Read more!

భగవద్గీత పార్ట్ - 27

 

 

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్దో హింసాత్మకోశుచిః !
హర్షశోకానిన్వితః కర్తా రాజసః పరికీర్తితః !! 27

రాగీ - కర్మఫలప్రేప్సుః - లుబ్దః - హింసాత్మకః - అశుచిః
హర్షశోకాన్వితః - కర్తా - రాజసః - పరికీర్తితః


రాగీ - అనురాగము గలవాడు, కర్మఫలప్రేప్సుః - కర్మఫలము నాశించెడివాడు, లుబ్ధః - లుబ్ధుడును, హింసాత్మకః - హింసా స్వభావము గలవాడు, అశుచిః - శుచిత్వము లేనివాడు, హర్షశోకాన్వితః - హర్షశోకములతో గూడినవాడునగు, కర్తా - కర్త, రాజసః - రాజసుడని, పరికీర్తితః - చెప్పబడినాడు.

ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్త అని చెప్పబడ్డాడు.

అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠోనైష్కృతికోలసః !
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే !! 28

అయుక్తః - ప్రాకృతః - స్తబ్దః - శఠః - నైష్కృతికః - అలసః
విషాదీ - దీర్ఘసూత్రీ - చ - కర్తా - తామసః - ఉచ్యతే


అయుక్తః - యుక్తుడు కానివాడు, ప్రాకృతః - పామరుడు, స్తబ్దః - జడుడు, శఠః - వంచకుడు, నిష్కృతికః - ఇతరులను మోసగించి నష్టపరచువాడు, అలసః - సోమరియు, విషాదీ - దుఃఖస్వభావము గలవాడు, దీర్ఘసూత్రీ చ - కాలయాపన చేయువాడు నగు, కర్తా - కర్త, తామసః - తామసుడని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు మొండివాడు, ధూర్తుడు, అకారణముగ ఇతరులవృత్తులకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను (దీర్ఘసూత్రి) - లక్షణములను గలవానిని తామసకర్త అని చెప్పబడ్డాడు.

బుద్దేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు !
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ !! 29

బుద్ధేః - భేదం - ధృతేః - చ - ఏవ - గుణతః - త్రివిధం - శృణు
ప్రోచ్యమానం - అశేషేణ - పృథక్త్వేన - ధనంజయ


ధనంజయ - అర్జునా, గుణతః - గుణములను బట్టి, బుద్ధేః - బుద్ధియొక్కయు, ధృతేః చ ఏవ - ధైర్యము యొక్కయు, పృథక్త్వేన - వేరువేరుగా, అశేషణ - సంపూర్ణముగ, ప్రోచ్యమానం - చెప్పబడుచున్న, త్రివిధం - మూడువిధములైన, భేదం - భేదమును, శృణు - వినుము.

ఓ ధనంజయా ! ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను గూడ గుణభేదముల ననుసరించి మూడు విధములుగా, విభాగ పూర్వకముగా ఆ విషయము వినుము.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే !
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ !! 30

ప్రవృత్తిం - చ - నివృత్తిం - చ - కార్యాకార్యే - భయాభయే
బంధం - మోక్షం - చ - యా - వేత్తి - బుద్ధిః - సా - పార్థ - సాత్త్వికీ 


పార్థ - అర్జునా, యా - ఏ, బుద్ధి, ప్రవృత్తిం చ - ప్రవృత్తి విషయమును, నివృత్తిం చ - నివృత్తివిషయమును, కార్యా కార్యే - కార్యమును, అకార్యమును, భయాభయే - భయమును అభయమును, బంధం - బంధమును, మోక్షం చ - మోక్షమును, వేత్తి - గ్రహించుచున్నదో, సా - ఆ, బుద్ధిః, సాత్త్వికీ - సాత్త్వికమైనది.

