ఞ - తపసి - దానే - చ - స్థితిః - సత్ - ఇతి - చ - ఉచ్యతే
కర్మ - చ - ఏవ - తదర్థీయం - సత్ - ఇతి - ఏవ - అభిధీయతే


యజ్ఞే - యజ్ఞమునందును, తపసి - తపస్సునందును, దానేచ - దానము నందును, స్థితిః చ - ఉనికియును, సత్ ఇతి - సత్ అని, ఉచ్యతే - చెప్పబడుచున్నది, తదర్థీయం - బ్రహ్మోద్దేశ్యమైన, కర్మ ఏవ చ - కర్మయును, సత్ ఇతి ఏవ - సత్ అనియే, అభిధీయతే - చెప్పబడుచున్నది.

యజ్ఞదానతపఃస్సులకు సంబంధించిన నిష్ఠ ఆస్తిక భావమును సత్ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మకకర్మలను గూడ సత్ అని పిలువబడుచున్నవి.

ఆశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ !
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ర్పేత్య నో ఇహ !! 28

అశ్రద్ధయా - హుతం - దత్తం - తపః - తప్తం - కృతం - చ - యత్
అసత్ - ఇతి - ఉచ్యతే - పార్థ - న - చ - తత్ - ప్రేత్య - నో - ఇహ


పార్థ - అర్జునా, అశ్రద్ధయా - శ్రద్ధలేకుండా, హుతం - హోమము చేయబడినదియు, దత్తం - దానము చేయబడినదియు, తప్తం - చేయబడిన, తపః - తపస్సును, కృతం చ - చేయబడినదియు, యత్ - ఏది కలదో, తత్ - అది, అసత్ ఇతి - అసత్తు అని, ఉచ్యతే చెప్పబడుచున్నది, ప్రేత్య - పరలోకమునందును, నో - ఫలమునివ్వదు, ఇహ చ - ఈ లోకమునందును, న - ఫలితము నివ్వదు.

అర్జునా ! శ్రద్ధ లేకుండ చేయబడుహోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతరశుభకర్మలన్నియును, అసత్ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఏ విధమైన ప్రయోజనముండదు.

ఓం తత్సదితిశ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే శ్రద్ధాత్రయవిభాగయోగోనామ
సప్తదశోధ్యాయః !!