గీతా జయంతి స్పెషల్: ఉత్తమ జీవితానికి భగవద్గీత ఎందుకు అవసరం?

 

గీతా జయంతి స్పెషల్: ఉత్తమ జీవితానికి భగవద్గీత ఎందుకు అవసరం?


 భగవద్గీత  కలియుగానికి అందిన గొప్ప వరం. డిసెంబర్ 22 ను గీతాజయంతిగా జరుపుకుంటారు. భగవద్గీతను ఆదర్శంగా తీసుకొంటే మనిషికి ఆత్మగౌరవం, స్వేచ్ఛ పెంపొందడంతో పాటు సమత్వ భావన వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన దేశానికి కావలసింది ఇదే. గీతా ఆదర్శం ప్రపంచంలో అందరినీ ఉత్తేజపరుస్తోంది. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద తెలిపారు. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు. మనం మాత్రం దీనిని కేవలం పవిత్ర గ్రంథంగా భావించి, పూజగదికి పరిమితం చేశాం.

 మనిషి పరిపూర్ణుడవడానికి కావలసిన అంశాలు భగవద్గీతలో ఉన్నాయన్న అవగాహన ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆ ఆశయాలను పాటిస్తే వ్యక్తి సౌశీల్యవంతుడవుతాడు. జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది. దేశం ప్రగతి పథంలో ముందుంటుంది. వేదాలు అనే కామధేనువు నుంచి శ్రీకృష్ణుడనే గోవులకాపరి పితికిన 'పాలు' - భగవద్గీత. ఆ పాలు కేవలం పూజగదిలో పెట్టి పూజించడానికి కాదు. అవి మనం తాగడానికి ఉద్దేశించబడినవి. అప్పుడే శక్తి వస్తుంది. అనేక వందల సంవత్సరాల నుంచి ఆ పాలను పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు. అందువల్లే మనం భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా బలహీనులుగానే ఉన్నాం. వాటిని తాగడం మొదలుపెడితే జాతి నూతన జవసత్త్వాలను సంతరించు కుంటుంది. శక్తిమంతంగా తయారవుతుంది.

భగవద్గీత కేవలం మానసిక ప్రశాంతత కాకుండా భగవద్గీత మరేదైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?”అంటే.. 

 'తప్పకుండా; భగవద్గీత కేవలం ప్రశాంతతనే కాదు ధైర్యాన్నీ, బలాన్నీ కూడా ఇచ్చి ఒక వ్యక్తికి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది' .  దీనివల్ల కేవలం ఒక వ్యక్తే  కాదు చుట్టూ పక్కల ఉన్నవాళ్లు కూడా ధైర్యవంతులై, దృఢంగా తయారవుతారు, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. 'ఇది నిద్ర పుచ్చే పుస్తకం కాదు. అందరినీ కర్తవ్య నిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతతో, ఒక ధ్యేయంతో సామాజిక అభివృద్ధికి నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకొనేలా చేస్తుంది' 

ప్రస్తుత తరుణంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆచరణీయ వేదాంతం కావాలి. మన పాదాల వద్ద ఉన్న ప్రమిదలోని జ్ఞానజ్యోతి వెలుగును మెదడు వరకు ప్రసరింప చేయాలి. ధైర్యశాలి అయిన అర్జునుడికి, ధీశాలి అయిన  శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే, ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచం అంతటా కోట్లాది ప్రజలు  దీనిని శతాబ్దాలుగా చదువుతూ పరమోత్కృష్ట ప్రయోజనాన్ని  పొందారు పొందుతున్నారు.  ఆలోచనా పరిధిని విస్తరించు కుంటున్నారు. ఇదే భగవద్గీత ప్రాశస్త్యం, ఇందుకే భగవద్గీత చదవాలి.


                                           *నిశ్శబ్ద