ప్రవృత్తి,మార్గమును, నివృత్తిమార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధనమును, మోక్షమును యథార్థముగా తెలిసికొను బుద్ధి సాత్త్వికమైనది.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ !
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ !! 31

యయా - ధర్మం - అధర్మం - చ - కార్యం - చ - అకార్యం - ఏవ - చ
అయథావత్ - ప్రజానాతి - బుద్ధిః - సా - పార్థ - రాజసీ


పార్థ - అర్జునా, యయా - ఏ బుద్ధిచేత, ధర్మం - ధర్మమును, అధర్మం - అధర్మమును, కార్యం చ - కార్యమును, అకార్యం ఏవ చ - అకార్యమును, అయథావత్ - యథార్థము కానట్లు, ప్రజానాతి - తెలిసికొనుచున్నదో, సా - ఆ, బుద్ధిః - బుద్ధి, రాజసీ - రాజసికమైనది.

ఓ పార్థా ! ధర్మాధర్మముల యొక్కయు, కార్యాకార్యముల యొక్కయు, యథార్థ తత్త్వములను తెలియజాలని బుద్ధిని రాజసబుద్ధి యనబడుతోంది.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా !
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ !! 32

అధర్మం - ధర్మం - ఇతి - యా - మన్యతే - తమసా - ఆవృతా
సర్వార్థాన్ - విపరీతాన్ - చ - బుద్ధిః - సా - పార్థ - తామసీ


పార్థ - అర్జునా, యా - ఏ, బుద్ధిః - బుద్ధి, తమసా - అజ్ఞానముచేత, ఆవృతా - ఆవరింపబడినదియై, అధర్మం - అధర్మమును, ధర్మం ఇతి - ధర్మమనియు, సర్వార్థాన్ - సర్వవిషయములను, విపరీతాన్ చ - విపరీతభావము గలవానినిగను, మన్యతే తలంచుచున్నదో, సా బుద్ధిః - ఆ బుద్ధి, తామసీ - తామసికమైనది.

ఓ అర్జునా ! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అంటారు.

ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః !
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ !!  33

ధృత్యా - యయా - ధారయతే - మనః - ప్రాణేంద్రియక్రియాః
యోగేన - అవ్యభిచారిణ్యా - ధృతిః - సా - పార్థ - సాత్త్వికీ


పార్థ - అర్జునా, యయా - ఏ, ధృత్యా - ధృతిచేతను, మనః ప్రాణేంద్రియక్రియాః - మనస్సు, ప్రాణము, ఇంద్రియముల చేష్టలు, అవ్యభిచారిణ్యా - చెదరనుటువంటి, యోగేన - యోగముచేత, ధారయతే - ధరింపబడుచున్నవో, సా - ఆ, ధృతిః - ధైర్యము, సాత్త్వికీ - సత్త్వగుణ ప్రధానమైనది.

అర్జునా! ఇటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనఃప్రాణేంద్రియక్రియ క్రియలను ధారణచేయు శక్తిని సాత్త్వికధృతి అంటారు.

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున !
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థా రాజసీ !! 34

యయా - తు - ధర్మకామార్థాన్ - ధృత్యా - ధారయతే - అర్జున
ప్రసంగేన - ఫలాకాంక్షీ - ధృతిః - సా - పార్థ - రాజసీ


పార్థ - అర్జునా, అర్జున - అర్జునా, యయా - ఏ, ధృత్వా తు - ధృతిచేతను, ఫలాకాంక్షీ - ఫలమునాశించువాడు, ప్రసంగేన - కోరికతో, ధర్మకామార్థాన్ - ధర్మకామములను, ధారయతే - ధరించు చున్నాడో, సా - ఆ, ధృతిః - ధృతి, రాజసి - రాజసికమైనది.
కాని, ఓపార్థా ! అర్జునా ! కర్మఫలేచ్చగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామవిషయములను ధారణచేయు శక్తిని రాజసధృతి అంటారు.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ !
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ !! 35

యయా - స్వప్నం - భయం - శోకం - విషాదం - మదం - ఏవ - చ
న - విముంచతి - దుర్మేధాః - ధృతిః - సా - పార్థ - తామసీ


పార్థ - అర్జునా, దుర్మేధాః - దుర్ముద్ధిగలవాడు, యయా - దేనిచే, స్వప్నం - స్వప్నమును, భయం - భయమును, శోకం - శోకమును, విషాదం - విషాదమును, మదం ఏవ చ - మదమును, న విముంచతి - విడువకున్నాడో, సా - ఆ, ధృతిః - ధృతి, తామసీ - తామసికమైనది.

అర్జునా! నిద్ర, భయము, చింతాశోకములు, ఉతన్మత్తతలను విడువక, దుర్మతియైన మనుష్యుడు వాటినే సంతతము ధారణచేయుచుండును. అట్టి ధృతిని, తామసధృతి అంటారు.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భభరతర్షభ !
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి !! 36

సుఖం - తు - ఇదానీం - త్రివిధం - శృణు - మే - భరతర్షభ
భ్యాసాత్ - రమతే - యత్ర - దుఃఖాంతం - చ - నిగచ్చతి 


భరతర్షభ - అర్జునా, యత్ర - ఎచ్చట, అభ్యాసాత్ - అభ్యాసమువలన, రమతే - రామించు చున్నాడో, దుఃఖాంతం చ - దుఃఖనాశమును కూడ, నిగచ్చతి - పొందుచున్నాడో, మే - నాచేత, ఇదానీం - ఇప్పుడు, త్రివిధం - మూడు విధములైన, సుఖం తు - సుఖమును, శృణు - వినుము.

ఓ భరతశ్రేష్ఠా ! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజనధ్యాన సేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అత్రిక్రమించునో....

యత్తదగ్రే విషమివ పరిణామేమృతోపమమ్ !
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ !! 37

యత్ - తత్ - అగ్రే - విషం - ఇవ - పరిణామే - అమృతోపమం
తత్ - సుఖం - సాత్త్వికం - ప్రోక్తం - ఆత్మబుద్ధిప్రసాదజం


యత్ తత్ - ఏది, అగ్రే - ప్రారంభమున, విషం ఇవ - విషమువలెను, పరిణామే - అనంతమునందు, అమృతోపమం - అమృతమును బోలినదియునై, ఆత్మబుద్ధిప్రసాదజం - తనయొక్క బుద్ధిప్రసన్నత కల్పించుచున్నదో, తత్ - ఆ, సుఖం - సుఖము, సాత్త్వికం - సాత్వికమని, ప్రోక్తం - చెప్పబడినది.

ఓ భరతశ్రేష్ఠా ! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజనసేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును సాత్త్విక సుఖము అంటారు.

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రేమృతోపమమ్ !
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ !! 38

విషయేంద్రియ సంయోగాత్ - యత్ - తత్ - అగ్రే - అమృతోపమం
పరిణామే - విషయం - ఇవ - తత్ - సుఖం - రాజసం - స్మృతం


యత్ తత్ - ఏది, విషయేంద్రియ సంయోగాత్ - విషయేంద్రియసంయోగము వలన, అగ్రే - ఆరంభమున, అమృతోపమం - అమృత తుల్యముగను, పరిణామే - అనంతరము, విషం ఇవ - విషము వలెను, తత్ - ఆ, సుఖం - సుఖము, రాజసం - రాజసికమైనదిగ, స్మృతం - చెప్పబడినది.

విషయేంద్రియసంయోగమువలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగ అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజససుఖము అంటారు.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః !
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ !! 39

యత్ - అగ్రే - చ - అనుబంధే - చ - సుఖం - మోహనం - ఆత్మనః
నిద్రాలస్య ప్రమాదోత్థం - తత్ - తామసం - ఉదాహృతం


యత్ - ఏది, అగ్రే చ - ఆరంభమునందు, అనుబంధే చ - అంతమునందును, ఆత్మనః - తనకు మోహనం - మోహమును, గలుగజేయునదియు, నిద్రాలస్యప్రమాదోత్థం - నిద్ర, అలసత్వము, ప్రమాదము వీటివలన జనించినదియైన, తత్ - ఆ, సుఖం - సుఖము, తామసం - తామసమని, ఉదాహృతం - చెప్పబడినది.


నిద్ర, సోమరితనము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామససుఖము అనబడుచున్నది. ఇట్టి సుఖము భోగసమయము నందును, పరిణామమునందునుఆత్మను మోహింపజేస్తుంది.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః !
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః !! 40

న - తత్ - అస్తి - పృథివ్యాం - వా - దివి - దేవిషు - వా - పునః
సత్త్వం - ప్రకృతిజైః - ముక్తం - యత్ - ఏభిః - స్యాత్ - త్రిభిః - గుణైః


ప్రకృతిజైః - ప్రకృతివలన జనించిన, ఏభిః - ఈ, త్రిభిః - మూడైన, గుణైః - గుణముల చేత, ముక్తం - విడువబడిన, సత్త్వం - సత్త్వము, యత్ - ఏది, స్యాత్ - కలదో, తత్ - అది, పృథివ్యాం వా - భూలోకమునందుగాని, దివి - స్వర్గలోకమునందుగాని, పునః - మరల, దేవేషు వా - దేవతల యందు గాని, న అస్తి - లేదు.

పృథివియందు గాని, ఆకాశమునందు గాని, దేవతలయందు గాని, మరేయితర లోకములయందుగాని, ప్రకృతినుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండ ఏ ప్రాణియు కనబడదు.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప !
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః !! 41

బ్రాహ్మణ - క్షత్రియవిశాం - శూద్రాణాం - చ - పరంతప
కర్మాణి - ప్రవిభక్తాని - స్వభావ - ప్రభవైః - గుణైః


పరంతప - అర్జునా, బ్రాహ్మణక్షత్రియవిశాం - బ్రాహ్మణక్షత్రియ వైశ్యులకు, శూద్రాణాం చ - శూద్రులకును, స్వభావ ప్రభవైః - స్వభావముచే గలిగిన, గుణైః - గుణములు చేత, కర్మాణి - కర్మములు, ప్రవిభక్తాని - వేర్వేరుగ విభజింపబడినవి.

ఓ పరంతపా ! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలును, శూద్రుల కర్మలును వారివారి స్వాభావికములైన గుణములను బట్టి ప్రత్యేకించబడ్డాయి.

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ !
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మంకర్మస్వభావజమ్ !! 42

శమః - దమః - తపః - శౌచం - క్షాంతిః - ఆర్జవం - ఏవ - చ
జ్ఞానం - విజ్ఞానం - ఆస్తిక్యం - బ్రహ్మకర్మ - స్వభావజం


శమః - అంతఃకరణ నిగ్రహము, దమః - ఇంద్రియ నిగ్రహము, తపః ౦ తపః - తపస్సు, శౌచం - శుచిత్వము, క్షాంతిః - సహనము, ఆర్జవం ఏవ చ - ఋజుత్వము, జ్ఞానం - శాస్త్రవిషయక జ్ఞానము, విజ్ఞానం - అనుభవ జ్ఞానము, ఆస్తిక్యం - ఆస్తిక బుద్ధి, స్వభావజం - స్వభావము వలన కలిగిన, బ్రహ్మకర్మ - బ్రాహ్మణుల కర్మము.

అంతఃకరణనిగ్రహము ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాథములను క్షమించుట, మనశ్శరీరేంద్రియముల సరళత్వము వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వానుభవము ఇవి యన్నియును బ్రాహ్మణుల నియమిత కర్మమైయున్నది.

శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ !
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ !! 43

శౌర్యం - తేజః - ధృతిః - దాక్ష్యం - యుద్ధే - చ - అపి - అపలాయనం
దానం - ఈశ్వరభావః - చ - క్షాత్రం - కర్మ - స్వభావజం


శౌర్యం - శౌర్యము, తేజః - తేజస్సు, ధృతిః - ధీరత్వము, దాక్ష్యం - దక్షత్వము, యుద్ధే - యుద్ధమునందు, అపలాయణం అపి చ - పారిపోకుండుట, దానం - దానగుణము, ఈశ్వరభావః చ - స్వామీ భావము, స్వభావజం - స్వభావ సిద్ధమైన, క్షాత్రం - క్షాత్రియ నియమితంయాన, కర్మ - కర్మము.

శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూప కుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియులకు నియమితమైన కర్మము.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యంకర్మస్వభావజమ్ !
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ !! 44

కృషిగౌరక్ష్య వాణిజ్యం - వైశ్యకర్మ - స్వభావజం
పరిచర్యాత్మకం - కర్మ - శూద్రస్య - అపి - స్వభావజం  


కృషిగౌరక్ష్య వాణిజ్యం - వ్యవసాయం, పశుపాలనము, వ్యాపారము, స్వభావజం - స్వభావ జనితమైన, వైశ్యకర్మ - వైశ్యోచితమైన కర్మము, శూద్రస్య అపి - శూద్రునకును, పరిచర్యాత్మకం - పరిచర్య రూపమైన, కర్మ - కర్మము, స్వభావజం - స్వభావసిద్ధమైనది.

వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్నియును వైశ్యులస్వాభావిక కర్మలు, అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రునకు స్వభావమైన కర్మయై యున్నది.

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః !
స్వకర్మనిరతః సిద్ధిం యథా విదంతి తచ్ఛృణు !! 45

స్వే - స్వే - కర్మణి - అభిరతః - సంసిద్ధిం - లభతే - నరః
స్వకర్మనిరతః - సిద్ధిం - యథా - విదంతి - తత్ - శృణు


నరః - నరుడు, స్వే స్వే - తమతమ, కర్మణి - కర్మమునందు, అభిరతః - శ్రద్ధగలవాడై, సంసిద్ధిం - సిద్ధిని, లభతే - పొందుచున్నాడు, స్వకర్మనిరతః - తన కర్మమందు నిరతుడైనవాడు, సిద్ధిం - సిద్ధిని, యథా - ఎటుల, విదంతి - పొందుచున్నాడో, తత్ - దానిని, శృణు - వినుము.

మనుజుడు తనదియైన కర్మమునందు పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మనిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను.

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ !
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః !! 46

యతః - ప్రవృత్తిః - భూతానాం - యేన - సర్వం - ఇదం - తతం
స్వకర్మణా - తం - అభ్యర్చ్య - సిద్ధిం - విదంతి - మానవః


భూతానాం - ప్రాణులయొక్క, ప్రవృత్తిః - ఉత్పత్త్యాదులు, యతః - ఎవనివలన కలిగినవో, యేన - ఎవనిచేత, ఇదం - ఈ, సర్వం - సర్వమును, తతం - వ్యాపించబడి యున్నదో, తం - వానిని, మానవః - మానవుడు, స్వకర్మణా - తన కర్మచేతను, అభ్యర్చ్య - ఆరాధించి, సిద్ధిం - సిద్ధిని, విదంతి - పొందుచున్నాడు.

సమస్త ప్రాణుల పుట్టుక పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికకర్మల ద్వారా పూజించి, మానవుడు సిద్ధిని పొందుచున్నాడు.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్థితాత్ !
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ !! 47

శ్రేయాన్ - స్వధర్మః - విగుణః - పరధర్మాత్ - స్వనుష్ఠితాత్
స్వభావనియతం - కర్మ - కుర్వన్ - న - ఆప్నోతి - కిల్బిషం


స్వధర్మః - స్వధర్మము, విగుణః - గుణ హీనమైనను, స్వనుష్ఠితాత్ - చక్కగా ఆచరించబడిన, పరధర్మాత్ - పరధర్మము కంటెను, శ్రేయాన్ - శ్రేయస్కరము, స్వభావ నియతం - స్వభావసిద్ధమైన, కర్మ - కర్మమును, కుర్వన్ - చేయువాడు, కిల్బిషం - పాపమును, న ఆప్నోతి - పొందడు.

బాగుగా ఆచరించబడిన పరధర్మముకంటెను గుణరహితమైన స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుజుడు ఎట్టి పాపము నొందడు.

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ !
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః !! 48

సహజం - కర్మ -  కౌంతేయ - సదోషం - అపి - న - త్యజేత్
సర్వారంభాః - హి - దోషేణ - ధూమేన - అగ్నిః - ఇవ - ఆవృతాః


కౌంతేయ - అర్జునా, సహజం - సహజమైన, కర్మ - కర్మము, సదోషం అపి - దోషయుతమైనను, న త్యజేత్ - విడువరాదు, అగ్నిః - అగ్ని, ధూమేన ఇవ - పొగచేతను వలె, సర్వారంభాః - సకలకర్మలును, దోషేణ - దోషముచేతను, ఆవృతాః హి - ఆవరింపబడియున్నవి గదా!

అర్జునా ! దోషయుక్తమైనను సహజమైన కర్మను వీడరాదు. అగ్ని పొగచే కమ్మబడినట్లు కర్మలన్నియును ఏదేని ఒక దోషముతో కూడియే యుండును.

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః !
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్చతి !! 49

అసక్తబుద్ధిః - సర్వత్ర - జితాత్మా - విగతస్పృహః
నైష్కర్మ్యసిద్ధిం - పరమాం - సంన్యాసేన - అధిగచ్చతి


సర్వత్ర - సర్వవిషయములందును, అసక్తబుద్ధిః - ఆసక్తిలేనివాడై, జితాత్మా - మనస్సున జయించినవాడై, విగతస్పృహః - కోరికలు లేనివాడై, సంన్యాసేన - సన్యాసముచేత, పరమాం - ఉత్తమమైన, నైష్కర్మ్యసిద్ధిం - నిష్కామకర్మ సిద్ధిని, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.

ఓ అర్జునా! ప్రాపంచిక పదార్థములందు ఆసక్తి లేనివాడును, స్పృహరహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్యయోగముద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందుచున్నాడు.

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతినిభోధమే !
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా !! 50

సిద్ధిం - ప్రాప్తః - యథా - బ్రహ్మ - తథా - ఆప్నోతి - నిబోధ - మే
సమాసేన - ఏవ - కౌంతేయ - నిష్ఠా - జ్ఞానస్య - యా - పరా


కౌంతేయ - అర్జునా, సిద్ధిం - సిద్ధిని, ప్రాప్తః - పొందినవాడు, యథా - ఎటుల, బ్రహ్మ - బ్రహ్మమును, ఆప్నోతి - పొండుచున్నాడో, తథా - అటులనే, జ్ఞానస్య - జ్ఞానముయొక్క, పరా - ఉత్తమమైన, నిష్ఠా - నిష్ఠ, యా - ఏదియో, సమాసేన ఏవ - సంక్షిప్తముగా, మే - నావలన, నిబోధ - తెలిసికొనుము.

అర్జునా ! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా వినుము.

బుద్ధ్యావిశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ !
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ !! 51

బుద్ధ్యా - విశుద్ధయా - యుక్తాః - ధృత్యా - ఆత్మానం - నియమ్య - చ
శబ్దాదీన్ - విషయాన్ - త్యక్త్వా - రాగద్వేషౌ -  వుదస్య - చ


విశుద్ధయా - విశుద్ధమైన, బుద్ధ్యా - బుద్ధితో, యుక్తః - కూడినవాడును, ధృత్యా - ధైర్యముతో, ఆత్మానం - తనను, నియమ్య చ - నియమించియును, శబ్దాదీన్ - శబ్దాదీన్ - శబ్దాదులైన, విషయాన్ - విషయములను, త్యక్త్వా - విడచి, రాగద్వేషౌ - రాగద్వేషములను, వ్యుదస్య చ - విడచి.

విశుద్ధమైన బుద్ధితో, ధైర్యముతో ఆత్మనిగ్రహముతో శబ్దాది విషయములను విడచి, రాగద్వేషాదులకు అతీతంగా.......

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః !
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః !! 52

వివిక్తసేవీ - లఘ్వాశీ - యతవాక్కాయమానసః
ధ్యానయోగపరః - నిత్యం - వైరాగ్యం - సముపాశ్రితః


వివిక్తసేవీ - ఏకాంతవాసియు, లఘ్వాశీ - మితాహారియు, యతవాక్కాయ మానసః - స్వాధీనమైన మనోవాక్కాయములు కలవాడు, నిత్యం - ఎల్లప్పుడు, ధ్యానయోగపరః - ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యం - వైరాగ్యమును, నముపాశ్రితః - చక్కగా ఆశ్రయించినవాడు.

పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్త్వికధారణా శక్తిద్వారా అంతఃకరణేంద్రియముల సమయము కలిగి, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను అన్ని వేళలా త్యజించి, ధృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు.

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ !
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే !! 53

అహంకారం - బలం - దర్పం - కామం - క్రోధం - పరిగ్రహం
విముచ్య - నిర్మమః - శాంతః - బ్రహ్మభూయాయ - కల్పతే


అహంకారం - అహంకారమును, బలం - బలమును, దర్పం - దర్పమును, కామం - కామమును, క్రోధం - క్రోధమును, పరిగ్రహం - సంగ్రహమును, విముచ్య - విడచి, నిర్మమః - మమకార రహితుడు, శాంతః - శాంతుడు, బ్రహ్మభూయాయ - బ్రహ్మత్వమును పొందుటకు, కల్పతే - కల్పించుబడు చున్నాడు.

అహంకారమును, బలమును దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదలి, ఎల్లప్పుడు ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు పరబ్రహ్మమునందు అభిన్నభావముతో స్థితుడగుటకు సమర్థుడగుచున్నాడు.

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి !
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ !! 54

బ్రహ్మభూతః - ప్రసన్నాత్మా - న - శోచతి - న - కాంక్షతి
సమః - సర్వేషు - భూతేషు - మద్భక్తిం - లభతే - పరాం


బ్రహ్మభూతః - బ్రహ్మభావమును పొందినవాడు, ప్రసన్నాత్మా - ప్రసన్నచిత్తుడైనవాడు, న శోచతి - దుఃఖించడు, న కాంక్షతి - ఆశించడు, సర్వేషు - సమస్త, భూతేషు - ప్రాణుల యందును, సమః - సమబుద్ధి కలిగి, పరాం - ఉత్తమమైన, మద్భక్తిం - నా భక్తిని, లభతే - పొందుచున్నాడు.

పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేవినీ కాంక్షింపడు. సమస్తప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందుచున్నాడు.

భక్త్యా మామాభిజానాతి యవాన్ యశ్చాస్మి తత్త్వతః !
తతో మాం తత్త్వతో జ్ఞాత్వావిశతే తదనంతరమ్ !! 55

భక్త్యా - మాం - అభిజానాతి - యావాన్ - యః - చ - అస్మి - తత్త్వతః
తతః - మాం - తత్త్వతః - జ్ఞాత్వా - విశతే - తదనంతరం


భక్త్యా - భక్తిచేతను, మాం - నన్ను, తత్త్వతః - యథార్థముగ, యావాన్ - ఎంతటి ప్రభావము గలవాడనో, యః చ అస్మి - ఎట్టివాడనయితినో, అభిజానాతి - గ్రహించు చున్నాడు, తతః - ఆ తరువాత, మాం - నన్ను, తత్త్వతః - యథార్థముగ, జ్ఞాత్వా - తెలిసికొని, తదనంతరం - అటుపిమ్మట, విశతే - ప్రశ్నించుచున్నాడు.


బ్రహ్మభూతుడైనయోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ? ఎంతటి వాడనో ? యథాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నా యందే లీనమగుచున్నాడు.